ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్‌ అవినీతి చేపలు 

ACB Raids On ICDS Employees In Vizianagaram District - Sakshi

కూరగాయల కాంట్రాక్టర్‌ నుంచి లంచం డిమాండ్‌  

రూ.85వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సీడీపీఓ, సూపరింటెండెంట్‌లు  

కొత్తవలస: కూరగాయల ధరలు పెరిగాయి.. లంచం ఇచ్చుకోలేను.. బిల్లులు చెల్లించాలంటూ ప్రాథేయపడినా వియ్యంపేట ఐసీడీఎస్‌ సీడీపీఓ మణమ్మ, సూపరింటెండెంట్‌ వేణుగోపాల్‌లు కనికరించలేదు.  లంచం ఇవ్వాల్సిందేనని, లేదంటే ఒప్పందం రద్దుచేస్తామని బెదిరించారు. విధిలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారు వలపన్ని రూ.85వేలు లంచం డబ్బులతో ఇద్దరు ఉద్యోగులను కొత్తవలస గిరిజాల రోడ్డులోని ఐసీడీఎస్‌ కార్యాలయంలోనే సోమవారం పట్టుకున్నారు. విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. విజయనగరం ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం...  వియ్యంపేట ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని కొత్తవలస, ఎల్‌.కోట, వేపాడ మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు కూరగాయలు, ఆకు కూరలు, వంట దినుసుల సరఫరా కాంట్రాక్టును విశాఖపట్నం జిల్లా అక్కిరెడ్డిపాలెంకు చెందిన ఆడారి సురేష్‌ కుదుర్చుకున్నాడు.

2018 మార్చి నుంచి ఎస్‌.కోట మండలంలోని భవానీనగర్‌లోని దుకాణం నుంచి సరఫరా చేస్తున్నాడు. ఇతనికి ఈ ఏడాది ఆగస్టు, సెపె్టంబర్, అక్టోబర్‌  నెలల్లో సరఫరా చేసిన సరుకులకు గాను రూ.4,66,163 బిల్లు మంజూరైంది. ఈ ఏడాది నవంబర్‌కు సంబంధించి కొత్త ప్రభుత్వం మెనూ రేటు ఒక్కొక్కరికి 60 పైసలు పెంచింది. దీంతో అదనంగా నిధులు మంజూరయ్యాయి. పెరిగిన రేటు ప్రకారం బిల్లు చెల్లించేందుకు రూ.89 వేలు లంచం ఇవ్వాలని సీడీపీఓ మణమ్మ, సూపరిండెంట్‌ వేణుగోపాల్‌లు సురేష్‌ను డిమాండు చేశారు. కూరగాయల ధరలతో పాటు ఉల్లి ధరలు కూడా పెరగటంతో లంచం ఇచ్చుకోలేనని సురేష్‌ బేరసారాలాడినా ఫలితం లేకపోయింది. దీంతో రూ.85 వేలు లంచం ఇస్తానని ఒప్పుకుని బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు విజయనగరం ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు, ఎస్సైలు సతీష్‌, మహేష్‌ తదితరులు వలపన్నారు.

సురేష్‌కు లంచం డబ్బులు ఇచ్చి కార్యాలయానికి పంపించారు. యథావిధిగా ఒప్పందం కుదుర్చుకున్న డబ్బులు తీసుకు వచ్చానని సీడీపీఓతో సురేష్‌ చెప్పాడు. ఆమె సూపరింటెండెంట్‌ను పిలిచి డబ్బులు తీసుకోమని చెప్పడంతో సూపరిండెంట్‌ తన బెంచి డ్రాయర్‌లో లంచం డబ్బు పెట్టాడు. అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు టేబుల్‌లో పెట్టిన నగదును స్వాదీనం చేసుకున్నారు. రసాయనిక పరీక్షలు నిర్వహించి సీడీపీఓ, సూపరింటెండెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో మంగళవారం హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. సీడీపీఓ మణమ్మ కొద్ది కాలం కిందట పిఠాపురం నుంచి బదిలీపై కొత్తవలసకు వచ్చారు.

దాడుల పరంపర..  
కొత్తవలసలో గతంలో సబ్‌ ట్రెజరరీ అధికారి, కొత్తవలస పోలీసు స్టేషన్‌లో పనిచేసిన ఇద్దరు ఎస్సైలు,  కొత్తవలస, ఎల్‌.కోట తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసిన వీఆర్వోలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.  

కాంట్రాక్టు రద్దుచేస్తామని బెదిరించారు..  
వియ్యంపేట ప్రాజెక్టు పరిధిలోని మూడు మండలాల అంగన్‌వాడీ కేంద్రాలకు కూరగాయలు, వంటదినులు 2018 నుంచి పంపిణీ చేస్తున్నాను. ఈ ఏడాది ఆగస్టు, సెపె్టంబర్, అక్టోబర్‌ నెలలకు సంబంధించిన బిల్లు రూ.4,66,163 వచ్చింది. దీనికి తోడు నవంబర్‌ నెలలో ఒక్కొక్కరికి మెనూపై రూ. 60 పైసలను ప్రభుత్వం పెంచింది. నవంబర్‌ నెలకు రావాల్సిన రూ.1,89,000లకు రూ.89,000 లంచం ఇవ్వాలని సీడీపీఓ డిమాండ్‌ చేశారు. లేదంటే కాంట్రాక్టు రద్దు చేసి ఇతరులకు ఇస్తామని బెదిరించారు. రూ. 85 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాను. 
– ఆడారి సురేష్‌, కూరగాయల కాంట్రాక్టర్‌    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top