303వ రోజు పాదయాత్ర డైరీ

303rd day padayatra diary - Sakshi

ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,290.9 కి.మీ 
21–11–2018,   బుధవారం 
శిఖబడి, విజయనగరం జిల్లా

నాలుగున్నరేళ్లలో ఒక్కవృద్ధాశ్రమమైనా కట్టారా బాబూ?
విశ్వమానవ ప్రేమ, దాతృత్వం, దయాగుణాలను పెంచే మహ్మద్‌ ప్రవక్త బోధనలు నిత్య అనుసరణీయాలు. ఆయన జన్మదినం సందర్భంగా.. మైనార్టీ సోదరుల కుటుంబాల్లో సుఖసంతోషాల వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు పాదయాత్ర మొదలుపెట్టాను.  

మిలాద్‌ ఉన్‌ నబీ రోజున శిబిరం నుంచి బయటకు రాగానే చినమేరంగికి చెందిన షేక్‌ రేష్మా, దిల్‌షాద్, నూరి, నూర్జహాన్‌లు కలిశారు. ఆ పేద ముస్లిం కుటుంబం.. బాబుగారి షాదీముబారక్‌ పథకాన్ని నమ్ముకుని ఆ ఇంటి ఆడపడుచుకు జనవరిలో పెళ్లిచేసింది. ఆయనగారు చెప్పినట్టు రూ.75 వేలు వస్తాయనుకున్నారు. పెళ్లయిన నెలలోపే అన్ని ధ్రువీకరణ పత్రాలిచ్చి, దరఖాస్తు చేసుకున్నప్పటికీ షాదీముబారక్‌ పథకం చేయూత అందలేదు. అప్పుచేసి తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టుకోలేక అల్లాడిపోతున్నామని బాధపడ్డారు. బాబుగారి హామీలు కేవలం ప్రకటనలకే పరిమితమని వాపోయారు.  

నాలుగున్నరేళ్ల పాటు మైనార్టీలను దారుణంగా విస్మరించి.. తీరా ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడేప్పటికి మూడు నెలల మంత్రి పదవి ఇచ్చి.. మైనార్టీలను మరోమారు మభ్యపెట్టాలనుకుంటున్న బాబుగారి నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం?!  

అల్లువాడ వద్ద సింహాద్రి, నారాయణమ్మ అనే వృద్ధ దంపతులు కలిశారు. స్వాతంత్ర సమరయోధుడైన ఆ తాతకు 110 ఏళ్లట. కంటిచూపు సరిగా లేదు.. వినికిడి అంతంత మాత్రమే.. నడవడమూ కష్టమే. ‘తాతా.. బావున్నావా..’అని పలకరించగానే కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ‘కన్నబిడ్డల్లేరు.. అయినవారెవరూ లేరు.. పలకరించేవారూ కరువే. ఎంతకాలమయ్యా ఈ ఒంటరి బతుకులు’.. అంటూ నిర్వేదంగా మాట్లాడాడు. గుండె బరువెక్కింది. అంతబాధలోనూ ‘బాబూ.. మీ నాన్నలా మంచిపేరు తెచ్చుకోవాలి’అంటూ దీవించాడు. ఎవరూ లేని ఇలాంటి అవ్వాతాతల ఆలనాపాలనా చూసుకునేందుకు వృద్ధాశ్రమాలుంటే ఎంత బావుండేది అనిపించింది.  

గుమ్మలక్ష్మీపురానికి చెందిన గిరిజనులు వాళ్ల సంప్రదాయ పంటలు, అటవీ ఉత్పత్తులతో ఏర్పాటుచేసిన స్టాల్‌ను చూపించారు. దాదాపు 36 రకాల అటవీ ఉత్పత్తులు పండుతాయట. గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేస్తోంది మాత్రం పసుపు, చింతపండే.. అది కూడా అరకొరగానే. మార్కెటింగ్‌ సదుపాయాల్లేక, గిరిశిఖర గ్రామాల నుంచి రవాణా సౌకర్యాల్లేక, కోల్డ్‌ స్టోరేజీల్లేక.. విధిలేని పరిస్థితుల్లో దళారీలకు బలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంప్రదాయ పంటలు ఆరోగ్యానికి చాలా మంచివని.. బయట మార్కెట్‌లో అత్యధిక ధరలకు అమ్ముతున్నారు. అవి పండించిన గిరిజన రైతన్న మాత్రం దోపిడీకి గురవుతున్నాడు. గోదావరి జిల్లాలకు చెందిన శెట్టిబలిజ నేతలు వచ్చి పార్టీలో చేరారు. ఇన్నాళ్లూ బలహీనవర్గాలను ఓటు బ్యాంకులుగానే చూస్తున్న బాబుగారిపై భ్రమలు పోయాయని చెప్పారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ మేనిఫెస్టోలోని ఏడో పేజీలో ముఖ్యాంశాలంటూ.. ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమం కట్టిస్తానని గొప్పగా హామీ ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వృద్ధాశ్రమమైనా కట్టించారా? గిరిజనుల వద్ద కిలో చింతపండు కేవలం రూ.20కే కొంటున్నారు.. మీ హెరిటేజ్‌లో మాత్రం కిలో రూ.326కు అమ్ముతున్నారు.. మరి దీనికేం సమాధానం చెబుతారు?  
-వైఎస్‌ జగన్‌   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top