294వ రోజు పాదయాత్ర డైరీ

294th day padayatra diary - Sakshi

ఇప్పటి వరకూ నడిచిన దూరం : 3,211.5 కి.మీ
25–10–2018, గురువారం 
పాయకపాడు, విజయనగరం జిల్లా 

దాడి ఘటన నా సంకల్పాన్ని మరింత బలోపేతం చేసింది 
ఎత్తయిన కొండలపై ఉన్న గిరిజన గ్రామాలు.. పగులుచెన్నేరు, పట్టుచెన్నేరు. ఎలాంటి రోడ్డు సౌకర్యమూ లేని ఆ మారుమూల గ్రామాల నుంచి వచ్చిన చోడుపల్లి బీసు, కోనేటి బేత్ర, తాడంగి ముసిరి తదితర గిరిజన సోదరులు పాదయాత్రలో నన్ను కలిశారు. నాన్నగారి హయాంలో ఆ ఊళ్లకు జరిగిన మేళ్లను గుర్తుచేసుకున్నారు. అసలా గ్రామాలకు మొట్టమొదటిసారి కరెంటు అనేది వచ్చింది.. శుద్ధి చేసిన తాగునీటిని అందించింది.. సంక్షేమ పథకాలంటే ఏంటో చూపించిందీ నాన్నగారే. ‘మాకు వరి అన్నం అంటే ఏంటో తెలిసింది మీ నాన్నగారి హయాంలోనే. ఆయనకన్నా ముందు మా పగులుచెన్నేరు గ్రామానికి నాలుగంటే నాలుగు పింఛన్లే వచ్చేవి. మీ నాన్నగారి హయాంలో ఏకంగా 150 పింఛన్లు మంజూరయ్యాయి. మళ్లీ బాబుగారొచ్చాక వాటిని 60కి తగ్గించారు. వాటిలో కూడా బయోమెట్రిక్‌ అని వేలిముద్రలు పడలేదని సగానికి సగం కోతపడేలా చేస్తున్నారు’అంటూ ఆ గిరిజన సోదరులు వాపోయారు. అత్యంత వెనుకబడ్డ గిరిజనులపై సైతం నిర్దయగా వ్యవహరిస్తుండటాన్ని చూసి చాలా బాధేసింది. సంక్షేమమంటే ఏంటో చూపించిన నాన్నగారిని ఆ గిరిజన గ్రామాలు మరువలేకున్నాయి.. ఆ మంచి రోజులు మళ్లీ రావాలని ఆశగా ఎదురుచూస్తున్నాయి.  

మక్కువ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు కలిశారు. ఆ ఊళ్లోనే బీసీ హాస్టల్‌ను ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా మూసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి పాఠశాల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని వాపోయారు. శిథిలమైపోయి పెచ్చులూడుతున్న తరగతి గదులు.. దీంతో ఆరుబయటే పాఠాలు. వర్షం వస్తే బడికి సెలవే. మధ్యాహ్న భోజనంలో కుళ్లిపోయిన కోడిగుడ్లు.. నిలిచిపోయిన స్కాలర్‌షిప్‌లు.. ఇంతవరకూ అందని పాఠ్యపుస్తకాలు.. చాలీచాలని కొలతలతో, నాసిరకం గుడ్డతో కుట్టిన యూనిఫాం.. ఇదీ ఆ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దుస్థితి. బినామీ కార్పొరేట్‌ పాఠశాలలకు కొమ్ముకాస్తున్న ఈ పాలకులకు ప్రభుత్వ పాఠశాలలపై శ్రద్ధేముంటుంది?  

ఈ రోజు వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో అనూహ్యంగా నాపై దాడి జరిగింది. దేవుడి దయ, రాష్ట్ర ప్రజల ప్రేమాభిమానాలు ఎప్పుడూ నన్ను కాపాడతాయన్న నా నమ్మకం వమ్ముకాలేదు. గాయంతోనే బయటపడ్డాను. ఇలాంటి పిరికిచర్యలతో నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ప్రజలకోసం ఎంతైనా కష్టపడాలన్న నా సంకల్పాన్ని ఈ సంఘటన మరింత బలోపేతం చేసింది. 

చివరిగా ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. గిరిజనుల సంక్షేమం కోసం మీ మేనిఫెస్టోలో 20 హామీలిచ్చారు. ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారా? బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, హాస్టల్‌ సదుపాయాలు, కొత్త రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏమైంది? వారికి వస్తున్న స్కాలర్‌షిప్‌లను ఆపేయడం.. ఉన్న హాస్టళ్లను మూసేయడం వాస్తవం కాదా? కొత్త రెసిడెన్షియల్‌ విద్యాసంస్థను ఒక్కటైనా ఏర్పాటు చేశారా?
-వైఎస్‌ జగన్‌   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top