'ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం'

All Set To Conduct Dussehra Navaratri Utsavalu At Vijayawada - Sakshi

రేపటి నుంచి ప్రారంభంకానున్న వేడుకలు

ఉదయం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతి

అక్టోబర్ 8 న కృష్ణానదిలో తెప్పోత్సవం...

సాక్షి, విజయవాడ: ఈనెల 29 నుంచి వచ్చే నెల 8 వరకు జరిగే ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో.. దుర్గమాత పది అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. రేపు నిర్వహించే స్వప్నాభిషేకం అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా భక్తులకు ప్రతీ రోజు ఉదయం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తారు. ఇంద్రకీలాద్రిపై జరిగే మొత్తం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు 7 కోట్లకు పైగా ఖర్చు కానుంది. దసరా ఉత్సవాలలో భక్తులకు అమ్మవారి దర్శనార్థం ఆర్జిత సేవలను నిలుపు చేసింది. అదేవిధంగా కుంకుమార్చనకు ప్రత్యేక సమయం, స్థలం కేటాయించారు.

ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన 29వ తేదీ ఆదివారం కావడంతో అమ్మవారు శ్రీ స్వర్ణకవాచాలంకృత దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా రెండో రోజు(30న) శ్రీ బాలత్రిపురసుందరీ దేవిగా, మూడవ రోజు (అక్టోబర్ 1) శ్రీగాయత్రీ దేవిగా, 4వ రోజు శ్రీఅన్నపూర్ణాదేవిగా, 5వ రోజు శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా, 6వ రోజు శ్రీమహాలక్ష్మి దేవిగా, 7వ రోజు శ్రీసరస్వతీ దేవిగా, 8వ రోజు శ్రీదుర్గాదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అలానే నవరాత్రి రోజు అమ్మవారు శ్రీమహిషాసుర మర్ధినీ దేవిగా కనిపించనున్నారు. ఉత్సవాల ఆఖరి రోజున (అక్టోబర్ 8) అమ్మవారు శ్రీరాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనున్నారు. అదేరోజు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం జరగనుంది. 

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, యాత్రికులు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అందుకు అనుగుణంగానే భారీ సంఖ్యలో పోలీసులను మొహరించి పటిష్ట బందోబస్తుకు ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది విధుల్లో మొత్తం 5500 పోలీసులు, 1200 మంది దేవాదాయ శాఖ సిబ్బంది, 350 మంది సెక్యూరిటి సిబ్బంది,  900 మందికి పైగా వలంటీర్లు పాల్గొననున్నారు. ఆలయానికి సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం ద్విచక్ర వాహనాలు, కార్లు నిలిపేందుకు సమీపంలోని 12 చోట్ల పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top