20 రోజుల్లో 40 మంది విద్యార్థుల ఆత్మహత్య

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ 

ఒంగోలు టౌన్‌: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు 20 రోజుల్లో 40 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌.రాజశేఖర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు కేంద్రాలుగా మారిన నారాయణ, చైతన్య విద్యా సంస్థలను మూసివేస్తూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక మాదాల నారాయణస్వామి భవన్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉందన్నారు. ర్యాంకుల కోసం, మార్కుల కోసం విద్యార్థులను మర యంత్రాలుగా మార్చేస్తున్నాయని విమర్శించారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేని విద్యార్థులు చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

నారాయణ, చైతన్య కాలేజీలకు చెందిన విద్యార్థుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. ఇంటర్‌బోర్డు కార్పొరేట్‌ కాలేజీల జేబు సంస్థగా మారిందని విమర్శించారు. ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నా, ఆదివారాలు, సెలవు రోజుల్లో తరగతులు కొనసాగిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం వారి తల్లిదండ్రులేనంటూ ప్రభుత్వం నివేదిక సమర్పించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలని, ప్రొఫెసర్‌ నీరదారెడ్డి, చక్రపాణి కమిటీల సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి ఎం.ధనరాజ్‌తో పాటు నాయకులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top