విపక్ష సభ్యుల నిరసనలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాంతో సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అయిదు నిమిషాలపాటు వాయిదా పడింది.
విపక్ష సభ్యుల నిరసనలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాంతో సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అయిదు నిమిషాలపాటు వాయిదా పడింది. బుధవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే వైఎస్ఆర్ సీపీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దాంతో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు అనుమతించాలంటూ విపక్ష సభ్యులు నిరసనకు దిగారు.
అయినా స్పీకర్ చర్చకు అనుమతించకపోవటంతో సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, నినాదాలతో సభ దద్దరిల్లింది. మరోవైపు సభ్యుల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. సభలో తీవ్ర గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను అయిదు నిమిషాలు వాయిదా వేశారు.