ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న అక్రమ ధనంపై ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపిస్తోంది.
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న అక్రమ ధనంపై ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అనధికారికంగా తరలిస్తున్న అక్రమ ధనాన్ని భారీ మొత్తంలోనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత ఎనిమిది రోజుల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే 16 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని డిప్యూటి ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్షి తెలిపారు.
ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ధనాన్ని పంచవచ్చనే కొన్ని జిల్లాలపై దృష్టి సారించామని ఆయన తెలిపారు. మాకున్న ఇంటిలిజెన్స్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న ధనాన్ని స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని జిల్లాలపై అధ్యయనం చేశామన్నారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక జనరల్ అబ్జర్వర్ ను, అసెంబ్లీ నియోజకవర్గాలకు మరో ఇద్దర్ని నియమించామన్నారు.
ఇప్పటి వరకు అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య 6,25,83,653 అని వినోద్ తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే రోజు వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మార్చి 9 తేదిన నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభించిందన్నారు. మార్చి 9 తేదిన సుమారు 9 లక్షల మంది ఓటరుగా నమోదు చేసుకున్నారని వినోద్ తెలిపారు.