అప్రమత్తమైన పోలీసులు

Anantapur Police Alert on Andhra Pradesh Elections - Sakshi

జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు

ఐదు ప్రాంతాలకు కేంద్ర పారామిలటరీ బలగాల రాక

ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ వెల్లడి  

అనంతపురం సెంట్రల్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ కార్యాచరణ ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ రూ. 1.36 కోట్ల నగదు, 5.7 కిలోల బంగారు ఆభరణాలు, 1080 మద్యం బాటిళ్లు, 134 లీటర్ల నాటు సారా పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. సింగిల్‌బోర్‌ తుపాకీ, ఐదు బుల్లెట్లు, 49 డిటోనేటర్లు, 65 జెలిటిన్‌స్టిక్స్‌ తదితర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా బౌగోళికంగా విస్తీర్ణంలో అతి పెద్దది కావడంతో పాటు నాలుగు జిల్లా సరిహద్దులు ఉన్నాయన్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలను ప్రలోభపెట్టేందుకు ఈ దారులగుండా అక్రమంగా నగదు, గిఫ్టులు తరలించడం లాంటి అక్రమాలకు పాల్పడే అవకాశమున్నందున వీటిని నియంత్రించడం కోసం జిల్లా వ్యాప్తంగా 78 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 18 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఫ్యాక్షన్‌ గ్రామాలపై పట్టు బిగించడం జరిగిందన్నారు. ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లు, ట్రబుల్‌ మాంగర్స్, కిరాయి హంతకులు, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు ఆటంకం కలిగించే అవకాశమున్న వారందరినీ ముందస్తుగా బైండోవర్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆయుధ లైసెన్స్‌లు కలిగిన వారి తుపాకులను డిపాజిట్‌ చేయిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా ఇతర ప్రభుత్వశాఖల అధికారులతో కలిసి చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా ఎన్నికల ప్రలోభాలు అరికట్టడంలో భాగంగా ఎన్నికల కమిషన్‌ అందుబాటులోకి తెచ్చిన సీ విజిల్‌ యాప్‌ గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top