‘ఆశా’ల వేతనాలపై.. కావాలనే దుష్ప్రచారం | Sakshi
Sakshi News home page

‘ఆశా’ల వేతనాలపై.. కావాలనే దుష్ప్రచారం

Published Wed, Aug 28 2019 4:33 AM

Alla Nani Comments about Wages of Asha Workers - Sakshi

సాక్షి, అమరావతి: ఆశా వర్కర్ల వేతనాల విషయంలో కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. గౌరవ వేతనాల కోసం గతంలో వీరు, అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నాలు చేస్తే లాఠీచార్జి చేయించి, గుర్రాలతో తొక్కించిన వాళ్లు ఇప్పుడు ఆశా వర్కర్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయనన్నారు. ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రి కాగానే ఆ హామీని నెరవేరుస్తూ.. వారు రూ.6 వేలు గౌరవ వేతనం అడిగితే రూ.10 వేలు ఇచ్చారని, ఇది చూసి ఓర్చుకోలేని తెలుగుదేశం పార్టీ నేతలు ఆశా వర్కర్ల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎద్దేవా చేశారు. ఆశా వర్కర్లకు ఎలాంటి గ్రేడింగ్‌లు పెట్టలేదని, కొంతమంది ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రెచ్చగొట్టి వారితో ధర్నా చేయించారని, ఇది ఆశా అక్కచెల్లెమ్మలు గుర్తించాలని మంత్రి అన్నారు. 2014 ఎన్నికల సమయంలో గౌరవ వేతనం ఇస్తామని మభ్యపెట్టిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయ్యాక నాలుగున్నరేళ్లపాటు వారిని ఆయన పట్టించుకోలేదని, ఎన్నికలకు మూడు నెలల ముందు రూ.3వేలు ఇస్తూ జీవో ఇచ్చి అవి కూడా సకాలంలో ఇవ్వలేకపోయారని, ఇదీ చంద్రబాబు నైజమన్నారు.

సెప్టెంబర్‌ 1 నుంచి పెంచిన వేతనాలు
కాగా, పెంచిన వేతనాలను తాము ఆగస్టు నుంచి అమలుచేస్తూ సెప్టెంబరు 1 నుంచి ఇస్తున్నామని, పాత బకాయిలు కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి నాని భరోసా ఇచ్చారు. గ్రేడింగుల గురించి ఎవరో చెప్పిన మాటలు నమ్మవద్దని, ప్రభుత్వోద్యోగులందరికీ ఉన్నట్టే జాబ్‌చార్ట్‌ ఉంటుంది తప్ప మరోటి కాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది నేతలు రెచ్చగొడుతూ ఉంటారని.. ప్రభుత్వానికి ఎక్కడ మంచిపేరు వస్తుందోనన్న దుగ్ధతోనే ఇలా చేస్తుంటారని ఆయన మండిపడ్డారు. ఒక్కసారి మాట ఇస్తే జగన్‌మోహన్‌రెడ్డి వెనక్కు తగ్గరని, రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ మెరుగైన వైద్యం అందాలన్నదే ఆయన అభిమతమని నాని చెప్పారు.

Advertisement
Advertisement