
ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్ పేరిట సైబర్ మోసాలు
ఏపీకే ఫైల్స్ పంపుతున్న సైబర్ నేరగాళ్లు
అప్రమత్తంగా ఉండాలని టీజీసీఎస్‌బీ
డైరెక్టర్ శిఖాగోయల్ సూచన
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్ చెల్లించాలంటూ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరతీశారు. ‘ RTO Traffic Challan.apk2 ’ పేరిట వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ పంపుతున్నారు. ఇలాంటి లింకులు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తరహా మెసేజ్‌లు రాష్ట్రవ్యాప్తంగా పలువురికి వస్తున్నట్టు తమ దృష్టికి వచి్చందని చెప్పారు. అత్యంత ప్రమాదకరమైన ఫైల్ లింకులను సాయంత్రం సమయంలో ఎక్కువగా పంపిస్తున్నట్టు వెల్లడించారు. ఆ ఏపీకే ఫైల్‌ను ఎవరైనా నిజమైనదే అనుకుని క్లిక్ చేస్తే.. మన ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల అదీనంలోకి వెళుతుంది.
ఆ తర్వాత మన బ్యాంకింగ్, క్రెడిట్‌కార్డుల వివరాలు తస్కరిస్తారు. ఆ తర్వాత రిమోట్‌గా ఫోన్‌ను నియంత్రిస్తూ ఆన్‌లైన్‌లో మన బ్యాంకు ఖాతాల నుంచి, క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు కొల్లగొడతారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లు సైతం మనకు రాకుండా చేస్తారు. గుర్తు తెలియని వాట్సాప్ నంబర్ల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దని శిఖాగోయల్ సూచించారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలని, క్రెడిట్ కార్డులకు తప్పకుండా ఓటీపీ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలని తెలిపారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే కార్డును బ్లాక్ చేయాలని సూచించారు. అదేవిధంగా సైబర్ నేరాలపై వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌చేసి ఫిర్యాదు చేయాలని లేదా సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ 8712672222లో వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.