ఏపీలో సామాజిక విప్లవం.. కీలక బిల్లులకు ఆమోదం

AP Assembly Approves Historical Bills - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సామాజిక విప్లవానికి నాంది పలుకుతూ.. చరిత్రాత్మక బిల్లులను ఏపీ శాసనసభ మంగళవారం ఆమోదించింది. రాష్ట్రంలోని బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలు, మహిళలకు అన్ని రంగాల్లో చేయూతనందిస్తూ.. అన్ని విధాలుగా మేలు చేస్తూ రూపొందించిన కీలకమైన బిల్లులు అసెంబ్లీ ఆమోదంతో చట్టరూపం దాల్చాయి. ఇది ఆయా వర్గాల వారికి ఒక సుదినం. సువర్ణ అధ్యాయం. నామినేటెడ్‌ పదవుల్లో, నామినేషన్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పిస్తూ తీసుకువచ్చిన చరిత్రాత్మక మహిళా సాధికారిత బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. జనాభాలో సగం ఉన్న మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ బిల్లు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం అన్ని కార్పొరేషన్లు, సొసైటీ పదవుల్లో, బోర్డులు, కమిటీల చైర్‌పర్సన్‌ పదవుల్లో మహిళలకు సగం పదవులు దక్కనున్నాయి. 

ఇక సామాజికంగా వెనుకబడిన బీసీలకు బాసటగా నిలుస్తూ.. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సర్కారు తీసుకొచ్చిన శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు బిల్లు సైతం ఆమోదం పొంది చట్టరూపం దాల్చింది. రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఇప్పటికే సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వర్క్‌, సర్వీస్‌ కాంట్రాక్టుల్లోనూ ఈమేరకు 50శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. 

చాలా గొప్ప విషయం..
నామినేషన్‌ పనుల్లో, పదవుల్లో మహిళలకు 50శాతం​ రిజర్వేషన్‌ కల్పించడం చాలా గొప్ప విషయమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కొనియాడారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ బిల్లును ఆమోదిస్తుండటం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకంతో తల్లులందరికీ చేయూత లభిస్తుందని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌తోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం జరగుతుందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు అవకాశం కల్పించేందుకే తమ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందన్నారు. సామాజిక న్యాయం కోసం సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

మరో సభ్యురాలు జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం తల్లులందరికీ గొప్ప వరమని కొనియాడారు. అమ్మ ఒడితో అక్షరాస్యత రేటు పెరుగుతుందన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించి అమలు చేస్తున్న నవరత్నాల పథకంతో మహిళలందరికీ మేలు జరుగుతుందన్నారు. కాంట్రాక్టుల్లో కూడా మహిళలకు స్థానం కల్పించడం గొప్ప విషయమన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయం పాటిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం డ్వాక్రా రుణామాఫీ పేరుతో మహిళలను నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దళితులుగా పుట్టాలని ఎవరు అనుకుంటారని వ్యాఖ్యలు చేసిన నీచ సంస్కృతి చంద్రబాబుదని వైఎస్సార్‌సీపీ సభ్యుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. దళితులను చంద్రబాబు ఏ ఒక్క రోజూ పట్టించుకోలేదని విమర్శించారు. దళితులకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్‌ జగనేనని పేర్కొన్నారు. సభ్యుడు పీ రాజన్న దొర మాట్లాడుతూ అందరికీ మంచి చేయాలనే ఆలోచన సీఎం వైఎస్‌ జగన్‌ది అని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా అవకాశం కల్పించిన నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ అని అన్నారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top