‘అధికారులను నియమించి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం’

Alla Nani And Kurasala Kannababu Talks In Press Meet Over Lockdown - Sakshi

సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ రావాలనుకుంటున్న రాష్ట్ర  ప్రజలంతా ఎక్కడి వారు అక్కడే ఉండాలని మరోసారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీ అవసరాల్నింటినీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సీఎం జగన్‌ మాట్లాడుతున్నారని, ఇందుకోసం ప్రత్యేక అధికారులను కూడా నియమించి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఇక వలస కూలీలు, కార్మికుల అవసరాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక ఐఏఎస్‌ అధికారిని నియమించారన్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటడానికి కేంద్ర నిబంధనలు అడ్డొస్తున్నాయని, ఇతర రాష్ట్రల్లో ఉన్న వలస కార్మికులకు వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. (లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. క్వారంటైన్‌కు ఐటీ ఉద్యోగులు)

అర్బన్‌ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందని.. పట్టణాలు, నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి 10 మందికి ఒక డాక్టర్‌ను కేటాయించామని, వాలంటీర్లు, ఆశా వర్కర్లు ఏఎన్‌ఎంలకు అవసరమైన సేఫ్టీ మెజర్స్‌ అందించామని తెలిపారు. కాగా 428 మంది శాంపిల్స్‌ను  కరోనా వైరస్‌ పరీక్షల నిమిత్తం పంపించగా.. అందులో 378 మందికి కరోనా నెగిటివ్‌ రాగా 13 మందికి పాజిటివ్‌గా వచ్చినట్లు వెల్లడించారు. విదేశాల నుంచి  29, 264 మంది రాష్ట్రానికి వచ్చారని అందులో 29,115 మందిని హో క్వారంటైన్‌లో ఉంచామని చెప్పారు. ఇక మిగిలిన 149 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు ఆయన తెలిపారు. కాగా నిత్యా వసరాల రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. (ఏపీలో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలు)

ఇక వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ..  వ్వవసాయ, ఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు చెప్పారు. వ్యవసాయ పనులకు ఆటంకం లేకుండా చూడాలని,  కరోనా ప్రభావం వల్ల  రైతు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించినట్లు తెలిపారు. కాగా వ్యవసాయ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తామని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. కాగా ప్రచారం కోసం పని చేసే ప్రభుత్వం తమది కాదని, సీఎం జగన్‌తో సహా ఇతర మంత్రులు సైతం 24 గంటలూ పనిచేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. (క్వారంటైన్‌కి సిద్దపడేవారికే అవకాశం: వైఎస్‌ జగన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top