కోదాడ మండలం నల్లబండగూడెం సర్పంచ్‌గా రెండుసార్లు గెలిచిన (ప్రస్తుత) ప్రజాప్రతినిధి అదే గ్రామంలో చిన్న తరహా పరిశ్రమ పెట్టుకునేందుకు 2011లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్లు, సంచులను నిషేధిస్తున్నందున వాటి స్థానంలో ప్లాస్టిక్ రహిత కవర్లు, సంచులు, ప్లేట్స్ తయారీ చేసే పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
కోదాడటౌన్, న్యూస్‌లైన్: కోదాడ మండలం నల్లబండగూడెం సర్పంచ్‌గా రెండుసార్లు గెలిచిన (ప్రస్తుత) ప్రజాప్రతినిధి అదే గ్రామంలో చిన్న తరహా పరిశ్రమ పెట్టుకునేందుకు 2011లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్లు, సంచులను నిషేధిస్తున్నందున వాటి స్థానంలో ప్లాస్టిక్ రహిత కవర్లు, సంచులు, ప్లేట్స్ తయారీ చేసే పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం భారీగా సబ్సిడీని ఇస్తుండడంతో ఆమె ఈ పరిశ్రమను ఎంచుకున్నారు. పరిశ్రమల శాఖ కూడా అనుమతి ఇచ్చింది. పరిశ్రమ ఏర్పాటుకు అయ్యే ఖర్చు రూ.95.80 లక్షల మొత్తాన్ని కోదాడ ఆంధ్రాబ్యాంక్ రుణంగా ఇవ్వడానికి ఒప్పుకుంది.
దీనిలో సబ్సిడీ 40 శాతం అంటే దాదాపు రూ.44.74 లక్షలు. సదరు ప్రజాప్రతినిధి తానే యజమానిగా ఉంటూ నల్లబండగూడెం లోని రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద సర్వేనెంబర్ 352/ఏఏలో మల్లిక నాన్ ఓవెన్ బ్యాగ్స్, పేపర్స్, ప్లేట్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. కోదాడ ఆంధ్రాబ్యాంక్ శాంక్షన్ లెటర్ నంబర్: 0329/52/ఎస్-213 తేదీ 01-11-2011న రూ.75.80 లక్షలు, మరోవిడత శాంక్షన్ లెటర్ నంబర్: 0329/52/ఎస్-31 తేదీ 26- 06-2013న రూ.22 లక్షలను రుణంగా మంజూరు చేశారు. దీనిలో ప్రభుత్వ సబ్సిడీ రూ.44.74 లక్షలు పోను రూ.51.06 లక్షలను టర్మ్‌లోన్ కింద బ్యాం కుకు చెల్లించాల్సి ఉంది. నేటికీ ఒక్క కిస్తీ కూడా చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు పలుమార్లు నోటీసులు పంపారు. అయినా స్పందన లేకపోవడంతో సదరు ప్రజాప్రతినిధిని ఎన్‌పీఏ (నాన్ పేమెంట్ అకౌంట్)గా మార్చారు.
బ్యాంక్ మేనేజర్ లేఖతో వెలుగులోకి..
కోదాడ ఆంధ్రాబ్యాంక్ మేనేజర్‌గా కొత్తగా వచ్చిన లక్ష్మారెడ్డి ఈ పరిశ్రమ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. లెటర్ నెంబర్-0329/ 18/ఎంఎస్‌ఎంఈ తేదీ 23-08-13న జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వంతోపాటు బ్యాం క్‌ను మోసగించిన నల్లబండగూడెం సర్పంచ్‌ను ఎన్‌పీఏగా మార్చామని, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పదవిలో కొనసాగడానికిఆమె అర్హురాలు కాదని, విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.
విచారణ ఏమైందో..
బ్యాంక్ మేనేజర్ లేఖతో స్పందించిన కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని విచారణకు ఆదేశించారు. ఆయన లేఖ నెంబర్ 801/2013-ఈ(పీటీఎస్)ను తేదీ 27-08-13న కోదాడ ఎంపీడీఓకు పంపారు. దీనిని అత్యంత అత్యవసరమైనదిగా భావించి వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని కోరారు. కానీ, ఏమి జరిగిందో ఏమోగాని దీనిపై నేటికీ కనీస చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో గ్రామస్తులు సమాచార హక్కు చట్టం ద్వారా మొత్తం వ్యవహారాన్ని సాక్ష్యాధారాలతో సేకరించారు. పక్షం రోజుల క్రితం లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
యంత్రాలు మాయం.....?
ప్రభుత్వ సబ్సిడీతో ఏర్పాటైన సదరు పరిశ్రమ ఆరేళ్లపాటు పరిశ్రమల శాఖ ఆధీనంలో ఉం టుంది. ఈ సమయంలో ఎలాంటి యంత్రాలు అమ్మకాలు, కొనుగోలు చేయకూడదు. కానీ, పరిశ్రమలోని యంత్రాలు మాయమయ్యాయి. ప్రభుత్వ సబ్సిడీని కాజేసేందుకే పరిశ్రమను ఏర్పాటు చేసి, యంత్రాలను అమ్మున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో పరిశ్రమలశాఖలోని కొందరు అధికారులు లక్షల రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై జిల్లా పరిశ్రమల శాఖ అధికారులను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.