ముగిసిన కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు

AP Cabinet Meeting Ends, Takes Key Decisions - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పలు అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం ఏపీ మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ మేరకు మంత్రి కాలువ శ్రీనివాసులు పలు విషయాలు మీడియాకు వెల్లడించారు.

కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు:
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం కింద డీఏను 22.008 శాతం నుంచి 24.104 శాతానికి పెంచారు. గ్రామ రెవిన్యూ సహాయకులకు ఇస్తున్న మొత్తానికి అదనంగా నెలకు రూ.300 చొప్పున తాత్కాలిక పెంపు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌1న తీసుకొనే మార్చినెల జీతం నుంచి ఇది అందుబాటులోకి రానుంది. పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి రూ.1244.36 కోట్లు మంజూరుకు పరిపాలన అనుమతులు ఇస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

విశాఖ, తిరుపతిలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఇందుకోసం విశాఖలో 2.7 ఎకరాలు, తిరుపతి అన్నమయ్య సర్కిల్‌లో 3.37 ఎకరాలను 33 ఏళ్లపాటు ఎస్‌పీఐ సినిమాస్ ప్రెవేట్ లిమిటెడ్‌కు లీజ్‌కు అనుమతి ఇస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్లలో 23 వేల చ. అ. విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్, 80 వేల చ. అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టులు, వాణిజ్య సముదాయం ఏర్పాటు చేస్తారు. 6 మల్టీ ఫ్లెక్స్ స్క్రీన్లతో ఐమ్యాక్స్ ధియెటర్, 3 స్టార్ల హోటల్ నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులో వారు ప్రతిపాదించిన రూముల కంటే ఎక్కువ సంఖ్యలో రూములను నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు.

వీటి నిర్మనాలకు అయ్యే ఖర్చులను ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్ భరించి పర్యాటక ప్రాజెక్టుగా దీన్ని నిర్వహిస్తుంది. వీటితో పాటు 42 నాన్ అమృత్ పట్టణాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి మండలి తీర్మానించింది. ఎక్స్‌టెర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల క్రింద ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టుమెంట్ బ్యాంక్ చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు పబ్లిక్ హెల్త్ మెడికల్ ఇంజనీరింగ్ విభాగాన్ని సింగిల్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా నియమిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top