325వ రోజు పాదయాత్ర డైరీ

325th day padayatra diary - Sakshi

ఇప్పటివరకు నడిచిన దూరం: 3,486.9 కిలోమీటర్లు
19–12–2018, బుధవారం 
దుర్గమ్మపేట, శ్రీకాకుళం జిల్లా 

మీ మొదటి సంతకాలు గుర్తున్నాయా బాబూ?
ఈరోజు కోటబొమ్మాళి మండలంలో పాదయాత్ర సాగింది. రోజంతా పెద్ద సంఖ్యలో జనం కలిశారు. సమస్యల బరువూ అంతే ఉంది. ఇది మంత్రి గారి సొంత మండలం. కానీ ఇక్కడ అభివృద్ధి కాసింతైనా కనబడలేదు. సమస్యల్లో అధిక భాగం మంత్రి గారి పుణ్యమేనని జనం చెప్పారు. మంత్రి పదవులనేవి సమస్యలు తీర్చడానికా? పెంచడానికా? అనిపించింది.  

జర్జంగి గ్రామ అక్కచెల్లెమ్మలు కలిశారు. ఆ ఒక్క గ్రామంలోనే పదమూడు దాకా బెల్టుషాపులున్నాయన్నారు. ఆరోగ్యాలు పాడై ప్రాణాలు పోతున్నా.. కుటుంబాలు నాశనమవుతున్నా చెప్పుకునే దిక్కే లేకుండా పోయిందని వాపోయారు. మరోవైపు ఇక్కడంతా కల్తీ మద్యమేనని గ్రామస్తులు చెప్పారు. నాసిరకం మద్యాన్ని బ్రాండెడ్‌ కంపెనీల బాటిళ్లలో పోసి అధిక ధరలకు అమ్ముతున్నారట. జేబులకు చిల్లులు పెడుతూ ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారట. ఆ కల్తీ మద్యం వెనుక మంత్రి గారే ఉంటే ఇక అధికారులేం చేస్తారని బావురుమన్నారు. అడ్డదారుల్లో ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఎంత దారుణం. 

మంత్రి గారి ఇలాఖాలో అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందన్నది యలమంచిలి అక్కచెల్లెమ్మల ఆవేదన. వారి కష్టాలు వివక్షకు పరాకాష్టగా అనిపించాయి. ఈ ప్రభుత్వం వస్తూనే కక్షగట్టి మరీ అక్కడి మహిళా సర్పంచ్‌ చెక్‌పవర్‌ తీసేయించారట. హైకోర్టుకు వెళ్లి చెక్‌పవర్‌ తెచ్చుకుంటే.. ఆ తర్వాత కొద్దిరోజులకే మళ్లీ తీసేయించిన దుర్మార్గం వారిది. అన్ని అర్హతలున్నా.. 80 మందికి పెన్షన్లు పీకేశారట. 98 ఏళ్ల దుంపల లచ్చమ్మకు, కూలీ పని చేసుకునే వితంతువైన ఆమె కూతురుకు, 90 ఏళ్ల పైబడ్డ రెండు కళ్లూ లేని పొట్నూరు చిన్నమ్మి అనే అవ్వకు పింఛన్లు తీసేశారట. రేషన్‌ కూడా ఆపేశారట. రెండు కాళ్లూ లేని వంద శాతం వైకల్యమున్న కోన అప్పన్న అనే దివ్యాంగుడికి రేషన్‌ డీలర్‌షిప్‌ తీసేసి వేధించారట. ఆ అభాగ్యుడు మానసిక క్షోభతోనే చివరకు మరణించాడట. కోర్టుకెళ్లి కొందరు పింఛన్లు తెచ్చుకున్నా మూడు నెలలకే మళ్లీ ఆపేసిన పైశాచికత్వం వారిది. నాన్న గారు ఏర్పాటు చేసిన రక్షిత మంచి నీటి పథకానికి తాగునీరివ్వని దుర్మార్గం. మరోవైపు ఇచ్చిన అరకొర తుపాను పరిహారమూ ‘పచ్చ’చొక్కాలకే పరిమితం చేసిన అరాచకత్వం. తుపాను కేవలం ఒక్క పార్టీ వారినే ఎంచుకొని మరీ నష్టపరుస్తుందా? అది కూడా తెలుగుదేశం వారిని మాత్రమేనా? కేవలం పరిహారం కోసమేనా? 

ఈరోజు విపరీతమైన జనం మధ్య నుంచే లలిత అనే స్కూలుకెళ్లే చిట్టితల్లి వచ్చి కలిసింది. రెండు కిలోమీటర్ల నుంచి నన్ను కలవాలని పరిగెత్తుకొని వస్తోందట. చెప్పులు కూడా పోయాయి. ఆ గుంపులో ఎవ్వరో కాళ్లు కూడా తొక్కేశారట. పంటి బిగువన నొప్పిని అదిమిపట్టి నన్ను కలవాలని వచ్చింది. ఒక్కసారిగా కన్నీళ్లను ఆపుకోలేక భోరున విలపించింది. ఆ చిట్టితల్లి స్వచ్ఛమైన అభిమానం నన్ను కూడా ఉద్వేగానికి గురిచేసింది.  

కోటబొమ్మాళి దగ్గర కొంతమంది దళితులు కలిశారు. దాదాపు 23 కుటుంబాల వారు 40 ఏళ్లుగా ఏడున్నర ఎకరాలు సాగుచేసుకుంటున్నారట. ఆ ఊరికి ఆనుకొని ఉన్న ఆ భూముల ధరలు బాగా పెరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం నాయకులు వాటిపై కన్నేశారట. అక్కడ పౌర సరఫరాల స్టాక్‌ పాయింట్లు, డిగ్రీ కాలేజీ కడతామని.. మంత్రి గారి అండతో వారి డీ పట్టాలు రద్దు చేయించి ఆ భూములను ఆక్రమించారట. ఈ ప్రభుత్వ కాలమైపోతున్నా ఇప్పటిదాకా ఒక్క ఇటుక కూడా పడలేదంటే దాని వెనుకున్న దురుద్దేశం అర్థం చేసుకోవచ్చు.  

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. మీరు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే.. మీ హయాంలోనే బెల్టుషాపులు పురుడు పోసుకుంది వాస్తవం కాదా? మద్యం ఆదాయం పెంచడం కోసం టార్గెట్లు పెట్టి మరీ బెల్టుషాపులు ఎక్కువ చేస్తుండటం గ్రామగ్రామానా కనిపిస్తోంది. దీనికి ఏం సమాధానం చెబుతారు? బెల్టుషాపుల రద్దు మీ మొదటి సంతకాల్లో ఒకటి. కనీసం అదైనా గుర్తుందా? మీ మొదటి సంతకాలు మొదటి మోసాలుగా మిగిలిపోవ డం మీకు అవమానంగా అనిపించడం లేదా? 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top