ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలను ఆదేశించారు.
కర్నూలు(అగ్రికల్చర్) : ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎపిక్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఇది ఎన్నికల సంఘానికి సంబంధించినది, కావున ఏమాత్రం అలసత్వానికి తావు లేకుండా షెడ్యూలు ప్రకారం పూర్తి చేయాలన్నారు.
ఇందులో భాగంగా కర్నూలు కలెక్టరేట్‌తో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నేషనల్ ఎలక్ట్రోరల్ ప్యూరిఫికేషన్, అతంటికేషన్ ప్రోగ్రామ్ కింద ప్రత్యేక సెల్‌లను ప్రారంభించామని తెలిపారు. ఒక ఓటరుకు ఒక్క ఆధార్ మాత్రమే ఉంటుందని, దీనిని ఒక్క ఎపిక్ కార్డుకే అనుసంధానం చేయాలని తెలిపారు. ప్రతి ఓటరు తన ఎపిక్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకునే విధంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో బోగస్ ఓటర్లు భారీగా ఉన్నాయనే ఫిర్యాదులు ఉన్నాయని, బోగస్ ఓటర్లను అరికట్టేందుకు ఆధార్ సీడింగ్ ఒక్కటే శరణ్యమని పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎపిక్ కార్డులను ఆధార్‌తో సీడింగ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.
పోలింగ్ కేంద్రాలకు బీఎల్‌ఓలు లేకపోతే వెంటనే నియమించుకోవాలని తెలిపారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఆధార్ నెంబర్లు సేకరించాలన్నారు. ఓటర్ల జాబితాలో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఉన్నవారి నుంచి కలర్ ఫొటోలు సేకరించాలన్నారు. ఈనెల 15వ తేదీ నాటికి బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్ల ఎంపిక పూర్తి కావాలని సూచించారు. సీడింగ్ ప్రక్రియ ఏప్రిల్ ఒకటి నుంచి మే 15 వరకు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా స్థాయిలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలకు శిక్షణ ఇస్తామని, వీరు మండల స్థాయిలో బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తారన్నారు.
ఆధార్ సీడింగ్‌పై నియోజకవర్గస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు. ఆధార్ సీడింగ్ ఓటర్లు స్వంతంగా చేసుకోవచ్చని పేర్కొన్నారు. లేకపోతే ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా సీడింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏప్రిల్ 12న ప్రత్యేక క్యాంపు నిర్వహించి ఓటర్లకు ఆధార్ సీడింగ్‌పై అవగాహన కల్పించడంతో పాటు బోగస్ ఓటర్ల తొలగింపులకు నోటీసులు ఇవ్వాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఏజేసీ రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడు తదితరులు పాల్గొన్నారు.