330వ రోజు పాదయాత్ర డైరీ

330th day padayatra diary - Sakshi

ఇప్పటివరకు నడిచిన దూరం: 3,529.1 కిలోమీటర్లు
24–12–2018, సోమవారం 
చేపర, శ్రీకాకుళం జిల్లా 

ప్రచారం మీదున్న శ్రద్ధ పరిహారంపై పెట్టుంటే.. బాధితులకు న్యాయం జరిగేది కాదా? 
గిరిజన సోదరులు ఎక్కువగా ఉండే మెళియాపుట్టి మండలంలో ఈ రోజు నా పాదయాత్ర సాగింది. ప్రారంభం నుంచే గిరిజన సంప్రదాయ నృత్యాలతో.. తప్పెటగుండ్లతో ఎంతో ఆప్యాయంగా వాళ్లు స్వాగతం పలకడం ఆనందాన్నిచ్చింది. ఉప్పొంగే ప్రేమానురాగాలతో వాళ్లు నా చేతులు పట్టుకుని థింసా నృత్యం చేయడం నాకో మధుర స్మృతే. ఉదయం ఆదివాసీ సంఘాల ప్రతినిధులు కలిశారు. అమాయక గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. తిత్లీ తుపానుకు ఈ మండలం కూడా బాగా దెబ్బతింది. సాయం కోసం అల్లాడిపోతున్న వారి వద్దకు 15 రోజుల తర్వాతగానీ అధికారులు రాలేదని చెప్పారు. తుపాను బీభత్సానికి వేల సంఖ్యలో ఇళ్లు దెబ్బతింటే.. అధికారులు మాత్రం వందల్లోనే గుర్తించారట. పరిహారంలో సైతం వివక్ష చూపించారట. ఆకలి కేకలతో తహసీల్దార్‌ కార్యాలయాన్ని చుట్టుముడితే.. దయలేని ఈ సర్కార్‌ కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టిందన్నా.. అంటూ బావురుమన్నారు. తమ బాధలు తెలుసుకున్న న్యాయమూర్తి.. పోలీసులనే మందలించారని చెప్పారు. 

గిరిజన ఉత్పత్తులకు ఏమాత్రం ప్రోత్సాహం లభించడం లేదని వాళ్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. మా సంపదంతా ప్రైవేటు వాళ్లకు దోచిపెట్టడానికి గిరిజన సహకార సంస్థను సైతం నిర్వీర్యం చేస్తున్నారన్నా.. అంటూ ఏకరువుపెట్టారు. బందపల్లికి చెందిన అప్పన్న అనే నిరుపేద గిరిజన రైతు పంట మొత్తం తిత్లీ దెబ్బకు తుడిచిపెట్టుకుపోయిందట. పరిహారం కింద రూ.12,145 ఇస్తున్నట్టు చంద్రబాబు బొమ్మతో ఉన్న ఓ పత్రాన్ని అతని చేతికిచ్చారు. కానీ అప్పన్న ఖాతాలో మాత్రం ఇంతవరకూ ఒక్క పైసా పడలేదట. సర్కారీ సాయం కోసం తిరగడానికే వెయ్యి రూపాయలకు పైగా ఖర్చయిందట.. ఎంత దారుణం! 

దీనబంధుపురం గిరిజన అక్కచెల్లెమ్మలు ఎన్నో బాధలు చెప్పుకున్నారు. బీఈడీ చదువుకుంటూ.. ఉపాధి పనులకెళ్లిందట అరుణకుమారి అనే సోదరి. అంత కష్టపడ్డా.. ఏడాదయినా ఇంత వరకు ఆ ఉపాధి పనుల డబ్బులు మాత్రం ఇవ్వలేదట. ఇది శ్రమదోపిడీ కాక మరేంటి? 

ఈ రోజు పాదయాత్రలో ఇందిరమ్మ వికలాంగుల స్వయం శక్తి సంఘానికి చెందిన అక్కచెల్లెమ్మలు కలిశారు. రుణమాఫీ కాలేదని, పసుపు–కుంకుమల డబ్బు బూటకమేనని వివరించారు. బాధనిపించింది. మహిళలు.. పైగా గిరిజనులు.. ఆపై దివ్యాంగులు.. వారి పరిస్థితి చూస్తే.. వంచించే పాలకులకు తప్ప ఎవరికైనా జాలి కలుగుతుంది. సాయంత్రం మెళియాపుట్టిలో భారీ బహిరంగ సభ జరిగింది. ప్రజలు క్రిస్మస్‌ పర్వదినాన్ని జరుపుకొనే వెసులుబాటు కల్పించడం కోసం పాదయాత్రకు ఒక రోజు విరామాన్నిచ్చాను.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. తుపానుకు సర్వం కోల్పోయి పరిహారం కోసం బాధితులు అలమటిస్తుంటే.. మీరు మాత్రం కోట్లాది రూపాయల ప్రజా ధనం ఖర్చుచేసి.. అందరినీ ఆదుకుంటున్నట్టుగా ప్రచారం చేసుకోవడం వంచన కాదా? ప్రచారం మీదున్న శ్రద్ధ.. పరిహారం ఇవ్వడంపై పెట్టి ఉంటే కాస్తయినా న్యాయం జరిగేది కాదా?   
- వైఎస్‌ జగన్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top