ఫోన్‌ కొట్టు.. రూ.వెయ్యి పట్టు

Ambulance Drivers Tie Up With Private Hospitals And Collecting Money - Sakshi

యాక్సిడెంట్‌ కేసులను దగ్గరుండి ప్రైవేట్‌ ఆస్పత్రికి పంపిస్తున్న సిబ్బంది

జిల్లా ఆస్పత్రిలో కమీషన్ల దందా

వైఎస్‌ఆర్‌ జిల్లా,ప్రొద్దుటూరు క్రైం : ప్రైవేట్‌ అంబులెన్స్‌కు సమాచారమిస్తే రూ.500.. ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఫోన్‌ చేస్తే రూ. 1000–రూ.1500. పట్టణంలోని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించిన నజరానాలు ఇవి. వీటికి ఆశపడిన కొందరు జిల్లా ఆస్పత్రిలో పని చేసే సిబ్బంది కేసులు రాగానే వారికి సమాచారమిస్తున్నారు. ఫోన్లు చేయడానికి ఒక్కోసారి వీరి మధ్య పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో నిత్యం కమీషన్ల దందా జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వచ్చిన ప్రతి యాక్సిడెంట్‌ కేసు ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్తోంది. ఆస్పత్రిలోని కొందరు సిబ్బంది దగ్గరుండి మరీ పంపిస్తున్నారు. రాజుపాళెం మండలంలోని వెలవలి గ్రామానికి చెందిన అల్లామి అనే బేల్దారి బైక్‌లో మంగళవారం ప్రొద్దుటూరుకు వస్తున్న సమయంలో ఉప్పవాగు వంక వద్దకు రాగానే ఎదురుగా మరో బైక్‌ తగిలి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతని కాలు విరిగినట్లు నిర్ధారించారు.

ప్రైవేట్‌ ఆస్పత్రి ప్రతినిధి క్షణాల్లో ప్రత్యక్షం..
గాయపడిన అతనికి జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసేలోపే గాంధీరోడ్డులోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి చెందిన వ్యక్తి జిల్లా ఆస్పత్రిలోని క్యాజువాలిటి వద్ద ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే ఆస్పత్రిలో ఉన్న కొందరు సిబ్బంది ‘ఇక్కడ వైద్యం సరిగా ఉండదు..  ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లండి.. అక్కడ ఆరోగ్యశ్రీ కూడా ఉంది’ అని గాయపడిన వ్యక్తి బంధువులకు సూచించారు. మేమే ఫోన్‌ చేస్తాం.. వాళ్ల అంబులెన్స్‌లో తీసుకొని వెళ్తారని చెప్పారు. వారి సూచన మేరకు అల్లామి బంధువులు సరేనని అన్నారు.  కొద్దిసేపటి తర్వాత ప్రైవేట్‌ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్‌లో అతన్ని బయటికి పంపించారు. ఈ దందా ఈనాటిది కాదు. రోజు ఇలాంటి ఎన్నో కేసులను ఆస్పత్రి సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి ప్రైవేట్‌æ ఆస్పత్రులకు పంపిస్తున్నారు. దీంతో ఇటీవల కొన్ని విభాగాల్లో ఆరోగ్యశ్రీ కేసులు బాగా తగ్గిపోయాయి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top