రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూపొందించిన ఎనిమిది పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చెంగవల్లి వెంకట్ కోరారు.
అమలాపురం: రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూపొందించిన ఎనిమిది పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చెంగవల్లి వెంకట్ కోరారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఆదివారం బ్రాహ్మణ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
8 పథకాల్లో ఒకటైన ద్రోణాచార్య స్కిల్ డెవలప్‌మెంట్ పథకాన్ని ప్రారంభించారు. కార్పొరేషన్ ఇటీవల బ్రాహ్మణుల విద్యా సౌకర్యాల కోసం భారతి, శిక్షణ నిమిత్తం వశిష్ట, నైపుణ్యం పెంపునకు ద్రోణాచార్య, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం చాణక్య, ఆరోగ్యం కోసం చక్ర, ఆహారం కోసం కశ్యప, ఆరామ క్షేత్రాల కోసం విశ్వనాథ్, సంస్కృతి కోసం ఆదిశంకరాచార్య పేర్లతో పథకాలను రూపొందించిందని ఆయన చెప్పారు. ఇప్పటికే భారతి, వశిష్ట పథకాలను ప్రారంభించగా ‘ద్రోణాచార్య’ పథకాన్ని అమలాపురంలో ప్రారంభించమన్నారు.
బ్రాహ్మణ విద్యార్థులకు 18 వేల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు కేటాయించగా... ఇప్పటి వరకు కేవలం 13 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని ఆయన చెప్పారు. బ్రాహ్మణులు వారి సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన పెంచుకోవాలని వెంకట్ సూచించారు. ఈ కార్యక్రమానికి అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ వేదిక కన్వీనర్ డొక్కా నాథ్‌బాబు, రాష్ట్ర బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ రాణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.