‘ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం’

Alla Nani Review Meeting On Swelling Leg Disease In East Godavari District - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: గిరిజన ప్రాంతాల్లో మరణాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఆయన మంగళవారం తూర్పు మన్యంలో గిరిజన కాళ్ల వాపు వ్యాధి నివారణపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పలు గిరిజన  గ్రామాలను హాట్ స్పాట్లుగా గుర్తించామన్నారు. ప్రతీ ఇంటిని సర్వే చేస్తున్నామని తెలిపారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి, నివేదికల ఆధారంగా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం సేకరించిన 103 మంది శాంపిల్స్‌లో 16 మందికి అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నామని ఆళ్ల నాని తెలిపారు. (సీఎం సానుకూలంగా స్పందించారు : తలసాని)

ఏజెన్సీలో కాళ్ళ వాపుపై రెండవ దశ సర్వే రేపటి నుంచి ప్రారంభిస్తున్నామని ఆళ్ల నాని అన్నారు. ఎజెన్సీలో అదనంగా మరో డయాలసిస్ సెంటర్ అవసరం ఉందని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తర్వలోనే మరో డయాలసీస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గిరిజన గ్రామాల్లో  రక్షిత మంచి నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైన గిరిజన గ్రామాల్లో యూవీ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని ఆళ్లనాని అన్నారు. (రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: వైఎస్‌ జగన్‌)

తూర్పు ఏజెన్సీలో ఇప్పటికే 45 విలేజ్ క్లినిక్‌లు  ఉన్నాయని, మరో 20 క్లినిక్‌లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. త్వరలో చింతూరు ఏరియా ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా విస్తరిస్తామని తెలిపారు. ‘నాకు-నేడు’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆస్పత్రి పరిస్థితిని సమూలంగా మారుస్తామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త పీఎచ్సీలను ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు కాళ్ల వాపు వ్యాధితో 14 మంది మృతి చెందారని, ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. ఇక ఏజెన్సీలో మరో రెండు కొత్త  పీఎచ్‌సీలను ఏర్పాటు చేస్తామని ఆళ్ల నాని చెప్పారు. ఈ సమీక్షలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్యే లు నాగులపల్లి ధనలక్ష్మీ, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి,పెండెం దొరబాబు పాల్గొన్నారు. (సీఎం జగన్‌ మంచి విజన్‌ ఉన్న నాయకుడు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top