309వ రోజు పాదయాత్ర డైరీ

309th day padayatra diary - Sakshi

ఇప్పటి వరకు నడిచిన దూరం 3,352.3 కిలోమీటర్లు
01–12–2018, శనివారం 
ఉంగరాడమెట్ట, శ్రీకాకుళం జిల్లా 

ప్రభుత్వ పెద్దలే ఇసుక మాఫియాను నడిపిస్తుంటే..వారి అనుచరులను అనుకుని ఏం లాభం?!
ఈ రోజు పాలకొండ, రాజాం నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఉదయం శిబిరం వద్ద ఆదిలక్ష్మి అనే చెల్లెమ్మ కలిసింది. నిరుపేద యాదవ కుటుంబం ఆమెది. ఆమె తండ్రి గతేడాది ఎద్దు పొడవడంతో చనిపోయాడు. ఐదుగురు ఆడబిడ్డలున్న ఆ కుటుంబం పరిస్థితి దుర్భరంగా మారింది. కాస్తోకూస్తో ఆదుకుంటుందనుకున్న చంద్రన్న బీమా ఇప్పటిదాకా రాలేదంది. చేతిలో బాండ్‌ ఉన్నా.. ప్రయోజనమేంటని ఆవేదన వ్యక్తం చేసింది. పేద కుటుంబాన్ని ఆదుకోని పథకాలెందుకు? పథకాలన్నీ కేవలం ప్రచారానికేనా! విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జీవనాధారమైన నాగావళి నదిని దాటి రాజాం నియోజకవర్గంలోకి అడుగుపెట్టాను. ఈ రాజాం ప్రాంతం.. పౌరుషానికి మారుపేరైన తాండ్ర పాపారాయుడు ఏలినగడ్డ.  

సంకిలి గ్రామం వద్ద సత్యవతి అనే అవ్వ నాతోపాటు అడుగులేసింది. కేవలం ఐదో తరగతి చదివిన ఆ 70 ఏళ్ల అవ్వ.. ఈ పాలనలోని సంక్షేమ పథకాల డొల్లతనాన్ని అనర్గళంగా వివరించడం ఆశ్చర్యం కలిగించింది. అదే గ్రామంలో కలిసిన అక్కచెల్లెమ్మలు.. ఆ ఊళ్లో మద్యం రేపిన చిచ్చుకు పార్వతమ్మ కుటుంబం ఛిద్రమైపోయిందని చెప్పారు. ఆమె భర్త, కుమారుడు మద్యం మహమ్మారికి బలైపోయారని తెలిపారు. అది భరించలేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుందన్నారు. ‘అన్నా.. ఇకపై ఏ కుటుంబం ఇలా బలికాకుండా మద్యం లేకుండా చేయండి’అంటూ విన్నవించారు. 

ఇసుక తవ్వకాల వల్ల నదీ ప్రవాహ దిశ మారిపోయి.. పంటపొలాలు కోతకు గురవుతున్నాయని రేగిడి గ్రామస్తులు చెప్పారు. ముంపు కూడా ఎక్కువైందన్నారు. నాగావళి నదిలో ఉండే ఇన్‌ఫిల్టర్‌ బావులే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల దాహార్తి తీరుస్తున్నాయి. ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేయడంతో వాటి మనుగడకే ప్రమాదమేర్పడిందన్నారు. ఆ గ్రామానికే చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి కుటుంబ సభ్యులే ఇసుక తవ్వకాలు చేస్తుంటే.. ఇక ఆపేవారెవరని ఆవేదన వ్యక్తం చేశారు. సులభంగా వచ్చే దోపిడీ సొమ్ముకు అలవాటుపడ్డ ఈ నాయకులకు.. ప్రజల గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచన ఎందుకుంటుంది? అయినా ప్రభుత్వ పెద్దలే ఇసుక మాఫియాను నడిపిస్తుంటే.. వారి అనుచరులను అనుకుని ఏం లాభం? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?  

కంచరాం నుంచి దోసరి గ్రామానికి మధ్య ఉన్న రోడ్డు పరిస్థితి అతి దారుణంగా ఉందని రాజాం మండల యువకులు చెప్పారు. ఏడు గ్రామాలకు ఆధారమైన ఆ రోడ్డు గురించి నాలుగేళ్లుగా మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు. ఇసుక కోసం రాత్రికి రాత్రే నదుల్లోకి రోడ్లేసుకుంటున్న నాయకులు.. రోడ్డులేక ఏళ్లకొద్దీ యాతనపడుతున్న ప్రజల గురించి కాస్తయినా పట్టించుకోకపోవడం శోచనీయం.  

మధ్యాహ్నం సంకిలి వద్ద ఉన్న చక్కెర ఫ్యాక్టరీ పక్క నుంచి పాదయాత్ర సాగింది. రైతులు ట్రాక్టర్లలో చెరకును తరలిస్తుండటం కనిపించింది. ఇలాంటి వెనుకబడిన జిల్లాలో వ్యవసాయాధారిత పరిశ్రమల అవసరం ఎంతైనా ఉందనిపించింది. అక్కడ కలిసిన చెరకు రైతులు.. ప్రభుత్వ మద్దతు ధర ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడంలేదన్నారు. గతంలో ఈ జిల్లాలో రెండు చక్కెర ఫ్యాక్టరీలుండేవని చెప్పారు. చంద్రబాబు పుణ్యమాని సహకార చక్కెర ఫ్యాక్టరీ మూతపడిందన్నారు. ఇప్పుడు ప్రయివేటు ఫ్యాక్టరీ మాత్రమే ఉండటంతో వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని వాపోయారు. మరోవైపు వెబ్‌ల్యాండ్‌లోని అవకతవకలు తమ తలరాతల్ని మార్చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  

రాత్రి శిబిరానికి ముందున్న ఉంగరాడమెట్ట.. అప్పడాలకు చాలా ప్రసిద్ధి. ఆ ఊళ్లోని దాదాపు 200 కుటుంబాల అక్కచెల్లెమ్మలకు అదే ఆధారమట. ఈ అప్పడాలు ఇతర రాష్ట్రాలకు సైతం సరఫరా అవుతాయట. ప్రభుత్వ ప్రోత్సాహం ఏమాత్రం లేదని ఆ అక్కచెల్లెమ్మలు చెప్పారు. కాస్త చేయూతనిస్తే.. ఆ కుటీర పరిశ్రమ బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు ప్రవేశపెట్టిన వెబ్‌ల్యాండ్‌ విధానం ప్రజలకేమాత్రం ఉపయోగపడకపోగా.. రైతన్నలకు మరింత అభద్రత కలిగిస్తుండటం వాస్తవం కాదా? ఈ విధానం మీ, మీ అనుయాయుల భూదోపిడీకి సాధనంగా మారిందంటున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? 
-వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top