‘పచ్చ’నేతల కబ్జాకాండ..!

20 acres in Turangi Panchayat Range in Kakinada, Kovvur Road are Accused of Having Occupie of Vanamadi Venkateshwara Rao (Kondababu) - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఓటేయడమంటే యాంత్రికంగా మీట నొక్కడం కాదు. ప్రతి ఓటు చుట్టూ ఆ ఓటరు ఆశలు, కలలు అల్లుకుని ఉంటాయి. తాను ఓటు వేసిన పార్టీ లేదా అభ్యర్థిపై గురి, నమ్మకం ఉంటాయి.  అధికారంలోకి వచ్చిన వారు ఆ ఆశల్ని నెరవేర్చాలి. ఆ కలల్ని ఫలింపజేయాలి. ఆ గురి, నమ్మకాల్ని నిలబెట్టుకోవాలి. అప్పుడే మరోసారి ఓటడిగే నైతిక హక్కు ఉంటుంది. గత ఎన్నికల్లో వందలాది హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతల్లో అలాంటి నీతి ‘నేతి బీరకాయ’లో నెయ్యి లాంటిదే.

అయిదేళ్ల పచ్చదండు పాలన  దోచుకోవడం, దాచుకోవడం, కబ్జా చేయడమే లక్ష్యంగా సాగింది. అధికారం దన్నుతో జిల్లాలో తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేసేశారు. అవి పర్ర భూములా, తీర ప్రాంత భూములా, చెరువులా, గుట్టలా, దేవదాయ భూములా, మఠం భూములా, అసైన్డ్‌ భూములా, రోడ్లా, ప్రైవేటు భూములా అని చూడకుండా కబ్జా చేసేశారు. భూములు దొరికితే చాలు చదును చేసేశారు.   ఆన్‌లైన్‌లో రికార్డులు మార్చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించేశారు.

 అడ్డొచ్చినోళ్లపై దౌర్జన్యం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు కబ్జాలకు అండగా నిలిచారు.  జిల్లా వ్యాప్తంగా రూ. 500 కోట్ల విలువైన సుమారు 300 ఎకరాల వరకు ఆక్రమించారు. ఆక్రమణలపై కేసులు కూడా నమోదయ్యాయంటే జిల్లాలో టీడీపీ నేతల కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అలా దోచిన వందల కోట్ల డబ్బుతో మళ్లీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు.  జిల్లాలో పచ్చదండు ఆక్రమణలపై ‘సాక్షి’ ఫోకస్‌.. 

కబ్జాలకు ‘కొండం’త అండ 
కాకినాడలోని తూరంగి పంచాయతీ పరిధిలో సుమారు 20 ఎకరాలు, కొవ్వూరు రోడ్లో 1.5 ఎకరాలను సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును కూడా తన స్థలమే అంటూ ధ్వంసం చేశారు. ఆయన అనుచరులు అదే తీరులో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కాకినాడ మెయిన్‌రోడ్లో గల జగన్నాథపురం వంతెన సమీపంలోని విలువైన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ఎమ్మెల్యే అనుచరులు రాత్రిరాత్రికి కబ్జా చేసేందుకు యత్నించిన వైనం అప్పట్లో వివాదస్పదమైంది.

ఆ స్థలంలో ఉన్న షాపును బలవంతంగా చేయించేందుకు యత్నించడంతో పాటు  ఎమ్మెల్యే అనుచరులు పొక్లైన్‌ను తీసుకెళ్లి కూల్చేందుకు ప్రయత్నించారు.  మహాలక్ష్మినగర్‌ ప్రాంతంలోని తూరంగి 231, 222, 230/2 సర్వే నెంబర్లలో సుమారు 20 ఎకరాల భూమిని తన సొంతభూమిలో కలిపేసుకున్నారు. రూ.10 కోట్లకు పైగా విలువచేసే ఆ భూమిని తన సొంతం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.  ఆయన ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ నిధులతో రహదారి వేస్తుంటే తన గూండాగిరితో రహదారిని ధ్వంసం చేశారు.

ఈ వ్యవహారంపై వనమాడి సోదరుడు సత్యనారాయణ, ఆయన కుమారుడిపై కేసులు కూడా నమోదయ్యాయి. సర్వే నెంబర్‌ 230/2లోని మిగిలిన మరో 12.23 ఎకరాల ప్రైవేటు వ్యక్తుల భూముల్లో కూడా ప్రవేశించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వేరొకరు కొనుగోలు చేసిన భూమిలో సుమారు ఎకరం వరకు రాళ్లు పాతి తమదేనంటూ వనమాడి కుటుంబీకులు వాదిస్తున్నట్టుగా తెలిసింది. అలాగే, టౌన్‌ సర్వేలోకి వచ్చే 1837, 1838లో ఉన్న ప్రైవేటు వ్యక్తుల భూముల్ని కూడా ఆక్రమించేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

ఇందులో భాగంగానే ఆ భూములకు సంబంధించి మ్యుటేషన్‌ జరగకుండా అధికార వర్గాల ద్వారా అడ్డుకుంటున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి.  దుమ్ములపేటలో 8 ఎకరాలు కూడా ఆయన కబ్జాకోరల్లో చిక్కుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక  కొవ్వూరు రోడ్లో మూడు ఎకరాల  అసైన్డ్‌ భూమి వ్యవహారంలో తలదూర్చి,  సెటిల్‌మెంట్‌ పేరుతో 50 శాతం భూమిని నొక్కేసి ప్లాట్లుగా విభజించి రూ.3 లక్షల చొప్పున అమ్ముకున్నారని ఆ ప్రాంతవాసులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇవి కాకుండా కాకినాడ నగరంలోని అనేక ప్రభుత్వ, మున్సిపల్‌ స్థలాలను సైతం ఆయన అనుచరులు స్వాహా చేసిన అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల జాగాలోనూ పాగా
ఏదైనా అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయిస్తాం. తుని నియోజకవర్గంలో పోలీస్‌ శాఖకు చెందిన విలువైన స్థలమే కబ్జాకు గురైంది. అధికార పార్టీకి చెందిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అండదండలతో బంధువులు ఆక్రమించారు. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం ఆ స్థలం విలువ రూ.5 కోట్లు పైనే ఉంటుంది. సాక్షత్తూ హోంమంత్రి సొంత జిల్లాలోనే పోలీసు శాఖ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది.

 కాకినాడ నుంచి అద్దరి పేట వరకు బీచ్‌ రోడ్లో ఒంటిమామిడి ప్రధాన జంక్షన్‌. పోలీస్‌స్టేషన్, సిబ్బంది క్వార్టర్స్‌ కోసం సర్వే నంబరు 843లో 7. 32 ఎకరాల విస్తీర్ణం గల మందబయలులో  రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ అప్పటి కలెక్టర్‌ సతీష్‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దాపురం ఆర్డీవో, తొండంగి రెవెన్యూ అధికారులు సర్వే చేసి స్థలాన్ని పోలీస్‌ శాఖకు అప్పగించారు. సర్వే నంబరు 842 లోని స్థలంలో గ్రామ చావిడి ఉండేది. 
ఇందులో పోలీస్‌స్టేషన్‌ తాత్కాలికంగా నిర్వహించిన తర్వాత 1998 నవంబర్‌ 26న అప్పటి కలెక్టర్‌ సతీష్‌ చంద్ర ఉత్తర్వుల మేరకు రెవెన్యూ అధికారులు పోలీస్‌ శాఖ స్థలాన్ని బదలాయించారు. అక్కడే పోలీస్‌స్టేషన్‌కు పక్కా భవనం నిర్మించారు. దీంతో సర్వే నంబరు 843 లో కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో క్వార్టర్స్‌ పనులు  చేపట్టక  పోవడంతో ఖాళీగా ఉండేది. మూడు రోడ్ల జంక్షన్లో ఉన్న స్థలంపై అధికార పార్టీకి చెందిన కీలక నేత బంధువు చూపు పడింది.

అధికారం అండతో మందబయలు స్థలంలో పాకలు, బడ్డీ  దుకాణాలను బలవంతంగా ఖాళీ చేయించి షాపింగ్‌ కాంప్లెక్సు నిర్మించారు. పక్కనే మంత్రి బంధువులు కొంత భూమిని కొనుగోలు చేశారు. దీన్ని ఆధారంగా చేసుకుని పోలీసు స్టేషన్‌కు చెందిన స్థలం సర్వే నెంబర్లను ఆ తర్వాత రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

సత్రం భూములకూ చెర
ముమ్మిడివరం నియోజకవర్గంలో అధికారం అండతో రూ.10 కోట్ల విలువైన సత్రం భూములను కబ్జా చేశారు. ముమ్మిడివరం మండలం కొమానపల్లి వారణాశి సుబ్బారాయుడు సత్రం 1911లో నిర్మించారు. కొమానపల్లికి చెందిన సుబ్బారాయుడు ముత్యాలు, పగడాల వ్యాపారం చేసేవారు. అప్పట్లో ఫ్రాన్స్‌ దేశస్తులు సమీపంలోని ఫ్రెంచి యానాంలో వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారు.

కోనసీమ నలు మూలల నుంచి వ్యాపారులు, ప్రజల వ్యాపార కార్యకలాపాల నిర్వహించేందుకు వెళ్తూ ఈ ప్రాంతంలో కొంత సేపు సేదతీరే వారు. వారి ఉపయోగార్థం సుబ్బారాయుడు ప్రధాన రహదారిని ఆనుకుని కొమానపల్లిలో 30 సెంట్ల విస్తీర్ణంలో సత్రం నిర్మించారు. దీని నిర్వహణకు చిన కొత్తలంక గ్రామంలో 13.75 ఎకరాల భూమిని కేటాయించారు. బాటసారులు సేద తీరేందుకు సువిశాలమైన గదులతో భవనం నిర్మించారు. మంచినీటికి, స్నానాలు చేసేందుకు పెద్ద బావిని తవ్వారు.

1985 వరకు ఈ సత్రం నిర్వహణ సక్రమంగా జరిగింది. అనంతరం భూములను ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గుత్తుల పాటేశ్వరరావు, వరప్రసాద్‌లకు చెందిన కుటుంబ సభ్యుల పేరున నామమాత్రపు లీజు చెల్లిస్తూ తమ స్వాధీనంలో  ఉంచుకున్నారు. అదే గ్రామానికి చెందిన నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకుడి అండదండలతో దాదాపు గత 30 ఏళ్లుగా వారి స్వాధీనంలో ఉంచుకుని ఆ భూములలో పక్కా భవనాలు నిర్మించేసుకున్నారు.

ఆక్రమణదారులకు ఆ టీడీపీ నాయకుడు వత్తాసు పలకడంతో  దేవదాయ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో ఆ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లడంతో సత్రానికి లీజు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులకు పన్నులు చెల్లించకుండా సత్రం సొమ్మును దర్జాగా దోచేసుకుంటున్నారు.  

– కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, కాకినాడ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top