320వ రోజు పాదయాత్ర డైరీ

320th day padayatra diary - Sakshi

ఇప్పటివరకు నడిచిన దూరం: 3,441.9 కిలోమీటర్లు
12–12–2018, బుధవారం, నక్కపేట క్రాస్, శ్రీకాకుళం జిల్లా 

డ్వాక్రా అక్కచెల్లెమ్మలను డిఫాల్టర్లుగా మార్చింది మీరు కాదా బాబూ?
శిథిలమైన ఒక ప్రహరీ గోడ పక్కగా ఉదయం పాదయాత్ర సాగింది. ఒకప్పుడు ఘనచరిత్ర కలిగిన ఆమదాలవలస చక్కెర ఫ్యాక్టరీ అది. నేడు ఆ వైభవం గత చరిత్రగా మిగిలిపోయింది. ఆ పాపానికి బాబుగారే కారణమన్నారు.. రైతన్నలు. ఆయన గత హయాంలో కమీషన్ల కోసం కారుచౌకగా ఆ ఫ్యాక్టరీనే అమ్మేశారు. దానిపై రైతన్నలు న్యాయపోరాటం చేస్తే వారికి వ్యతిరేకంగా కోర్టులో కేసు నడిపిన ఘనత కూడా ఆయనదే. మళ్లీ మొన్న ఎన్నికల ముందు.. ఆమదాలవలస బహిరంగ సభలో షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తానని, సహకార రంగంలో నడిపిస్తానని హామీ ఇచ్చారట. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన తర్వాత ఏరువాక కార్యక్రమంలో ఆ హామీని రైతన్నలు గుర్తు చేస్తే అది గడిచిపోయిన అధ్యాయమని నిర్లజ్జగా మాట్లాడారట. రంగులు మార్చే ఊసరవెల్లి కూడా ఈయనకు సాటిరాదేమో.  

కళాకారులకు, క్రీడాకారులకు ప్రసిద్ధి చెందిన కుగ్రామం.. ఊసవానిపేట. మృదంగంలో ఐదుసార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్న బంకుపల్లి శ్రీనివాసశర్మ కలిశాడు. మూడుసార్లు నాన్నగారి చేతుల మీదుగా అవార్డుల్ని, నగదు బహుమతిని అందుకున్నానని ఆనందంగా చెప్పాడు. ఆ ఫొటోలు కూడా చూపించాడు. ఇప్పుడు అలా గుర్తించేవారే లేకపోవడంతో కళ వైపు కన్నెత్తి చూసేవారే కరువయ్యారని వాపోయాడు. అదే గ్రామం కరణం మల్లీశ్వరి, నీలంశెట్టి లక్ష్మి లాంటి అంతర్జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టర్లను అందించింది. వారే కాకుండా ఈ ఆమదాలవలస ప్రాంతంలో గుర్తింపే లేని మట్టిలో మాణిక్యాలెన్నో ఉన్నాయట. పశువులశాలల్లోనే ప్రాక్టీస్‌ చేసి జాతీయ స్థాయిలో పతకాలందుకున్న వెయిట్‌లిఫ్టర్లూ ఉన్నారు. పేదరికమున్నా వారి తల్లిదండ్రులు పస్తులుండి మరీ పౌష్టికాహారం అందించారట.

పాతికపైగా జాతీయ స్థాయి పతకాలు సాధించిన ఎందరో క్రీడాకారులు ప్రోత్సాహం లేక చిరు వ్యాపారాలు చేసుకుంటూ, తోపుడు బళ్ల మీద పండ్లు అమ్ముకుంటూ జీవిస్తున్నారని తెలిసి చాలా బాధేసింది. ఆ క్రీడాకారులకు చిన్నపాటి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా అమ్మేసుకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం పట్టెడన్నం సంపాదించలేని క్రీడలెందుకని వాటివైపు వెళ్లేవారే తక్కువైపోయారట.  

శ్రీకాకుళం, ఆమదాలవలసలకు వంశధార నీటిని అందించడానికి నాన్నగారు ఏర్పాటు చేసిన వయాడక్ట్‌ను చూశాను. కాలువ ద్వారా నీళ్లందించడానికి రైల్వే ట్రాక్‌ అడ్డుగా ఉండటంతో అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాక్‌ కింద నుంచి నీటిని తీసుకొచ్చే పథకం అది. మనసు ఉండాలే కానీ మార్గముంటుందనడానికి అది ఓ మంచి ఉదాహరణ.  

బాబుగారి రుణమాఫీ మోసానికి బలైన వెంకటాపురం డ్వాక్రా అక్కచెల్లెమ్మలు కలిశారు. ఆయన మాటలు నమ్మి అప్పు కట్టకపోవడంతో మొండి బకాయిదారులంటూ వారి పేర్లు బోర్డులపై రాసి పంచాయతీ కార్యాలయాల్లోనూ, బ్యాంకుల్లోనూ పెట్టారట. ఎగవేతదారులంటూ దండోరాలు కూడా వేయించారట. ఇంతకన్నా అమానుషం ఉంటుందా? కోర్టు నోటీసులూ ఇచ్చారట. ఇంటికొచ్చి మరీ అధికారులు వేధిస్తున్నారట. ‘మాఫీ చేయండని మేము అడిగామా? కట్టవద్దని బాబుగారే చెప్పి ఇప్పుడిలా అవమానించడం, వేధించడం న్యాయమా?’అని కన్నీటిపర్యంతమయ్యారు. ఇవి భరించలేక నాఅన్నవాళ్లెవరూ లేని తవిటమ్మ అవ్వ ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిందట. కేవలం తన ఒక్కడి స్వార్థం కోసం ఇంతమంది అక్కచెల్లెమ్మలను కన్నీరు పెట్టించడం ఎంత ఆటవికం? 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రుణమాఫీ చేయాలని డ్వాక్రా అక్కచెల్లెమ్మలు అడిగారా? అడగకుండానే రుణాలు కట్టవద్దండి.. అన్నీ మాఫీ చేసేస్తానని ప్రకటించి ఇంటింటికీ ప్రచారం చేయించింది మీరే కదా! అధికారంలోకి వచ్చాక మాఫీ చేయ కపోగా.. వారిని డిఫాల్టర్లుగా మార్చి, కొత్త రుణాలు పుట్టకుం డా చేసింది మీరు కాదా? వారి పేర్లను బోర్డులపై రాయించి.. బ్యాంకు నోటీసులు ఇప్పించి.. అవమానించడం ద్రోహం కాదా?  
- వైఎస్‌ జగన్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top