టీ20.. కిర్రాక్‌ పార్టీ

Amaravati people Emjoyed New Year Events - Sakshi

టిక్‌ టిక్‌ టిక్‌.. మంగళవారం అర్ధరాత్రి చిన్న ముల్లు, పెద్ద ముల్లు ఒక్క చోటకు చేరిందో లేదో ఊరూవాడా ఉర్రూతలూగింది. ఆశల పల్లకీలో ఆకాంక్షల గుబాళింపులను వెంటేసుకొచ్చిన కొత్త అతిథికి స్వాగతం చెప్పే సమయాన ప్రతి గుండె వేయి గొంతుకలై హ్యాపీ న్యూయర్‌ అంటూ కేక పుట్టించింది. ముగ్గుల చీరచుట్టి... రంగురంగుల విద్యుత్‌ తోరణాలు కట్టిన ప్రతి వీదీ ఇంద్రధనుస్సులా దివ్య కాంతులు విరజిమ్మింది. వీడలేక వీడిపోతున్న ఆప్తుడికి వీడ్కోలు చెబుతూనే.. ఉరిమే ఉత్సాహంతో దూసుకొచ్చిన హితుడికి ఆత్మీయ స్వాగతం పలికింది. జిల్లా వ్యాప్తంగా కేక్‌ కటింగ్‌లు, కిర్రాక్‌ పార్టీలతో యువత కేరింతలు  కొడుతూ.. కొంగొత్త ఆలోచనల రెక్కలు కట్టుకుని సంబరాల ఆకాశపు అంచులను తాకింది.   

సాక్షి, అమరావతిబ్యూరో: జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. 2019 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2020కి స్వాగతం పలుకుతూ యువతీయువకులు సందడి చేశారు. ముఖ్యంగా రాజధాని నగరం విజయవాడ పలువురు సినీ, టీవీ తారలు, గాయకుల సందడితో హోరెత్తింది. యువత విజయవాడ రోడ్లపైకి వచ్చి ఒకొరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెల్లవారు జామున 4 గంటల వరకు ఈ వేడుకలు ఫుల్‌ జోష్‌గా సాగాయి. అర్ధరాత్రి 2 గంటల వరకు రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్‌లతో యువత ఉత్సాహంగా గడిపింది. 

స్టార్‌ హోటళ్లలో సందడే సందడి..  
నగరంలోని నోవాటెల్, గేట్‌వే, మురళీఫారŠూచ్యన్, డీవీ మానర్‌ వంటి స్టార్‌ హోటళ్లతోపాటు కొన్ని ఫంక్షన్‌ హాళ్లలో నూతన ఏడాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటల నుంచి ఆరంభమైన కార్యక్రమాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. సంగీత కార్యక్రమాలతోపాటు గ్రాండ్‌ కార్నీవాల్, విందులు ఏర్పాటు చేశారు. శేషసాయి ఫంక్షన్‌ హాలులో ‘గ్లో ఇన్‌ ద డార్క్‌’ పేరుతో వేడుకలు నిర్వహించారు. స్టాండ్‌ ఆఫ్‌ కామెడీతోపాటు.. మ్యూజిక్‌ బ్యాండ్, డీజే, ఫుడ్‌ తదితర ఏర్పాట్లు చేశారు. అలాగే విజయవాడ ట్రెండ్‌సెట్‌ మాల్‌లోని ఐదో అంతస్తులో ‘క్యూబా లిబ్రే న్యూ ఇయర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. నిడమానూరులోని బ్లూబజ్‌లో ‘కూల్‌ డేజ్‌ 2020 న్యూ ఇయర్‌ ఈవ్‌’ పేరుతో వేడుకలు జరిగాయి. పీవీపీ మాల్‌ నాలుగో అంతస్తులో డీజే ఉత్సవ్‌ 2020 పేరుతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. విజయవాడ అడ్వెంచర్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వీఏసీ క్యాంపింగ్‌ గ్రౌండ్స్‌ వద్ద ‘నైట్‌ అండర్‌ ద స్టార్స్‌’ పేరుతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారు నైట్‌ ట్రెక్కింగ్, ఫారెస్ట్‌ వాకింగ్, చేపలు పట్టడం, క్యాంప్‌ ఫైర్‌ లాంటివి చేసి నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు.  

ఆటపాటలతో సందడి చేసిన యువత..  
నూతన సంవత్సర వేడుకల్లో యువత సందడి చేసింది. నగరంలో ప్రధాన కూడళ్లలో అర్ధరాత్రి దాటగానే వేడుకలు జరుపుకుంది. బెంజిసర్కిల్, బందర్‌రోడ్డు, ఏలూరు రోడ్డు, భవానీ ద్వీపం తదితర ప్రాంతాల వద్ద యువత బైక్‌లపై, కార్లలో నగరమంతా తిరుగుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేసింది. పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలతో విజయవాడ హోరెత్తిపోయింది. ఇక శివారు ప్రాంతాల్లో ఉన్న కార్పొరేట్‌ కళాశాలల్లోనూ నూతన సంవత్సర వేడుకలను విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top