రూ.112 కోట్లతో 321 సచివాలయాలు 

All Grama Sachivalaya Buildings Will Be Built In Shortly in Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు(అర్బన్‌) : గ్రామ సచివాలయ వ్యవస్థను శరవేగంగా అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అదే వేగంతో గ్రామ సచివాలయ భవన నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు చేపడుతోంది. జిల్లాలో సచివాలయ భవనాలు లేని ప్రాంతాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తు ఆయా ప్రాంతాల్లో భవనాలు నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో త్వరలోనే భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 881 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కాగా, ఇప్పటి వరకు 560 గ్రామ సచివాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. సొంత భవనాలు ఉన్న వాటిని మినహాయించి మిగిలిన 321 గ్రామ సచివాలయ భవన నిర్మాణాలను చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకే మోడల్‌గా 2,200 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలో ఒక్కో భవనం రూ.35 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. జిల్లాలో కొత్తగా నిర్మించబోయే 321 భవన నిర్మాణాలకు రూ.112.35 కోట్లను వెచ్చించనున్నారు. ఈ భవన నిర్మాణాలను వంద శాతం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలోనే 321 కొత్త సచివాలయ భవన నిర్మాణాలను చేపట్టనున్నారు.   

పెరగనున్న పాత భవనాల విస్తీర్ణం  
ప్రస్తుతం గ్రామ పంచాయితీ భవనాల్లో ఏర్పాటైన గ్రామ సచివాలయాల విస్తీర్ణాన్ని కూడా పెంచనున్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామ సచివాలయానికి 11 మంది ఉద్యోగులు అదనంగా రావడంతో పాటు మీ సేవా కేంద్రం, వెయిటింగ్‌ హాల్, సమావేశ భవనం ఆయా భవనాల్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అనేక గ్రామ సచివాలయ భవనాలు 800 నుంచి 1200 ఎస్‌ఎఫ్‌టీల విస్తీర్ణానికి మించి లేక పోవడంతో తక్కువ విస్తీర్ణంలో ఉన్న గ్రామ సచివాలయాలను కూడా 2,200 ఎస్‌ఎఫ్‌టీకి పెంచనున్నారు. ప్రతి ఏడాది ఒక్కో నియోజకవర్గం నుంచి 10 ప్రకారం జిల్లాలోని కర్నూలు అర్బన్‌ మినహాయించి మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 130 గ్రామ సచివాలయాలను 2,200 ఎస్‌ఎఫ్‌టీలకు విస్తరించనున్నారు.  

ఉద్యోగులకు ప్రత్యేక క్యాబిన్లు 
గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మొదటి అంతస్తుతో గ్రామ సచివాలయాన్ని నిర్మించాలని ఇప్పటికే పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు డిజైన్లు రూపొందించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ... వరండా, స్టోర్‌ రూం, గోడౌన్, అగ్రి, ఆక్వా స్టోర్, స్పందన హెల్ప్‌ డెస్క్, ఏఎన్‌ఎం, సర్వే, వెటర్నరీ అసిస్టెంట్, మహిళా పోలీస్, వీఆర్‌ఓ, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్, సెక్రెటరీ, కార్యదర్శి గది ఏర్పాటు చేయనున్నారు. మొదటి అంతస్తులో ... విజిటర్స్‌ వెయిటింగ్‌ రూం, మీటింగ్‌ హాల్, డిజిటల్‌ స్టోర్, ఎనర్జీ, అగ్రి, డిజిటల్, వెల్ఫేర్‌ అసిస్టెంట్, సర్పంచు గదితో పాటు రెండు ఫ్లోర్లలో స్త్రీలు, పురుషులకు ప్రత్యేకంగా టాయ్‌లెట్స్‌ను నిర్మించనున్నారు. ఒక్కో ఫ్లోర్‌ను 1100 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలో మొత్తం రెండు ఫ్లోర్లను 2,200 విస్తీర్ణంలో నిర్మించేందుకు డిజైన్లు రూపొందించారు.  

భవనాలను నిర్మించేందుకు సిద్ధం 
ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే గ్రామ సచివాలయ భవనాలను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే జిల్లాలో ఎన్ని సచివాలయ భవన నిర్మాణాలు చేపట్టాలనే విషయంపై ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాం. రూ.35 లక్షలతో ఒక్కో భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. రెండు నెల ల క్రితమే ప్రభుత్వం పంపిన మోడల్‌ ప్రకా రం డిజైన్లు రూపొందించి పంపాము. సచివాలయ వ్యవస్థ ప్రారంభం అయిన దృష్ట్యా భవనాల నిర్మాణాలకు కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది.     – సీవీ సుబ్బారెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top