రూ.3లక్షలకే ఉద్యోగం.. | 3 lakhs per Grade-3 Eo Post endowment Department | Sakshi
Sakshi News home page

అంగట్లో ఉద్యోగం

Nov 18 2017 10:26 AM | Updated on Jul 29 2019 6:06 PM

3 lakhs per Grade-3 Eo Post endowment Department - Sakshi - Sakshi

సాక్షి, అమరావతి : పవిత్రమైన భగవంతుడి సన్నిధిలో గడిపే పోస్టులకూ ప్రభుత్వ పెద్దల అండతో బేరసారాలు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖలో నిరుద్యోగులకు అవకాశం కల్పించటం ద్వారా భర్తీ చేయాల్సిన గ్రేడ్‌– 3 ఆలయ కార్యనిర్వాహక అధికారి(ఈవో) పోస్టులను సర్కారు వద్ద పలుకుబడి కలిగిన బ్రోకర్లు రూ. 3 లక్షల చొప్పున అమ్మకానికి పెట్టారు. ముందుగా లక్ష చొప్పున వసూలు చేసిన బ్రోకర్లు తాత్కాలిక సిబ్బందికి పదోన్నతులు కల్పించటం ద్వారా భర్తీ చేసేందుకు మెమో కూడా జారీ చేయించటం గమనార్హం.

రంగంలోకి బ్రోకర్లు
దేవాదాయ శాఖలో గ్రేడ్‌–3 ఈవో పోస్టులు 167 ఖాళీగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం వీటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా ఆలయాల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతులు కల్పించడం ద్వారా వీటిని భర్తీ చేసేందుకు బ్రోకర్లు రంగంలోకి దిగారు. నిరుద్యోగులతో భర్తీ చేయాల్సిన ఈ పోస్టులను పదోన్నతుల ద్వారా నియమించేందుకు  ప్రయత్నిస్తున్నట్లు ‘సాక్షి’ రెండేళ్ల కిత్రమే పలు కథనాలు ప్రచురించడంతో ఈ వ్యవహారం తాత్కాలికంగా ఆగింది. అయితే కొద్ది విరామం తరువాతబ్రోకర్లు మరోసారి దందాకు దిగారు.

గుట్టుగా రూ.కోటిన్నర గుంజారు
ఆలయాల్లో సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు ఉండదు. ఆలయ ఆదాయం నుంచే వీరికి జీతభత్యాల చెల్లింపులు జరుగుతాయి. గ్రేడ్‌–3 ఈవో పోస్టును మాత్రం పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణిస్తారు. వీరికి ప్రభుత్వ ట్రెజరీల నుంచి జీతాలు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పదోన్నతి ద్వారా గ్రేడ్‌ –3 ఈవో పోస్టు దక్కించుకుంటే పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణిస్తారనే ఉద్దేశంతో లక్షలు చెల్లించేందుకు సిద్ధపడటాన్ని బ్రోకర్లు అవకాశంగా మలుచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 167 మందిని గుర్తించి ఒక్కొక్కరి నుంచి ముందుగా రూ.లక్ష చొప్పున వసూలు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా రూ. కోటిన్నరకు పైగా గుంజారు.

మంత్రి కార్యాలయానికీ వాటాలు..!
బ్రోకర్లు నజరానాగా వాటాలు పంచడంతో పదోన్నతుల ద్వారా భర్తీకి అనుమతిస్తూ ఉన్నతాధికారులు మోమో కూడా జారీ చేసినట్టు సమాచారం. మోమో జారీలో ఓ మంత్రి కార్యాలయం ప్రమేయం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే మోమో జారీ అయిన తర్వాత కూడా పోస్టులు దక్కకపోవడంతో డబ్బులు సమర్పించుకున్నవారు ప్రస్తుతం సచివాలయంలోని దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్‌మోహన్‌సింగ్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement