అధికారం అండతో దారుణం

Andhrabank Scam in Crop Loans in West Godavari - Sakshi

వ్యవసాయ రుణాల మంజూరులో రూ. 20 లక్షల స్కామ్‌

వీరవాసరం మండల టీడీపీ నేత కుమారుడి హస్తం

సహకరించిన బ్యాంకు అధికారులు?

బయటపడుతుందనే భయంతో ఆత్మహత్యాయత్నం

కేసు మాఫీకి టీడీపీ నేతల మల్లగుల్లాలు

పశ్చిమగోదావరి, భీమవరం: జిల్లాలో టీడీపీ నేతల అగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. అధికారం అండతో ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ప్రజాధనాన్ని కొల్లగొట్టేస్తున్నారు. వీరవాసరం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకుడి కుమారుడు కౌలు రైతులకు రుణాల పేరుతో అధికారుల సంతకాన్ని ఫోర్జరీ చేసి లక్షలాది రూపాయల రుణాలు తీసుకున్నాడు. విషయం బయటకు పొక్కడంతో ఆత్మహత్యాయత్నం చేసి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు రుణ పథకం అమలుచేస్తోంది. 5 నుంచి 10 మంది కౌలు రైతులు గ్రూపుగా ఏర్పడి వ్యవసాయశాఖాధికారి ధ్రువీకరణతో జాతీయ బ్యాంకుల్లో రుణం పొందే వెసులుబాటు కల్పించారు. బ్యాంకులకు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరంలేకుండా  రూ. 5 లక్షల వరకు రుణం పొందే అవకాశముంది. దీనిలో గ్రూపు సభ్యులకు రూ. లక్ష వరకు వడ్డీ లేని రుణం, రూ.  3 లక్షల వరకు పావలా వడ్డీకి రుణం ఇస్తారు. కౌలు రైతులను గుర్తించేది  వ్యవసాయశాఖాధికారే అయినా.. వీరి కింద పనిచేసే మల్టీపర్పస్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లు(ఎంపీఈవో) పెత్తనం చెలాయిస్తున్నారు. వ్యవసాయ విçస్తరణ కోసం ప్రభుత్వం ప్రతి వెయ్యి హెక్టార్లకు ఒక ఎంపీఈవోను   నియమించింది. వీరంతా స్థానికులు కావడంతో అ«ధికార పార్టీ నాయకుల అండతో ప్రభుత్వ అధికారులను శాసిస్తున్నారు.

వ్యవసాయాధికారి ఫిర్యాదుతో వెలుగులోకి
వీరవాసరం మండలంలోని తెలుగుదేశం పార్టీ  మండల నాయకుడి కుమారుడు గత కొంతకాలంగా ఎంపీఈవోగా పనిచేస్తున్నాడు. రైతులకు రుణాలు, సబ్సిడీ యంత్ర పరికరాలు, విత్తనాలు వంటివి ఇప్పించి రైతుల నుంచి మామూళ్లు వసూలు చేయడం చేసేవాడు. ఎక్కడైనా తేడా వస్తే పార్టీ నాయకులు కొమ్ముకాస్తారనే ధైర్యంతో గత ఏడాది కౌలు రైతులకు రుణాలు ఇప్పించడంలో అక్రమాలకు పాల్పడ్డాడు. వ్యవసాయశాఖాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి కౌలు రైతుల గ్రూపులు ఏర్పాటుచేసినట్లు ప్రతాలు సిద్ధం చేసి బ్యాంకు అధికారుల సాయంతో లక్షల రూపాయల రుణం పొందాడు. బ్యాంకు రుణం మంజూరుచేసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలకు జమైన సొమ్మును వెంటనే తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకోవడం ప్రారంభించాడు.

గతేడాది నవంబర్‌ నెలలో వ్యవహారం బయటకు పొక్కడంతో వ్యవసాయాధికారి బ్యాంకు అధికారుల్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందని భయపడి వ్యవసాయశాఖాధికారి బ్యాంకు అధికారులను నిలదీయంతో ఒక్క బ్యాంకులోనే  సుమారు రూ. 20 లక్షలు కౌలు రైతులకు తెలియకుండా రుణాలు మంజూరు చేయించి సొంతానికి వాడుకున్నట్లు బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసేందుకు వారు తాత్సారం చేశారు. పోలీసులు కూడా టీడీపీకీ అండగా ఉండడం వల్లే ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేయలేదనే విమర్శలు వినిపించాయి. వ్యవసాయశాఖాధికారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడిందనే భయంతో టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెబుతున్నారు. కాగా వ్యవసాయ రుణాల కుంభకోణం రూ. కోటి వరకు ఉండవచ్చని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఆత్మహత్యాయత్నం డ్రామా అని, కేసునుంచి బయటపడేందుకు టీడీపీ నాయకులు కొత్త డ్రామా తెరపైకి తెచ్చారని అంటున్నారు. దీనిపై సమగ్రంగా విచారణ జరిపితే మరికొన్ని స్కాంలు బయటపడతాయని చెబుతున్నారు.  కేసు మాఫీకి  టీడీపీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top