260వ రోజు పాదయాత్ర డైరీ

260th day padayatra diary - Sakshi

11–09–2018, మంగళవారం
బీచ్‌ రోడ్‌లోని కామత్‌ హోటల్‌ సమీపం,విశాఖ జిల్లా 

ఎన్నికల యుద్ధానికి నా సహచరులను కార్యోన్ముఖులను చేశాను 
ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలోని చిన వాల్తేరు, పెద వాల్తేరు, బీచ్‌ రోడ్‌లలో పాదయాత్ర సాగింది. ఆసియాలోనే అత్యంత వేగవంతంగా పెరుగుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. వనరులకు కొదువ లేదు. రాష్ట్ర ఆర్థిక రాజధానికి ఉండాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి. అటువంటి విశాఖలో ఈ నాలుగున్నరేళ్లలో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి మైలురాయీ కనిపించదే. ఒక్క పెద్ద కంపెనీ కూడా వచ్చింది లేదే. ఉన్న కంపెనీలూ మూతపడుతున్నాయే. తను పని చేస్తున్న న్యూ నెట్‌ కంపెనీ మూతపడటంతో ఉపాధి వెతుక్కుంటూ పొరుగు రాష్ట్రానికి వలస పోయారట సత్యనారాయణ అనే యువ ఇంజనీరు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న వాటిలో ఒక్క శాతం కంపెనీలు వచ్చినా మా లాంటి వారికి ఈ ఖర్మ పట్టేదా అన్నది ఆ సోదరుని ఆవేదన. అయినా ఈ ప్రభుత్వానికి బీచ్‌ ఫెస్టివల్స్, లవ్‌ ఫెస్టివల్స్‌ మీద ఉన్న ప్రేమ విశాఖ అభివృద్ధిపై ఉంటే కదా! 

కూలి చేసుకొని కడుపు నింపుకునే సరోజిని అనే సోదరికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. వైద్యానికి నెలకు రూ.వేలల్లో ఖర్చవుతోంది. పింఛన్‌ అయినా వస్తే కాస్తయినా ఆసరాగా ఉంటుందనేది ఆమె ఆశ. కాళ్లరిగేలా తిరుగుతున్నా ఆమెకు నిరాశే మిగులుతోంది. ఒక్కరికో, ఇద్దరికో పింఛన్లు ఇచ్చి కిడ్నీ బాధితులందరికీ ఇస్తున్నామంటూ గొప్పగా ప్రకటించుకుంటున్న పెద్దలకు ఇలాంటి వారిని చూశాక.. కాస్తయినా అపరాధ భావన కలగదా? 

ఈరోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఎన్నికల సమరానికి దిశానిర్దేశం చేసే ఈ సమావేశం అత్యంత కీలకమైనది. నవరత్నాలను ఇంటింటికీ విస్తృతంగా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకతను వివరించాను. చంద్రబాబు ధనబలాన్ని ఎదుర్కొనే ఆయుధం అదే అని చెప్పాను. ఒక్కో నియోజకవర్గంలో వేల సంఖ్యలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను తొలగించారు. వేలాదిగా దొంగ ఓట్లను చేర్పించారు. ఆ విషయాలను ఆధారాలతో సహా నా సహచరులు వివరించారు. ప్రజల విశ్వాసాలను కోల్పోబట్టే చంద్రబాబు ఇటువంటి అక్రమాలకు ఒడిగడుతున్నాడు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసైనా.. అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు. అప్రమత్తంగా ఉండాలని నా సహచరులకు సూచించాను. ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజాభిమానమే గెలుస్తుందని వెన్ను తట్టాను. ఎన్నికల యుద్ధానికి కార్యోన్ముఖులను చేశాను.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేశాను. తొంభై శాతం మంది ప్రజలు సంతృప్తిగా, సంతోషంగా ఉన్నా రని పదేపదే ప్రకటిస్తున్నారు కదా. అదే నిజమైతే ఒక్కో నియోజకవర్గం లో వేల సంఖ్యలో మా పార్టీ వారి ఓట్లను తొలగించడం, వేలాది దొంగ ఓట్లను చేర్పిం చడం లాంటి నీతిమాలిన పనులకు పాల్పడాల్సిన అవసరమేముంది? 
-వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top