నిను వీడని నీడను నేనే

According To AIMS Survey Many People Suffering With Insomnia Problem In Visakhapatnam City - Sakshi

సాక్షి, విశాఖపట్నం : కంటినిండా కునుకు కరువయ్యిందా..?అయితే.. పనిలో ఏకాగ్రత కోల్పోతారు.చిన్న విషయానికే కోపం, చిరాకు పడుతుంటారు..ఊబకాయులుగా మారిపోతారు..అవునా.. సరిగా నిద్రపోకపోతే ఇన్ని సమస్యలు వెంటాడతాయా? అని ఆశ్చర్యపోతున్నారా.? ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే ఎవరైనా నిద్రపోతున్న వారిని మేల్కొలిపితే ‘బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు’ అంటూ కొంచెం అసహనం వ్యక్తం చేస్తారు. నిద్రను బంగారంతో పోల్చడం చూస్తే ఎంతటి ప్రాధాన్యం ఉందో ఇక్కడే తెలిసిపోతోంది.

మానవుడికే కాదు పశుపక్ష్యాదులకూ నిద్ర అవసరమే. ఆకలి రుచి ఎరగదు.. నిద్ర సుఖమెరగదు.. అంటారు. కడుపు నిండా తిండి.. కంటి నిండా నిద్ర.. ఇంతకు మించిన జీవితం ఏముంటుందనడంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది. అయితే మారుతున్న జీవన శైలి కారణంగా కంటికి కునుకు దూరమైపోతోంది. నిద్రలేమితో కనురెప్పలు మూతలు పడక అలసిపోతున్నాయి. ఈ విపత్కర పరిణామాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి.

ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, చదువులో విపరీతమైన పోటీ.. సాధారణంగా వీటివల్లే నిద్రలేమి సమస్యలు వస్తాయి. వీటన్నింటికంటే యువత నిద్రలేని రాత్రులు గడుపుతుండటానికి మూలకారణం ఇంటర్నెట్‌ వినియోగం, స్మార్ట్‌ఫోన్‌ ఫీవర్‌. వీటితో సావాసం చేసుకుంటూ నిద్రమానుకుంటున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ అంటూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. ఏడాది కిందట ఎయిమ్స్‌ విడుదల చేసిన ఓ సర్వే ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 70 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని వెల్లడైంది.

ఇక విశాఖ నగరం విషయానికొస్తే 60 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారని తేలింది. ఇందులో యువతే ఎక్కువ శాతం ఉంది.. రోజుకు 7 గంటలు నిద్రపోయిన వారిలో మరణశాతం రేటు తక్కువగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. అలాగే రోజుకు 6 గంటల కంటే తక్కువ 8 గంటల కంటే ఎక్కువ పడుకున్నా.. 15 శాతం మరణ రేటు పెరుగుతుందని వెల్లడించింది. ఒకప్పుడు నిద్ర పోయే సమయం రాత్రి 7 నుంచి 8 గంటలకు ప్రారంభమయ్యేది. టీవీలు వచ్చాక అది కాస్తా 10 గంటలైంది. కంప్యూటర్లు వచ్చాక 11 గంటలు., స్మార్ట్‌ఫోన్లు వచ్చాక అర్ధరాత్రి 12.. ఒంటి గంట, 2 గంటలు.. ఇలా.. దాటిపోతోంది.

నగరంలోనూ నిద్రలేమి
దేశ రాజధానిలోనే కాదు.. ప్రతి నగరం దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. విశాఖ నగరంలో ముఖ్యంగా యువతరం నిద్రకు దూరమైపోతోంది. ఒక దశలో అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల వరకూ నిద్రపోకుండా కొన్ని నెలల పాటు కాలం వెళ్లదీసిన వారి శరీర గడియారంలో వచ్చిన మార్పుల కారణంగా నిద్రపోదామని ఇప్పుడు ప్రయత్నిస్తున్నా.. ఫలితం శూన్యం. కేవలం యువతరమే కాదు.. ఉద్యోగులు, వ్యాపారులు సైతం.. తమ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాక.. సెల్‌ఫోన్‌తో సావాసం చేస్తూ.. ఆరోగ్యానికి మేలు చేకూర్చే నిద్రను మరిచిపోతున్నారు.

ఓవైపు  పని ఒత్తిడి, మరోవైపు.. టెక్నాలజీ రెండూ కలిసి సిటీజనులను నిద్రకు దూరం చేస్తున్నాయని నగరానికి చెందిన పలు సంస్థలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 83 శాతం మంది కలత నిద్రకు గురవుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ప్రభుత్వ, ప్రైవేట్, సొంత వ్యాపారాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రజలు నిద్ర సుఖానికి దూరమైపోతున్నారు. నిత్యం 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నవారు 31 శాతం కాగా, 6 గంటల కంటే తక్కువ సమయం శయనిస్తున్నవారు 27 శాతం మంది ఉండటం గమనార్హం.

ఇక 25 శాతం మంది ఏకంగా 5 గంటల కంటే తక్కువ సమయమే నిద్రపోతున్నారని అధ్యయనంలో తేలింది. 35 శాతం మంది అర్ధరాత్రి 12 నుంచి ఒంటిగంట దాటిన తర్వాత కానీ.. నిద్రకు ఉపక్రమిస్తున్నారంట. రాత్రి సమయంలో నిద్రలేమి కారణంగా పని చేస్తున్న ప్రాంతాల్లో 83 శాతం మంది ఓ పావు గంట సేపు కునుకు తీస్తున్నారని అధ్యయనంలో తేలింది.

చక్కటి నిద్రకు చిట్కాలివే....

  • నిద్రకు ఉపక్రమించే ముందు టీ, కాఫీలు తాగకూడదు.
  • నిద్రపోయే ప్రదేశంలో చీకటిగా ఉండాలి. వెలుతురు కళ్లపై పడకుండా జాగ్రత్త పడాలి.
  • నిద్రకు ఉపక్రమించే సమయంలో సెల్‌ఫోన్లను దూరం పెట్టాలి. అవసరమైతే స్విచాఫ్‌ చేయాలి.
  • వీలైనంత వరకూ పడుకునే సమయానికి గంట ముందుగానే టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్‌లు ఆఫ్‌ చేయాలి.
  • మంచి పుస్తకం చదువుతూ నిద్రపోతే గాఢనిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
  • ఇంట్లో వైఫై కనెక్షన్‌ ఉంటే.. రాత్రి 8 గంటలకే ఆఫ్‌ చేయాలి. అప్పుడే సోషల్‌మీడియాలో ఎలాంటి అప్‌డేట్స్‌ మిమ్మలను విసిగించవు.
  • మెడిటేషన్‌ సాధన చేస్తూ.. శరీరంపై పట్టు సాధించాలి.
  • యోగా, నడక, వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి.
  • మధ్య వయసులో ఉన్న వారు 24 గంటల్లో కచ్చితంగా నిద్రకు 8 గంటలు కేటాయించాలి. మిగిలిన 8 గంటలు పని, మరో 8 గంటలు శారీరక అవసరమైన పనులకు వినియోగించాలి. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top