అన్నివర్గాలకు సమన్యాయం | acquitas happen to all categories | Sakshi
Sakshi News home page

అన్నివర్గాలకు సమన్యాయం

Jan 11 2014 2:47 AM | Updated on Jul 26 2019 5:49 PM

వైఎస్‌ఆర్‌సీపీలో అన్ని వర్గాలకు సమన్యాయం లభిస్తోందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు.

 ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్‌సీపీలో అన్ని వర్గాలకు సమన్యాయం లభిస్తోందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక సోమప్ప మెమోరియల్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీకి చెందిన మాచాని రఘునాథ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాచాని వెంకటేషప్ప, మాజీ కౌన్సిలర్ యు.ఎం.శ్రీనివాసులుబాబు, కేఎస్‌పీ శివన్న, వీజీఆర్ కొండయ్యతో పాటు దాదాపు 1000 మంది అనుచరులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు.

వీరికి గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలకు తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. అందులో భాగంగానే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా బీసీ కులానికి చెందిన బుట్టా రేణుకను ప్రకటించారన్నారు.

జిల్లాలోని దశాబ్దాలుగా ఆధిపత్యం కొనసాగిస్తూ అభివృద్ధిని విస్మరించిన కోట్ల, కేఈ కుటుంబాలకు వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకను గెలిపించడం ద్వారా బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. రెండుసార్లు అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మూడోసారి జగన్ ప్రభంజనంలో అధికారం దక్కదనే ఉద్దేశంతోనే విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారన్నారు. విభజనతో సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతుందని తెలిసీ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, టీడీపీలు డ్రామా ఆడుతున్నాయని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం రాష్ర్టం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

 కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక మాట్లాడుతూ సామాజిక, వ్యాపార, బంధుత్వ పరంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. జిల్లాలో ఎంజీ కుటుంబానికి ఉన్న పేరు, ప్రతిష్టలు రానున్న ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా తనకు దోహదపడతాయన్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానన్నారు. ఆదోని, మంత్రాలయం మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డిలు మాట్లాడుతూ జిల్లాలో బలమైన సామాజికవర్గానికి దీటుగా బీసీ మహిళ రేణుకను బరిలో నిలుపుతున్నందున.. ఆ వర్గాలు ఈమె గెలుపును ఛాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. ఒక్క ఆదోని రెవెన్యూ డివిజన్ నుంచే రేణుకమ్మకు లక్షకు పైగా మెజార్టీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

 కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్‌లో ముఖ్యమంత్రి కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబులు సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఎంజీ కుటుంబ వారసుడు మాచాని రఘునాథ్ బృందం వైఎస్‌ఆర్‌సీపీలో చేరడం శుభ పరిణామమన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు అభివృద్ధిలో మాచాని కుటుంబం సేవలు చిరస్మరణీయమన్నారు. తాను మొదటి నుండి ఎంజీ కుటుంబానికి అండగా నిలుస్తూ ఆ వర్గీయులను రాజకీయంగా ప్రోత్సహించానన్నారు. పార్టీలో చేరిన మాచాని రఘునాథ్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేనేతలతో పాటు బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

ఆయన బాటలోనే బీసీలకు పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా చేనేత మహిళకు అవకాశం కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ జిల్లా మాజీ  ఉపాధ్యక్షుడు ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రాలయం మాజీ ఎంపీపీ సీతారామిరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూధన్, పారిశ్రామికవేత్త బుట్టా నీలకంఠ, మున్సిపల్ మాజీ చైర్మన్ బుట్టా రంగయ్య, నాయకులు రమాకాంత్‌రెడ్డి, బసిరెడ్డి, సంపత్‌కుమార్‌గౌడ్, మాచాని ఆదిశేషులు, మాచాని శివకుమార్, హాజీ నద్దిముల్లా, రాజన్న, గోవిందు, నసిరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement