అక్రమార్కుల కనుసన్నల్లో లేట‘రైట్ రైట్’ | And, via leta 'Right Right' | Sakshi
Sakshi News home page

అక్రమార్కుల కనుసన్నల్లో లేట‘రైట్ రైట్’

Jun 15 2014 1:42 AM | Updated on Sep 2 2017 8:48 AM

ఏజెన్సీలోని అపారమైన ఖనిజ నిల్వలను దోచుకునేందుకు బడాబాబులు భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని...

  •    యథేచ్ఛగా తవ్వకాలు
  •      అధికారుల వత్తాసు?
  • పాడేరు : ఏజెన్సీలోని అపారమైన ఖనిజ నిల్వలను దోచుకునేందుకు బడాబాబులు భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని బినామీ పేర్లతో రూ.కోట్లు విలువైన లేటరైట్, రంగురాళ్ళను తవ్వుకునేందుకు భారీ వ్యూహరచన చేస్తున్నారు. గిరిజన హక్కులు, చట్టాలను తుంగలోకి తొక్కి దొడ్డిదారిన అనుమతులు పొందేందుకు కూడా మైదాన ప్రాంతంలోని కొంతమంది గిరిజనేతరులు పావులు కదుపుతున్నారు.

    ఇప్పటికే చింతపల్లి మండలంలోని రాజుపాకలు సమీపంలో విలువైన లేటరైట్‌ను బినామీ పేర్లతో గిరిజనేతరులు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. 2002లో ఒక గిరిజనుడికి లేటరైట్ తవ్వకాలపై అనుమతులు ఇచ్చినప్పటికి తర్వాత రోజుల్లో ఏజెన్సీలోని ఖనిజ సంపద పరిరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

    2012లో అప్పటి ఆర్డీవో ఎం.గణపతిరావు లేటరైట్‌తోపాటు ఏ ఖనిజం తవ్వకాలకు అనుమతులు లేవంటూ నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌తోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు కూడా ఈ నివేదిక వెళ్లింది. డుంబ్రిగుడ మండలంలోని లేటరైట్ తవ్వకాల కోసం స్థానిక గిరిజనులే దరఖాస్తులు చేసుకున్నా జిల్లా కలెక్టర్ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కానీ పాత అనుమతులతో రాజుపాకలు సమీపంలో లేటరైట్ తవ్వకాలు ప్రస్తుతం దర్జాగా సాగిపోతున్నాయి.

    దీనిని గిరిజనులంతా వ్యతిరేకిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. గనుల శాఖ అధికారులైతే తవ్వకందారులనే ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం లేటరైట్ ఖనిజం డుంబ్రిగుడ, జీకేవీధి, నాతవరం తదితర ప్రాంతాల్లో భారీగా ఉంది. దాని తవ్వకాలకు బడా వ్యాపారులంతా దొడ్డిదారిన అనుమతులు సంపాదించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఏజెన్సీలోని పలు చోట్ల విలువైన రంగురాళ్ల నిక్షేపాలు కూడా ఉన్నాయి.

    వీటి  తవ్వకాలపై కూడా నిషేధం ఉంది. అయినప్పటికి అధికారులను మచ్చిక చేసుకొని రంగురాళ్ల తవ్వకాలకు కూడా పేరొందిన రంగురాళ్ల వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఎక్కడికక్కడ లేటరైట్, రంగురాళ్ల క్వారీల అన్వేషణలో బడాబాబులు ఉన్నారు.

    స్థానిక గిరిజనులను మచ్చిక చేసుకొని విలువైన ఖనిజ సంపదను దోచుకునేందుకు బడావ్యాపారులంతా మన్యంలో మకాం వేశారు. ప్రస్తుతం లేటరైట్, రంగురాళ్ల తవ్వకాలను గిరిజనులు ప్రోత్సహిస్తే మున్ముందు బడా వ్యాపారులంతా బాక్సైట్‌ను కూడా తవ్వుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా గిరిజన మేధావులు, యువత, స్వచ్ఛంద సంస్థలంతా గిరిజన ఖనిజ సంపదను పరిరక్షించేందుకు ఉద్యమించాల్సి ఉంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement