సాక్షి, కర్నూలు: ఘోర ప్రమాదానికి గురైన బస్సుపై భారీగా ట్రాఫిక్ జరిమానాలు పెండింగ్ ఉన్నాయని రవాణా శాఖ వెల్లడించింది. 2024 నుంచి చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జనవరి(2024) నుంచి అక్టోబర్ (2025) వరకు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. రూ.23120 చలానా పెండింగ్‌లో ఉంది. హైస్పీడ్, డేంజర్ డ్రైవింగ్ కారణంగా రెండు చలానాలు బస్సుపై ఉన్నాయి. తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి. బస్సు ఫిట్‌నెస్, అనుమతులు.. ఒడిశా పరిధిలోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికితీశారు. బస్సు ప్రమాదస్థలిలో ఫోరెన్సిక్ బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. ప్రమాద ఘటన నేపథ్యంలో కూకట్‌పల్లిలోని వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన కార్యాలయం వద్దకు మీడియా చేరుకోగానే సిబ్బంది మూసేస్తూ కనిపించారు. ప్రమాదంపై నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఘటనకు వీ కావేరీ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా కారణం ఉందని అధికారుల మాటలతో స్పష్టవుతోంది.




