మిఠాయి వికటించి 35 మంది విద్యార్థులకు అస్వస్థత | 22 Students fall ill after eating sweets in Karimnagar District | Sakshi
Sakshi News home page

మిఠాయి వికటించి 35 మంది విద్యార్థులకు అస్వస్థత

Nov 1 2013 9:55 PM | Updated on Nov 9 2018 4:12 PM

కరీంనగర్ జిల్లా మల్యాల మండలం నూకపల్లి ఆదర్శ పాఠశాలల్లో మిఠాయి వికటించి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

జగిత్యాల/మల్యాల: కరీంనగర్ జిల్లా మల్యాల మండలం నూకపల్లి ఆదర్శ పాఠశాలల్లో మిఠాయి వికటించి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదర్శ పాఠశాల విద్యార్థులకు కొంతకాలంగా పక్కనే ఉన్న జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్నభోజనం వండిపెడుతున్నారు. శుక్రవారం నుంచే ఆదర్శ పాఠశాలలోనే కొత్తగా నిర్వాహకులను ఏర్పాటు చేసి అక్కడే వంట చేయడం ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వోలపు గంగాధర్ మిఠాయిలు తీసుకొచ్చి విద్యార్థులకు పంచిపెట్టారు. తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. మరికొందరికి కళ్లుతిప్పడం, తలనొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్ సరితారెడ్డి అందుబాటులో ఉన్న వాహనాలు, 108లో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. 24 మంది విద్యార్థుల వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మిగతా 11 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఇళ్లకు పంపించారు.

ఆస్పత్రిలో ఉన్న విద్యార్థులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని సూపరింటెండెంట్ తెలిపారు. విద్యార్థుల అస్వస్థత విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో పాఠశాలకు చేరుకున్నారు. ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య, డీఈవో కె.లింగయ్య ఆసుపత్రికి వచ్చి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తహశీల్దార్ శంకర్, ఎంఈవో వెంకట్రావు నూకపల్లికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మిఠాయిలు స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement