తీరంలో తొలిసారి! | advanced technology of cyclone shelters | Sakshi
Sakshi News home page

తీరంలో తొలిసారి!

Nov 20 2015 12:24 AM | Updated on Sep 3 2017 12:43 PM

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించడం, అక్కడి ప్రజలను ఆగమేఘాల మీద సురక్షిత ప్రాంతాలకు తరలించడం అధికార యంత్రాంగానికి పెద్ద ప్రహసనం. తీరానికి దూరంగా ఉండే రక్షిత భవనాల్లోకి ప్రజలను

ఆధునిక పరిజ్ఞానంతో తుపాను షెల్టర్లు
బాపట్ల నియోజకవర్గంలో మూడు భవనాల నిర్మాణం
డిజైన్ సిద్ధం చేసిన అధికారులు
ప్రపంచ బ్యాంకు నిధులు రూ.6.6 కోట్లు విడుదల
ఒక్కో షెల్టర్‌లో 600 మంది వరకు ఆశ్రయం
ఉప్పు, తుప్పు ప్రభావాన్ని తట్టుకునేలా నిర్మాణాలు
టెండర్ల ప్రక్రియ పూర్తి.. పనులు ప్రారంభమే తరువాయి..

 
బాపట్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించడం, అక్కడి ప్రజలను ఆగమేఘాల మీద సురక్షిత ప్రాంతాలకు తరలించడం అధికార  యంత్రాంగానికి పెద్ద ప్రహసనం. తీరానికి దూరంగా ఉండే రక్షిత భవనాల్లోకి ప్రజలను చేర్చడంలో కొన్నిసారు వైఫల్యాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి తీరంలోనే తుపాను షెల్టర్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తీరంలో రక్షిత భవనాలు నిర్మించాలంటే వ్యయ ప్రయాసలు అధికం కావడం, నిర్మాణానికి ఉపయోగించే ఇనుము ఉప్పుగాలుల కారణంగా త్వరగా తుప్పు పట్టే ప్రమాదం ఉండటంతో ఇప్పటి వరకు తీరానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో మాత్రమే తుపాను షెల్లర్లు నిర్మిస్తూ వస్తున్నారు. ఇప్పుడు తొలిసారిగా అత్యాధునిక పరిజ్ఞానంతో తీరం వెంబడే నిర్మించనున్నారు. రూ.6.6 కోట్ల ప్రపంచబ్యాంకు నిధులతో  కేంద్ర ప్రభుత్వం మూడు భవనాలను బాపట్ల నియోజకవర్గ పరిధిలో చేపట్టనుంది. సూర్యలంక తీరంలోని పంచాయతీరాజ్ అతిథి గృహం స్థలంలో ఒకటి, కర్లపాలెం మండలం చిన్నపులుగువారిపాలెం, బసివిరెడ్డిపాలెం గ్రామాల్లో మరో రెండు భవనాల కోసం నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒక్కో భవనానికి రూ.2.2 కోట్ల చొప్పున కేటాయించారు. ఈమేరకు టెండర్లు పిలిచి వర్క్‌ఆర్డర్ ఇచ్చే దశలో ఫైల్ నడుస్తోంది.

 ఉప్పు...తుప్పును ఎదుర్కొనే విధంగా ....
 బాపట్ల నియోజకవర్గంలో నిర్మించే షెల్టర్లు ఉప్పు, తుప్పును ఎదుర్కొనే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. నిర్మాణంలో మంచినీటి వాడకం, సిమెంటులోనే రసాయనాలు కలపడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. బహుళ అంతస్తుల నిర్మాణాల్లో గ్రౌండ్‌ఫోర్లను ఖాళీగా ఉంచుతారు. ఏదైనా విపత్తు వస్తే మొదటి అంతస్తులోనే ప్రజలు ఉండేవిధంగా డిజైన్ చేశారు. ఒక్కొక్క షెల్టర్‌లో 500 నుంచి 600 మందిని సురక్షితంగా ఉంచే వీలుంది. లోపలే ఆహార పదార్థాలు తయారు చేసుకునేందుకు వీలుగా కూడా గదులు ఏర్పాటు చేస్తారు. సముద్ర, భూ మట్టాన్ని ఆధారం చేసుకుని ఎత్తు నిర్ణయించటంతో రానున్న 50 ఏళ్ల వరకు విపత్తులను ఎదుర్కొనే అవకాశం ఉండే విధంగా అధికారులు డిజైన్‌ను సిద్ధం చేశారు.

 త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం..
 తుపానుషెల్టర్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాం. ఒక్కొక్క షెల్టర్‌కు రూ. 2.2 కోట్లు నిధులు విడుదలయ్యాయి. తీరంలో  షెల్టర్లు నిర్మించటం ఇదే మొదటి సారి. ప్రపంచబ్యాంకు నిధులతో నిర్మాణ పనులు చేపట్టనున్నాం. నాణ్యత ప్రమాణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
 - సుబ్రహ్మణ్యం,
 డీఈ ,పంచాయతీరాజ్ శాఖ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement