316వ రోజు పాదయాత్ర డైరీ

316th day padayatra diary - Sakshi

ఇప్పటి వరకు నడిచిన దూరం 3,416.1 కిలోమీటర్లు
08–12–2018, శనివారం.
ఆదివారంపేట, శ్రీకాకుళం జిల్లా.

నోటికాడ కూటిని లాగేసుకుని.. పరమాన్నం పెడతాననేవాడిని నమ్మేదెలా?!
ఈ రోజు ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. కుశాలపురం వద్ద.. నారాయణపురం కాలువ కళావిహీనంగా కనిపించింది. ఈ ఎచ్చెర్ల మండలంలో 3000 ఎకరాలకు నీరందించాల్సిన కాలువ పూర్తిగా ఎండిపోయింది. రైతన్నలపై ఈ పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. 

ఉదయం తేజ అనే యువ అథ్లెట్‌ కలిశాడు. 1500, 5000 మీటర్ల పరుగు పందేల్లో జాతీయ స్థాయిలో పాల్గొన్న ప్రతిభావంతుడు. ఈ ప్రభుత్వ హయాంలో క్రీడలకు పట్టిన దుస్థితి గురించి చెప్పాడు. ‘అన్నా.. శ్రీకాకుళం పట్టణంలో రెండు క్రీడామైదానాలుంటే.. రెండింటినీ పనికిరాకుండా చేశారు. కోడి రామ్మూర్తి స్టేడియాన్నీ.. ఆధునికీకరణ పేరుతో పడగొట్టి గాలికొదిలేశారు. ఆగస్టులో జరిగిన బాబుగారి పర్యటన ఏర్పాట్ల కోసం.. ఇక్కడి ఆర్ట్స్‌ కాలేజీకి చెందిన మరో మైదానాన్ని వాడుకుని పాడుచేశారు.

మైదానమే లేకపోతే నాలాంటి వారు ఎక్కడ ప్రాక్టీస్‌ చేసుకోవాలి? పోటీలను వదులుకోవాల్సిందేనా’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పేదరికం, వెనుకబాటుతనం ఎక్కువగా ఉన్నా.. ప్రతిభకు, సామర్థ్యానికి కొదువలేనిది సిక్కోలు జిల్లా. అరకొర సౌకర్యాల మధ్యనే అద్భుతాలు సృష్టించిన కోడి రామ్మూర్తి లాంటి యోధుడిని, కరణం మల్లీశ్వరిలాంటి ఒలింపియన్‌ను అందించిన గడ్డ ఇది. అలాంటి జిల్లాకు మరింత ప్రోత్సాహం అందించి.. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాల్సిందిపోయి.. ఉన్న వసతుల్ని కూడా నాశనం చేసి, ప్రతిభావంతుల నైపుణ్యాన్ని సమాధి చేయడం చూస్తుంటే.. చాలా బాధేసింది. 

పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో రోడ్డుకిరువైపులా కూల్చేసిన ఇళ్లు, షాపులు కనిపించాయి. ఆ బాధితులొచ్చి కలిశారు. ఎన్నడూ లేని ఇబ్బంది.. ఈ పాలనలోనే వచ్చిందన్నారు. గత 30 ఏళ్లుగా వారంతా అక్కడే నివాసాలు ఏర్పర్చుకుని.. ఇంటి పన్ను, కరెంటు బిల్లులు కడుతూనే ఉన్నారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపించకుండా రాత్రికి రాత్రే ఇళ్లు, షాపులు కూల్చేశారట. ఎక్కడ బతకాలన్నా.. అంటూ కంటతడి పెడుతుంటే మనసుకు బాధేసింది. కూల్చేసినవారు.. అక్కడ పార్కులు ఏర్పాటుచేస్తామని చెప్పారట. నిజంగా ఎంత హాస్యాస్పదం! లక్షణంగా ఉన్న మైదానాలు, పార్కులను కబ్జా చేస్తున్న నేతలకు.. పార్కులను ఏర్పాటుచేసేంత గొప్ప మనసు ఉంటుందా? ఇళ్లే లేని నిరుపేదలకు ఆవాసం కల్పించాల్సిన ప్రభుత్వం.. బాధ్యతను విస్మరించి ఉన్న గూళ్లను చెదరగొట్టడం మానవత్వమేనా? నోటికాడ కూటిని లాగేసుకుని.. పరమాన్నం తెచ్చిపెడతాననేవాడిని నమ్మేదెలా?!

హుద్‌హుద్‌ తుపాను బాధితులు కలిశారు. తమ పునరావాసం కోసం 50శాతం కేంద్ర నిధులతో శ్రీకాకుళం పట్టణంలో 192, రూరల్‌లో 288 ఇళ్లు కట్టి రెండేళ్లయినా ఏ ఒక్కరికీ ఇంకా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చనేతలు.. అసలైన లబ్ధిదారులను పక్కనపెట్టి, అనర్హులకు ఆ ఇళ్లను కేటాయిస్తామని ఆశచూపి ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారని చెప్పారు. సర్వం కోల్పోయిన తుపాను బాధితుల్ని సైతం దోచుకుంటున్న వీరిని ఏమనాలి? వీరికన్నా రాబందులే నయమేమో! సాయంత్రం ఉత్తరాంధ్ర వరప్రదాయని నాగావళి నదిని దాటి అరసవల్లి క్షేత్రం వెలసిన శ్రీకాకుళంలోకి అడుగుపెట్టాను. పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభ తర్వాత బసకు చేరుకున్నాను. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని 3000 పాఠశాల మైదానాల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన రూ.150 కోట్లు ఏమయ్యాయి? వాటితో మీరు అభివృద్ధి చేసిన ఒక్క స్కూల్‌ గ్రౌండ్‌నయినా చూపగలరా? మీ ప్రచారార్భాట కార్యక్రమాల కోసం రాష్ట్రంలోనే ప్రధానమైన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం మొదలుకుని.. శ్రీకాకుళం మైదానం దాకా.. ఎన్నింటినో ఆడుకునే అవకాశం లేకుండా పాడుచేసిన మాట వాస్తవం కాదా? ఈ నాలుగున్నరేళ్లలో మీరు కొత్తగా కట్టిన.. లేదా అభివృద్ధిచేసిన ఒక్కటంటే ఒక్క క్రీడామైదానం కూడా లేకపోగా.. 1200 ఎకరాల్లో స్పోర్ట్స్‌ సిటీ కడతాననడం.. ఎవర్నిమోసం చేయడానికి?
- వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top