మూడుపూలూ, ఆరు కాయలే..


రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలకు 22 ఎకరాలు

 కాతేరు వద్ద కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

 పీజీ కోర్సుల ప్రారంభానికి, పరిశోధనలకు అవకాశం

 

 సాక్షి ప్రతినిధి, కాకినాడ / రాజానగరం :ఇప్పటివరకూ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల దశ తిరిగి  సొంత భవనాలు సమకూరనున్నాయి. డిగ్రీ, డిప్లొమా కోర్సుల నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులను నిర్వహించే స్థాయికి చేరే అవకాశం ఉంది. అంతే కాదు.. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా ఉన్న జిల్లాలో పరిశోధనలకు ఊతం లభించే అవకాశాలూ పుష్కలం కానున్నాయి. కళాశాలకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలో గామన్ బ్రిడ్జి (గోదావరిపై నాలుగో వంతెన) పైకి వెళ్లే బైపాస్ రోడ్డుకు సమీపంలోని కాతేరు వద్ద 22 ఎకరాల భూమి కేటాయింపు ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది.

 

 హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో వ్యవసాయ కళాశాలను రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దీర్ఘకాలంగా ఉంది. వ్యవసాయానికి పెద్దపీట వేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో 2008 నవంబరులో ఆ ప్రతిపాదన సాకారమైంది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలకు చెందిన భవనాల్లోనే వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేశారు. తర్వాత కొద్ది నెలల్లోనే సమీపంలోనే ఉన్న ఎస్‌కేవీటీ కాలేజీ భవనాల్లోకి వ్యవసాయ కళాశాలను మార్చారు. ప్రస్తుతం అక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు.

 

 అయితే ఇంచుమించు ఈ కళాశాలను ఏర్పాటు చేసిన సమయంలోనే ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కూడా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో ప్రారంభమైంది. వైఎస్  చొరవతో విశ్వవిద్యాలయానికి సొంత భవనాలు నిర్మించుకునేలా భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. వెలుగుబందలో 96 ఎకరాల కేటాయింపు,  విశ్వవిద్యాలయం తరలింపు చకచకా జరిగిపోయాయి. దీంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్న వ్యవసాయ కళాశాలకు కూడా సొంత భవనాలు సమకూర్చాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. కేంద్రీయ పొగాకు పరిశోధన సంస్థకు కాతేరు  వద్ద ఉన్న 22 ఎకరాలను కళాశాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

 

 క్షేత్ర పరిశీలనా సులభతరం..

 రాష్ట్ర విభజన తర్వాత ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరుకు మారిన నేపథ్యంలో వ్యవసాయ కోర్సులకు డిమాండు ఏర్పడింది. కానీ రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చరల్, డిప్లొమా కోర్సులను మాత్రమే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 210 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా 20 మంది అధ్యాపకులు, ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. రాష్ట్రంలో రాజమహేంద్రవరంతోపాటు తిరుపతి, బాపట్ల, శ్రీకాకుళం జిల్లాలోని నైరా, నంద్యాల సమీప మహానందిలో వ్యవసాయ కళాశాలలున్నాయి. వీటన్నింటిలో కలిపి సీట్లు 650కి మించి లేవు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం కళాశాలకు భూకేటాయింపు తో విస్తరణకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎమ్మెస్సీ అగ్రికల్చరల్ కోర్సుతో పాటు పీజీ డిప్లొమా కోర్సులను ప్రారంభించే అవకాశం ఉంది.  పరిశోధనావకాశాలు కూడా పెరుగుతాయి. వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో వారి క్షేత్ర పరిశీలన కూడా సులువవుతుంది.

 

 విద్యార్థులకు సౌలభ్యం

 ప్రస్తుతం కళాశాలకు అనుబంధంగా  వసతిగృహాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కాతేరులో కళాశాలకు సొంత భవనాలతో పాటు హాస్టళ్లు నిర్మిస్తారు. దీనివల్ల రోజువారీ వ్యయప్రయాసలు తప్పుతాయి.

 

 పొరుగు రాష్ట్రాలకు వెళ్లనక్కర్లేదు..

 ఎంసెట్ ర్యాంకు ఆధారంగానే వ్యవసాయ కళాశాలల్లో సీట్లు కేటాయిస్తుంటారు. డిమాండుకు తగినన్ని సీట్లు లేకపోవడంతో చాలామంది విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ కళాశాలల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం కళాశాలకు భూమి కేటాయించిన ప్రభుత్వం సత్వరమే భవనాల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించాలి. ఇది పూర్తయితే డిగ్రీలో సీట్లు పెంచడానికి, పీజీ కోర్సుల ప్రారంభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఇబ్బంది తప్పుతుంది.

 

 -  సీతారామయ్య, ప్రిన్సిపాల్, రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top