267వ రోజు పాదయాత్ర డైరీ | 267th day padayatra diary | Sakshi
Sakshi News home page

267వ రోజు పాదయాత్ర డైరీ

Sep 23 2018 4:55 AM | Updated on Sep 23 2018 8:18 AM

267th day padayatra diary - Sakshi

22–09–2018, శనివారం 
గండిగుండం క్రాస్, విశాఖపట్నం జిల్లా

అక్కచెల్లెమ్మలు మీకెందుకు కృతజ్ఞతలు చెప్పాలి బాబూ? 
విశాఖ జిల్లాలో యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ జిల్లాలో భూసమస్య గురించి వినని రోజు ఒక్కటంటే ఒక్కటీ లేదు. ఈ రోజు కూడా భూబాగోతాలపై వినతులు వెల్లువెత్తాయి. మా భూముల్ని, చెరువును ఆఖరుకు శ్మశానాన్ని కూడా.. తప్పుడు రికార్డులు సృష్టించి మంత్రిగారి బినామీలు కాజేశారని చందక గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిలదీసినందుకు అక్రమ కేసులతో వేధిస్తున్నారని చెప్పారు.  

 భీమన్నదొరపాలెంలో ఏళ్ల తరబడి దళితులు సాగు చేసుకుంటున్న డీ పట్టా భూముల్ని అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌సత్యనారాయణ, ఆయన కుటుంబీకులు కబ్జా చేశారట. సిట్‌కు ఫిర్యాదు చేసినా, కేసు నమోదైనా.. చర్యలు మాత్రం శూన్యమట. ఆ రైతుల్ని వారి భూముల్లోకి కూడా పోనివ్వడం లేదట. భూముల్ని చెరపట్టడంలో అభినవ దుశ్శాసనులైపోయారు అధికార పార్టీ నేతలు.  

ఈ రోజు పాదయాత్ర జరిగిన ప్రాంతంలో ఎటువంటి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ లేవు. ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పింఛన్, రేషన్‌.. ఆఖరుకు ఉపాధి పనుల కోసం వేలిముద్రలు వేయడానికి దూర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి. వృద్ధులకు, మహిళలకు ఎంత కష్టం! అత్యవసరమైనప్పుడు పోలీసులకో.. అగ్నిమాపక దళానికో.. అంబులెన్స్‌కో ఫోన్‌ చేయలేని దుస్థితి. అయిదు కిలోమీటర్ల దూరం వెళ్లి 108కి ఫోన్‌ చేయాల్సి రావడం.. అష్టకష్టాలూపడి చివరికి ఫోన్‌ చేసినా.. అది సమయానికి రాకపోవడంతో అక్కిరెడ్డి తాత అనే పెద్దాయన గుండెపోటుతో మరణించాడు. పురిటి నొప్పులతో తీవ్ర ఇబ్బందులుపడ్డ హేమశ్రీ రోడ్డుమీదే ప్రసవించిందట. సత్వర వైద్యం అందక మరో సోదరుడు పక్షవాతం బారినపడి కన్నుమూశాడట.. చాలా బాధనిపించింది. విశాఖ మహానగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఈ గ్రామాలకు కనీసం సమాచార వ్యవస్థ లేకపోవడం విస్మయం కలిగించింది. భారతదేశ సమాచార సాంకేతిక విప్లవానికి మూలపురుషుడు తానేనని.. ఈ దేశానికి సెల్‌ఫోన్‌లను పరిచయం చేసిన ఘనత తనదేనని.. ప్రగల్బాలు పలికే నేతలకు ఈ దుస్థితి కనిపించదా? కనువిప్పు కలగదా?  

అతిథిని ఇంటికి భోజనానికి పిలిచి.. 
భోజనం పెట్టకుండానే.. పెట్టినట్టు సంతకం పెట్టమంటే ఎలా ఉంటుంది? అక్కచెల్లెమ్మలను పండుగలకు, పబ్బాలకు ఇంటికి రమ్మని చీరా సారే పెట్టకుండానే.. పెట్టినట్టు సంతకం పెట్టించుకుంటే ఎలా ఉంటుంది? అలాగే ఉంది పొదుపు సంఘాల మహిళల విషయంలో బాబుగారి వైఖరి. ఒక్క హామీ కూడా నెరవేర్చకున్నా.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ డ్వాక్రా అక్కచెల్లెమ్మలతో బలవంతపు సంతకాలు చేయించుకోవాలనుకోవడం దగుల్బాజీతనమే. సాయంత్రం రామవరం గ్రామంలో సరోజిని గ్రూపు, సాయిరాం గ్రూపు, మేరీమాత గ్రూపులకు చెందిన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు కలిశారు. బాబుగారి రుణమాఫీ మోసాన్ని మొరపెట్టుకున్నారు. ఆయనగారి పుణ్యమాని.. ఆ ఊళ్లోని 18 గ్రూపుల వారు బ్యాంకుల ఎదుట దోషులుగా నిలబడ్డారట. మరి ముఖ్యమంత్రిగారికి కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి? ఏమని చెప్పాలి? 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. గత ఎన్నికలకు ముందు.. డ్వాక్రా రుణాలేవీ కట్టొద్దని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే వాటిని మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా ముఖ్యాంశాలంటూ పొందుపర్చారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రుణమాఫీ చేయలేదని, చేసే ఉద్దేశమే లేదని.. ఈ మధ్యనే అసెంబ్లీ సాక్షిగా మీ మంత్రిగారే రాతపూర్వకంగా సెలవిచ్చారు. ఇంతకన్నా దారుణ మోసం ఉంటుందా? అబద్ధాలు చెప్పి ఆడబిడ్డల్ని వంచించడం ధర్మమేనా? మీ మేనిఫెస్టోకి ఉన్న విలువ ఇదేనా? మీ చేత దారుణంగా మోసపోయిన అక్కచెల్లెమ్మలతోనే బలవంతంగా కృతజ్ఞతలు చెప్పించుకోవాలనుకుంటున్నారే.. మనసులో ఏ మూలైనా.. కాస్తంతైనా సిగ్గుగా అనిపించదా? 
-వైఎస్‌ జగన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement