323వ రోజు పాదయాత్ర డైరీ | 323rd day padayatra diary | Sakshi
Sakshi News home page

323వ రోజు పాదయాత్ర డైరీ

Dec 18 2018 3:06 AM | Updated on Dec 18 2018 7:21 AM

323rd day padayatra diary - Sakshi

ఇప్పటివరకు నడిచిన దూరం– 3,470.3 కిలోమీటర్లు
17–12–2018, సోమవారం 
లింగాలవలస, శ్రీకాకుళం జిల్లా     

రాష్ట్ర ప్రజల కన్నా రాజకీయ ప్రయోజనాలే మీకు ముఖ్యమా బాబూ? 
ఈరోజు సోదరి షర్మిల పుట్టినరోజు. గతంలో ఆమె పాదయాత్రలో నడిచిన దారిలోనే నేటి నా పాదయాత్ర కూడా సాగడం విశేషం. ఈరోజు టెక్కలిపాడు, లింగాలవలస రైతన్నలు కలిసి నాన్నగారిని గుర్తు చేసుకున్నారు. తమ గ్రామాలకు సాగునీరు అందుతోందంటే నాన్నగారు ఏర్పాటు చేసిన టెక్కలిపాడు ఎత్తిపోతల, లింగాలవలస ఎత్తిపోతల పుణ్యమేనని చెప్పారు. సాగునీటి అవసరాలు తీర్చాలే గానీ కలకాలం రైతన్నలు గుండెల్లో పెట్టుకుంటారు. 

వెటర్నరీ పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన యువకులు కలిశారు. 1,200కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని వాపోయారు. ‘పాలిటెక్నిక్‌ చేసినవారు ఇంజనీరింగ్‌ డిగ్రీ చేయ గలుగుతున్నారు. అగ్రికల్చర్‌ డిప్లొమా చేసినవారిని ఏజీ బీఎస్సీ చేయడానికి అనుమతిస్తున్నారు. కానీ వెటర్నరీ డిప్లొమా చేసిన మాకు మాత్రం వెటర్నరీ సైన్స్‌ డిగ్రీ చేయడానికి అర్హత లేదంటున్నారు’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ఉద్యోగ అవకాశాలు లేక, మరోవైపు పై చదువులకూ పనికి రాకపోతే ఇక మేం చదివిన డిప్లొమా ఎందుకంటూ నిరాశ వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వ కళాశాలలకన్నా రెట్టింపు సీట్లతో ప్రైవేటు కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అవన్నీ టీడీపీ నాయకులవే కావడం గమనార్హం. నిన్న కలిసిన వ్యవసాయ విద్యార్థులైనా.. నేటి వెటర్నరీ వారైనా ఒకటే ఆవేదన. ఈ నాలుగున్నరేళ్లలో వేలాది మంది చదువులు పూర్తి చేసుకొని బయటకు వస్తున్నా ఒక్కటంటే ఒక్క ఉద్యోగ అవకాశం కల్పించకపోగా రూ.లక్షల్లో ఫీజులు దండుకోవడానికి ప్రమాణాలు లేని ప్రైవేటు కళాశాలల ఏర్పాటుకు పచ్చచొక్కాలకు అనుమతులివ్వడం ఆందోళనకరం. విద్యను కేవలం వ్యాపార దృష్టితో చూసే పాలనలో నిరుద్యోగ సమస్య పెరగక ఏమవుతుంది?  

నారాయణవలసలో దారిపక్కనే ఉన్న పశువుల సంతను చూశాను. వంద సంవత్సరాల పైబడిన చరిత్ర గల ఆ సంత జిల్లాలోనే పెద్దదని గ్రామస్తులు చెప్పారు. ఒకప్పుడు ఈ ప్రాంత పాడిరైతుల వైభవానికి అద్దం పట్టిన ఆ సంత.. ఈరోజు వ్యవసాయ దుస్థితిని పట్టిచూపుతోంది. గతంలో ఈ ప్రాంత రైతులు మంచి మంచి పశువులను కొనడానికి ఉపయోగపడ్డ ఈ సంత.. ఈరోజు పశువులను అమ్ముకునే కేంద్రంగా మారింది. ఆ పశువులన్నీ కబేళాలకు తరలిపోతున్నాయని తెలిసి గుండె బరువెక్కింది. అక్రమ రవాణాకు అడ్డాగా మారిన ఈ ప్రాంతం నుంచే ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌కు సైతం పశువులను తరలిస్తున్నారట. ఈ అక్రమాలకు పాత్రధారులు, సూత్రధారులు స్థానిక పచ్చనేతలు, మంత్రివర్యులేనట. వ్యవసాయం భారమై, పాడి గిట్టుబాటుకాక విధిలేక పశువులను అమ్ముకుంటున్న రైతన్నలను.. దళారులను పెట్టి మరీ దోచుకోవడం చాలా బాధనిపించింది.  

ఈరోజు ఉదయం నుంచి పెథాయ్‌ తుపాను ప్రభావంతో వీస్తున్న చలిగాలులు, అప్పుడప్పుడు పడుతున్న వర్షపు చినుకుల మధ్యనే పాదయాత్ర సాగింది. గత తుపానులప్పుడు ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గుర్తొచ్చి ఆందోళన కలిగింది. ఆ వైఫల్యాల పాఠాలను గుర్తుంచుకొనైనా సహాయక చర్యలు చేపడితే బాగుంటుందనిపించింది. మధ్యాహ్నం నుంచి తుపాను ప్రభావంతో వర్షం అధికమవ్వడంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నేటి పాదయాత్ర అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది.  

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. తుపాను భయంతో ప్రాణాలు చేతపట్టుకొని ప్రజలు తీవ్ర ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ ఉంటే.. అనుక్షణం అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాల్సింది పోయి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాల సంబరాల్లో పాల్గొనడానికి వెళ్లడం భావ్యమేనా? రాష్ట్ర ప్రజలకన్నా రాజకీయ ప్రయోజనాలే మీకు ముఖ్యమా? 
- వైఎస్‌ జగన్‌            

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement