'బిల్లుపై స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలపొచ్చు' | anybody can express opinion on telangana draft bill, says digvijay singh | Sakshi
Sakshi News home page

'బిల్లుపై స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలపొచ్చు'

Dec 13 2013 4:35 PM | Updated on Aug 14 2018 3:55 PM

'బిల్లుపై స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలపొచ్చు' - Sakshi

'బిల్లుపై స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలపొచ్చు'

రాష్ట్ర విభజనపై ఇచ్చిన హామీకి తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఇచ్చిన హామీకి తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ప్రకటించారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్ని విభజనకు ఒప్పుకున్నాకే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని అన్నారు. తెలంగాణ నాయకులతో కలిసి గాంధీ భవన్లో ఈ సాయంత్రం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రపతి ఆమోదం తర్వాత తెలంగాణ ముసాయిదా బిల్లు ఇప్పడు అసెంబ్లీకి వచ్చిందన్నారు. బిల్లును అసెంబ్లీ స్వీకరించిన తర్వాత బీఏసీ సమావేశం ఉంటుందన్నారు. బిల్లుపై చర్చ సమయాన్ని సోమవారం నాడు బీఏసీ నిర్ణయిస్తుందని తెలిపారు. సభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలపొచ్చని చెప్పారు. బిల్లులోని అన్ని క్లాజుల మీద అన్ని అంశాలపై చర్చించాలని సూచించారు. బిల్లుపై చర్చ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీలోని సభ్యులందరూ చర్చలో పాల్గొవచ్చన్నారు.

విభజన తర్వాత ఇరు ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం భరోసా ఇస్తుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. భూ సేకరణ చట్టం ప్రకారమే పోలవరం ప్రాజెక్టు స్థలం సేకరించారని చెప్పారు. గోదావరి, కృష్ణా నదీ జలాల పంపిణీని ప్రత్యేక బోర్డు చేపడుతుందని వెల్లడించారు.

దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివాసం, ఆస్తులు సమకూర్చకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలిపారు. హైదరాబాద్లో నివసించే అన్ని ప్రాంతాల ప్రజలకు బాధ్యతకు ప్రభుత్వం హామీయిస్తుందన్నారు. ఆస్తులు, ఉద్యోగాలకు ఎలాంటి అభద్రతా ఉండదని భరోసాయిచ్చారు. వెనుకబడిన ప్రాంతాల్లో పన్నుల మినహాయింపు ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్‌ నేతపై ఉందని దిగ్విజయ్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement