రాజధాని ప్రతిపాదిన గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్లు జారీ అవటంతో 27 గ్రామాల్లో భూముల వివరాలను వెల్లడిస్తూ పంచాయతీ కార్యాలయాల్లో అధికారులు నోటీసులు పెట్టారు.
గుంటూరు : రాజధాని ప్రతిపాదిన గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్లు జారీ అవటంతో 27 గ్రామాల్లో భూముల వివరాలను వెల్లడిస్తూ పంచాయతీ కార్యాలయాల్లో అధికారులు నోటీసులు పెట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు అన్ని గ్రామాలకు ప్రత్యేక బృందాలు చేరుకోనున్నాయి. స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చే రైతులకు అధికారులు రశీదులు ఇవ్వనున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) ద్వారా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను సమీకరించడంలో అనుసరించాల్సిన నిబంధనలను వెల్లడిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
కాగా భూ సమీకరణకు ఒక్కసారి సమ్మతి పత్రాలు ఇస్తే సమీప భవిష్యత్తులో ఇక ఎలాంటి అదనపు పరిహారం కోరేందుకు రైతులకు వీలు లేకుండా నిబంధనలు విధించారు. భూములు కోల్పోయిన రైతులు నిరసనలకు దిగడం, కోర్టులకు వెళ్లడం చేయరాదు. భూములపై ఏవైనా బకాయిలు ఉంటే పరిహారంలో ఆ మొత్తాన్ని మినహాయించుకుని మిగతా సొమ్మును మాత్రమే రైతులకు ప్రభుత్వం ఇస్తుంది. భూములిచ్చే రైతులు ఆస్తి పన్ను చెల్లింపు రశీదులతో సహా యాజమాన్య ధ్రువీకరణ పత్రాలన్నీ (ఒరిజినల్) ప్రభుత్వానికి సమర్పించాలి. భూములిచ్చే రైతులు వాటిపై వివాదాలు, లోపాలు ఉంటే వారే బాధ్యత వహించాలి.