బాబూ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. | 7 questions to Chandrababu | Sakshi
Sakshi News home page

బాబూ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి..

Apr 15 2018 2:58 AM | Updated on Apr 15 2018 2:58 AM

7 questions to Chandrababu - Sakshi

ఈ మధ్య కాలంలోనే బాబు ఇంకో సినిమా చూపిస్తున్నారు. ప్రత్యేక హోదా.. ఓ మాయాజాలం అనే సినిమా. నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న నేను మీ అందరి తరఫున చంద్రబాబుకు 7 ప్రశ్నలు వేస్తున్నా. దమ్ము, ధైర్యం ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి.  

1.ప్లానింగ్‌ కమిషన్‌ను ఒక్క మాటైనా అడిగారా?
2014 మార్చి 2వ తేదీన రాష్ట్రాన్ని విడగొట్టి పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేబినెట్‌ తీర్మానాన్ని ఆమోదించి ప్లానింగ్‌ కమిషన్‌కు పంపించారు. చంద్రబాబు 2014 జూన్‌లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఏడు నెలల పాటు ఆ ఉత్తర్వులు ప్లానింగ్‌ కమిషన్‌ వద్దే ఉన్నాయి.

మోదీతో పని లేదు.. మరెవ్వరితో పని లేదు.. ఆ ఏడు నెలల్లో చంద్రబాబు అధికారంలో ఉంటూ ప్లానింగ్‌ కమిషన్‌కు కనీసం ఒక్క లేఖ కూడా రాయలేదు. ఒక్కసారి కూడా వారిని కలవలేదు.. కనీసం అడగలేదు. ఏడు నెలలు గాడిదలు కాశారా? ఇది అన్యాయం కాదా? ఇది మోసం కాదా?  

2. ప్యాకేజీని స్వాగతించింది నిజం కాదా?  
2016 సెప్టెంబర్‌ 8న అర్ధరాత్రి ప్రత్యేక హోదాకు బదులు ఒక అబద్ధపు ప్యాకేజీని ప్రకటించారు. అప్పుడు కేంద్ర మంత్రి జైట్లీతో పాటు టీడీపీ కేంద్ర మంత్రులూ పక్కనే ఉన్నారు. వీరు గొప్ప ప్యాకేజీ అంటూ మీడియాకు లీకులు ఇచ్చారు. బాబు కోరిక మేరకు ప్యాకేజీని ప్రకటించారు. దీనికి నిదర్శనం జైట్లీ రాసిన లేఖనే సాక్ష్యం. అదే అర్ధరాత్రి నిద్రమేల్కొని చంద్రబాబు అరుణ్‌ జైట్లీ ప్రకటనను స్వాగతించారు.

ఢిల్లీకి వెళ్లి శాలువా కప్పి సన్మానించారు. అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం పెట్టి అభినందించారు. అంతటితో ఆగకుండా ప్రత్యేక హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయన్నారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ వెటకారం చేశారు. 2017 జనవరి 27న ప్రెస్‌మీట్‌ పెట్టి.. ఏ రాష్ట్రానికైనా కేంద్రం.. ఇంతకంటే ఎక్కువ చేసిందా అంటూ సవాలు విసురుతున్నా అనడం మోసం కాదా చంద్రబాబూ?  

3. అభివృద్థిపై తప్పుడు సంకేతాలివ్వలేదా?  
ప్రత్యేక హోదా అవసరం లేదు అనే అలోచన వచ్చే విధంగా బయటి ప్రపంచానికి తప్పుడు సంకేతాలు ఇచ్చింది నిజం కాదా? దేశం మొత్తం 6 శాతం అభివృద్ధి ఉంటే.. 12 శాతం జీడీపీతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగెడుతోందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌ బాగా అభివృద్ధి చెందిందని, హోదా ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లు బయటి ప్రపంచానికి గొప్పలు చెప్పలేదా? ఏపీలో ఎటువంటి ఉద్యోగాలు రాకపోయినా, రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని సమ్మిట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేయలేదా? దేశం కంటే రాష్ట్ర అభివృద్ధి ఎక్కువగా ఉందని ప్రచారం చేయలేదా?  

4. వైఎస్సార్‌సీపీ పోరాటాన్ని నీరుగార్చ లేదా?  
ఈ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాపై మీరు నీళ్లు చల్లారు. వైఎస్సార్‌సీపీ అన్ని పార్టీలను కలుపుకొని బంద్‌కు పిలుపునిస్తే బలవంతంగా పోలీసులను పెట్టి.. ఆర్టీసీ బస్సులు తిప్పించలేదా? నేను నిరాహార దీక్షలు చేస్తుంటే.. మోదీ ఏపీకి వస్తున్నారని.. ఆ సమయంలో ప్రతిపక్ష నేత నిరాహార దీక్ష చేస్తుండటం బాగోదని బలవంతంగా ఎనిమిదవ రోజు నా దీక్షను భగ్నం చేసిన చరిత్ర నీది కాదా? యువభేరీలతో యువత, విద్యార్థులను చైతన్యవంతం చేస్తుంటే ఆ కార్యక్రమానికి హాజరైతే అరెస్ట్‌ చేస్తామని, పీడీ యాక్ట్‌ పెడతామని పిల్లలను సైతం బెదిరించలేదా? ఇవన్నీ అన్యాయం, అధర్మం కాదా?  

5. అవిశ్వాసంపై యూటర్న్‌ నిజం కాదా?  
వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండకపోతే చంద్రబాబు పెట్టేవారా? మార్చి 15 గురువారం సాయంత్రం అసెంబ్లీలో.. మీకు సంఖ్యాబలం ఉంటేనే మీకు మద్దతిస్తామన్నారు. మరుసటి రోజు మార్చి 16న యూటర్న్‌ తీసుకున్నారు. కారణం వైఎస్సార్‌సీపీ ఎంపీలు జగన్‌ రాసిన లేఖలు తీసుకుని మిగిలిన పార్టీల వారందర్నీ ఒప్పిస్తుంటే, అందరూ మద్దతు ప్రకటిస్తుంటే.. ఆ విషయం జాతీయ మీడియాలో వస్తుంటే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. తానే అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు, అందరూ తనకే మద్దతిస్తున్నట్లు ఊసరవెల్లి కంటే వేగంగా ప్లేటు మార్చారు. ఇంత దారుణంగా ప్రజలను మోసం చేయడం అన్యాయం కాదా?  

6. నల్ల బ్యాడ్జీలతో హోదా వస్తుందా?  
ఇవాళ అఖిలపక్షమని మళ్లీ డ్రామాలాడుతున్నారు. ఎవరూ నిరసనలు, ఆందోళనలు చేయకూడదట. ఉద్యమంలోకి విద్యార్థులు రాకూడదట. కేవలం నల్లబ్యాడ్జీలు ధరిస్తే ప్రత్యేక హోదా వస్తుందా?  

7. నకిలీ బుల్లెట్‌తో యుద్ధం చేస్తారా?
ఓ సైనికుడు తుపాకీ చేతపుచ్చుకున్నాడు. యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. తుపాకీని శత్రువులపై గురి పెట్టాడు. ట్రిగ్గర్‌ పేల్చాడు. బుల్లెట్‌ బయటకు రాలేదు. ఎందుకంటే అది నకిలీ బుల్లెట్‌. దీంతో నష్టపోవాల్సి వచ్చింది. ఇక్కడ ఆంధ్రరాష్ట్రం అనే సైనికుడు నకిలీ బుల్లెట్‌ పేల్చడం వల్ల ఇదంతా జరిగింది. చంద్రబాబు తన ఎంపీల చేత రాజీనామా చేయించి, దీక్షకు కూర్చోబెట్టివుంటే దేశం మొత్తం మనవైపు చూసేది కాదా? ప్రత్యేక హోదా వచ్చి ఉండేది కాదా? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement