అడుగడుగునా.. అమ్మకాల్లో దగా!

Adulteration Groceries In Vizianagaram - Sakshi

తూకంలో మోసం చేస్తున్న వ్యాపారులు

తూనిక రాళ్లు... కాటాలకు వేయని సీళ్లు

తనిఖీలు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యం

నిత్యం నష్టపోతున్నవినియోగదారులు

‘ఇందుగలడందు లేడని సందేహం వలదు... ఎందెందు వెదకి చూసినా... అందందేగలదు’ అన్నట్టు జిల్లాలో ఎక్కడ చూసినా తూనికలు... కొలతల్లో దగా... మోసం... కనిపిస్తూనే ఉన్నాయి. చిన్న కిరాణా కొట్టు మొదలు... పెద్ద పెద్ద బంగారు దుకాణాల వరకూ తూనికల్లో మోసాలకు పాల్పడుతున్నాయి. పాలనుంచి పెట్రోల్‌ వరకూ కొలతల్లో దగా చేస్తున్నారు. దీనివల్ల సగటు వినియోగదారుడు నిరంతరం మోసపోతూనే ఉన్నాడు. వీటిని నియంత్రించగల వ్యాపారులు చేష్టలుడిగి చూస్తున్నారు. లేనిపోని సాకులు చెబుతూ నామమాత్రంగా దాడులకు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

విజయనగరం పూల్‌బాగ్‌ : వ్యాపారుల్లో అత్యాశ పెరిగిపోతోంది. చిన్న కిరాణా కొట్టు మొదలుకుని బంగారుషాపు వరకు ఎక్కడికి వెళ్లినా వినియోగదారుడిని మోసం చేస్తున్నారు. చివరకు రేషన్‌డీలర్లు సైతం చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దుకాణా ల్లో వేసిన తూకం... ఇంటికెళ్లి చూస్తే తేడా కనిపిస్తోంది. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన తూనికలు కొలతలు శాఖ సిబ్బంది కొరత పేరుతో చోద్యం చూస్తోంది. కిరాణం, వస్త్ర దుకాణాలు, ప్యాన్సీ, హార్డ్‌వేర్, బంగారు షాపులు, ఇలా వివిధ రకాల దుకాణాలు జిల్లాలో 24,301 వరకూ ఉన్నాయి. చిరువ్యాపారులను కలుపుకుంటే 50 వేలమందికి పైగానే ఉంటారు.

ఆయా దుకాణాల్లో ఘన పదార్థాలైతే తూకాలు, ద్రవ పదార్థాలైతే కొలతల్లో విక్రయిస్తారు. వీటికి నిర్థిష్ట ప్రమాణాలు ఉంటాయి. అయితే కొందరు వ్యాపారులు ధన దాహంతో జిమ్మిక్కులు చేస్తున్నారు. వినియోగదారునికి తెలియకుండానే మోసం చేస్తున్నారు. తూనికలు– కొలతల శాఖ నిబంధనల ప్రకారం వ్యాపారి రెండేళ్లకు ఒకసారి తప్పనిసరిగా తూకం రాళ్లు, ఏటా కాటాకు ప్రభుత్వ పరమైన ముద్రలు వేయించుకోవాలి. కాటాలో తేడాలు వస్తే రిపేరర్‌ వద్దకు వెళ్లి సరిచేయించుకోవాలి. అలా చాలా మంది వ్యాపారులు చేయించుకోవటం లేదు. తూనికలు కొలతలు శాఖ కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో వ్యాపారులు అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

అడుగడుగునా దగా...

జిల్లా వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో కూరగాయలు వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. సైకిళ్లపైన రోడ్డుకు ఇరుపక్కలా బళ్లపై నిత్యం వ్యాపారం సాగుతుంది. ఎలక్ట్రికల్‌ కాటాలతో సైతం వ్యాపారులు అక్రమాలకు తెరతీస్తున్నారు. ముందుగా వంద గ్రాములు తగ్గించి జీరో వచ్చేలా అమర్చుతున్నారు. కొన్ని దుకాణాల్లో కాటాపై ఉన్న పళ్లెం బరువును లెక్కించకుండా తూకంలో కలిపేసి మోసాలకు పాల్పడుతున్నారు. కేజీకి 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకే అధిక శాతం దుకాణాల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. 

గ్యాస్‌లోనూ చేతివాటం

వంటగ్యాస్‌ సిలండర్‌ తూకంలోను వ్యత్యాసం ఉంటోందని వినియోగదారులు వాపోతున్నారు. సిలిండర్లను తూకం వేయకుండానే అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండునెలలకు రావాల్సిన సిలిండరు కేవలం 40 రోజులకే అయిపోతుందని గృహిణులు గగ్గోలు పెడుతున్నా రు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

బంకుల్లో మాయాజాలం

పెట్రోలు బంకుల్లో కూడా మోసం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇంధనాన్ని నింపే సమయంలో వినియోగదారుడు జీరో రీడింగ్‌ చూసుకోకుంటే సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇచ్చిన నగదుకు సరిపడా ఇంధనం కొట్టించకపోవటంతో వాహనదారులు నిత్యం నష్టపోతున్నారు. మరిన్ని బంకుల్లో సాంకేతికతను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు కొరఢా ఝుళిపించాల్సిన అవసరం ఉంది.

చేపలు, మాంసం దుకాణాల్లో..

ముఖ్యంగా చేపలు, మాం సం దుకాణాల్లో ఎక్కువగా కాటాల్లో కనిపిస్తోంది. ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసినా సిబ్బంది రావటం లేదు. కూరగాయల మార్కెట్‌లో తూకాలు సరిగ్గా ఉండవు. చాలామంది రాళ్లనుకూడా ఉపయోగిస్తున్నారు.

– కొవ్వాడ నాగరాజు, నెల్లిమర్ల

సిబ్బంది కొరత వేధిస్తోంది

ప్రస్తుతం జిల్లాలో సిబ్బం ది కొరత ఉంది. జిల్లా సహాయ నియంత్రికులు–1, బొబ్బిలి–1, విజ యనగరం–1 ఇన్‌స్పెక్టరు ఉన్నారు. కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంటు–1, ఆఫీస్‌ సబార్డినేట్‌–1, చౌకీదార్‌–1 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఇప్పటివరకూ మెరుగైన ఫలితాలు సాధించాం. ఆ పోస్టులు భర్తీ అయితే దాడులు ముమ్మరం చేసి, మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది.

– జి.రాజేష్‌కుమార్, ఉపనియంత్రికులు, విజయనగరం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top