ఆటోడ్రైవరుకు హెల్మెట్‌ లేదని జరిమానా

Agitation Against Police Harassment On Auto Rickshaw Drivers In Nellore - Sakshi

పోలీసుల వేధింపులకు నిరసనగా ర్యాలీ

సాక్షి, నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఆటో కార్మికులపై ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని ఏబీఎం కాంపౌండ్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బోసుబొమ్మ వరకు సాగింది. అనంతరం అక్కడ వారు రోడ్డుపై బైటాయించి ట్రాఫిక్‌ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర అధ్యక్షుడు అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఆర్టీఓ, పోలీసులు ఆటో కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆటోడ్రైవర్‌కు హెల్మెట్‌ లేదని జరిమానా వేసిన ఘనత నెల్లూరు ట్రాఫిక్‌ పోలీసులకే దక్కుతుందన్నారు. ధ్రువీకరణ పత్రాలన్నీ ఉన్నా ఓ ఆటోడ్రైవర్‌పై 5 నిమిషాల వ్యవధిలో 6 కేసులు రాయడం ఎంతవరకూ సమంజసమన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్‌ ఓలా ట్యాక్సీలను నిర్వహిస్తుండడంతో ఆటోలను తిరగనీకుండా కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే అధికారులు 700 రెట్లు చలానా పెంచి రూ.170 కోట్లు రాష్ట్ర ఖజానాకు పంపారన్నారు. కాగా దాదాపు రెండు గంటల సేపు నిరసన చేపట్టడంతో వాహనాలు నిలిచి పోయి ప్రయాణికులు ఇబ్బంది పట్టారు.

ఈ క్రమంలో ట్రాఫిక్‌ సీఐ వేమారెడ్డి ఘటనాస్థలానికి వచ్చి ఆన్‌లైన్‌ ద్వారా ఈ–చలానా రావడంతో పొరపాట్లు జరిగాయని, పరిశీలించి  చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి జి,నాగేశ్వరరావు ఆటోయూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.సురేష్, నాయకులు మూలం ప్రసాద్, సూర్యనారాయణ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top