
'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరుగులేని శక్తిగా మారుస్తా'
రానున్న 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరుగులేని శక్తిగా మారుస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు.
రానున్న 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరుగులేని శక్తిగా మారుస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం హైదరాబాద్ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాష్ట్ర విభజనతో అటు ఉద్యోగులకు, ఇటు రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. వీలైనంత త్వరగా నూతన రాజధానికి వెళ్లిపోవాలని ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులంతా కోరుకుంటున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో ఆంధ్ర ఉద్యోగులు హైదరాబాద్లో ఉంటే రెచ్చగొడతారని ఆయన హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైన గిరిజనులకు మంచి పునరావాసం కల్పించి...ప్రాజెక్టులు కట్టి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
2019లో తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తీసుకువస్తానని ఆయన చెప్పారు. అంతవరకు ఈ ప్రాంతాన్ని వదలని ఆయన స్ప్టష్టం చేశారు. ఉద్యోగులకు అండగా ఉంటానంటూ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. కొత్త రాజధానిలో ఉద్యోగులందరికి మంచి ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కొనసాగిస్తామన్నారు. పోలవరాన్ని తెలంగాణ నాయకులు అడ్డుకోవడం అన్యాయమని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి చాలా అవసరమని చంద్రబాబు ఈ సందర్బంగా విశదీకరించారు.