breaking news
-
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం
విశాఖపట్నం: సింహాచలం సింహపురి కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేలోపే ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
విజయవాడలో ‘10 రూపాయల’ హత్య
సాక్షి, విజయవాడ: విజయవాడలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు రూ.10 రూపాయలు ఇవ్వలేదని తాతని మనవడు హత్య చేశాడు. హత్య చేసిన బాలుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. విజయవాడ కొత్తపేట పీఎస్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న వృద్ధుడ్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.నగరంలో ఈ ఘటన కలకలం రేపింది. మృతుడు తాపీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆయన స్వస్థలం మంగళగిరి నుకలపేట కాగా ఉపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నాడని పోలీసులు చెప్పారు.మరో ఘటనలో బందరు లాకులు వద్ద అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందినవారు యాచకులుగా స్థానికులు చెబతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
అల్లుడితో కలిసి భర్తను చంపిన భార్య
నంద్యాల (అర్బన్): అల్లుడుతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అల్లుడితోనే కలిసి తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన గురువారం నంద్యాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన సుభద్ర, గుర్రప్ప(40) దంపతులు ఐదేళ్లుగా నంద్యాల శివారులోని నందమూరినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు తువ్వపల్లె గ్రామానికి చెందిన లింగమయ్యతో మూడేళ్ల క్రితం వివాహం చేశారు.ఈ క్రమంలో సుభద్రకు అల్లుడైన లింగమయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి భర్త గుర్రప్ప పలుమార్లు సుభద్రను హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. రోజూ ఇంట్లో గొడవ జరుగుతుండటంతో గుర్రప్పను హతమార్చాలని సుభద్ర కుట్ర పన్నింది. గురువారం ఇంట్లో పడుకుని ఉన్న గుర్రప్ప మెడకు సుభద్ర, లింగమయ్య తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపారు. గుర్రప్ప తల్లి సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు భార్య సుభద్రను అరెస్ట్ చేయగా, లింగమయ్య పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
బ్యాంక్ దోపిడీకి స్కెచ్
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి రింగ్ రోడ్డులోని కెనరా బ్యాంక్‌లో దోపిడీకి ఏడుగురు ఆగంతకులు స్కెచ్ వేశారు. బ్యాంక్‌ను దోచుకోవడానికి పట్టపగలు తుపాకులతో చొరబడ్డారు. బ్యాంక్ సిబ్బంది అప్రమత్తమై అలారం ఆన్ చేయడంతో భయపడి దుండగులు పరారయ్యారు. వివరాలు.. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అనకాపల్లి రింగ్ రోడ్డులోని కెనరా బ్యాంక్‌కు ఏడుగురు వచ్చారు. అప్పటికే కొంత మంది ఖాతాదారులు బ్యాంకులో ఉన్నారు. వచ్చిన ఏడుగురిలో ఇద్దరు గేటు వద్ద వేచి ఉండగా.. ఐదుగురు లోపలకు ప్రవేశించారు.కొంత సేపు వారు లోపల అన్ని విభాగాలను పరిశీలించారు. వీరిలో ఒకరు బ్యాంక్ మేనేజర్ దగ్గరకు, మరో వ్యక్తి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి తుపాకులు తీసి బెదిరించారు. ఈ పరిణామంతో బ్యాంకులోని ఖాతాదారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది తేరుకుని సైరన్ మోగించారు. దీంతో దొంగలు వెంట తీసుకొచి్చన ద్విచక్ర వాహనాలపై రైల్వే స్టేషన్ మీదుగా పారిపోయారు. బ్యాంక్ అధికారులు అనకాపల్లి పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాంకుకు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. -
పసి పిల్లలను విక్రయిస్తున్న ముఠా ఆటకట్టు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఢిల్లీ, ముంబైల నుంచి పసి పిల్లలను తీసుకొచ్చి, పిల్లలులేని దంపతులకు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టుచేశారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై నగరంలోని కొత్తపేట, భవానీపురం, నున్న పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదుచేశారు. నిందితుల నుంచి ఐదుగురు పసిపిల్లలతోపాటు, రూ.3.30 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు గురువారం మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.విజయవాడ సితార సెంటర్‌కు చెందిన బలగం సరోజిని సులభంగా డబ్బులు సంపాదించేందుకు పిల్లల్లేని వారికి అక్రమంగా పిల్లలను విక్రయించడాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కిరణ్‌శర్మ, ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ఆమెకు పరిచయమయ్యారు. వారు అక్కడి నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి సరోజినికి ఇచ్చేవారు. ప్రతిఫలంగా వారికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వరకూ సరోజిని ఇచ్చేది. ఇలా తీసుకొచ్చిన చిన్నారులను తిరిగి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించేది. వీరికి విజయవాడలో మరికొందరు కూడా జతకలిశారు. వీరంతా గతంలో అరెస్టయి జైలుకు వెళ్లొచ్చారు. అమ్మకానికి సిద్ధంగా ఉండగా.. ఇక ఢిల్లీకి చెందిన కిరణ్‌శర్మ, భారతిల నుంచి ఇద్దరు పిల్లలను.. ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ల నుంచి మరో ముగ్గురు పిల్లలను సరోజిని తీసుకొచ్చి అమ్మకానికి సిద్ధంగా ఉంచింది. అయితే, పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు ఈ విషయం తెలిసింది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ కె. లతాకుమారి, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్, భవానీపురం, నున్న ఇన్స్పెక్టర్లు ఏకకాలంలో దాడులు నిర్వహించి కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో ఐదుగురిని, నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉడా కాలనీలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నలుగురు పిల్లలను, రూ.3.30 లక్షల నగదును స్వా«దీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి విజయవాడలో వివిధ ప్రాంతాలకు చెందిన బలగం సరోజిని (31), గరికముక్కు విజయలక్ష్మి (41), వాడపల్లి బ్లెస్సీ, ఆముదాల మణి, షేక్ ఫరీనా, వంశీకిరణ్కుమార్, శంక యోహాన్, పతి శ్రీనివాసరావు, సత్తెనపల్లికి చెందిన షేక్ బాబావలి, తెలంగాణలోని ఘట్కేసర్కు చెందిన ముక్తిపేట నందిని.. మొత్తం పదిమందిని అరెస్టుచేసినట్లు సీపీ తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత, ఏడీసీపీలు జి. రామకృష్ణ, ఏసీపీ కె. లతాకుమారి, ఎన్వీ దుర్గారావు, స్రవంతి రాయ్, పలువురు సీఐలు పాల్గొన్నారు. -
ఇంట్లోకి చొరబడి మహిళపై హత్యాయత్నం
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బెజవాడలో గంజాయి బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే రాళ్లు, క్రికెట్ బ్యాట్లు, కారం చేత పట్టుకొని ఏకంగా ఇళ్లల్లోకి చొరబడి ఓ మహిళను హతమార్చేందుకు యత్నించారు. గంజాయి మత్తులో వీరు చేసిన వీరంగంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ లూనాసెంటర్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుమ్మళ్ల కుసుమ అనే మహిళ సింగ్‌నగర్‌లోని నార్త్‌జోన్ తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో 20 ఏళ్లుగా ఉంటోంది. బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో టీవీ చూస్తుండగా గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు లోనికి ప్రవేశించాడు. చీరను లాగి ఆమెపై హత్యాయత్నానికి యత్నించాడు. దీంతో ఆమె అతడిని బయటకు తోసేసి తలుపులు వేసింది. విషయాన్ని సమీపంలో ఉన్న తన అన్నయ్య శేఖర్‌కు ఫోను చేసి చెప్పింది. ఇంతలో ఆ వ్యక్తితోపాటు మరో ఇద్దరు గంజాయి బ్యాచ్ సభ్యులు, ఓ మహిళ కూడా వారితోపాటు వచ్చి రాళ్లు, బ్యాట్, కారంతో వీరంగం సృష్టించారు. మహిళను, ఆమె కుమారుడిని చంపేస్తామంటూ ఇంటిపైకి రాళ్లు రువ్వారు. అద్దాలు, తలుపులు, కిటికీలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. వీరి చేష్టలకు భయపడి స్థానికులు ఇళ్లల్లోకి పరుగులు తీశారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులపైనా రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ పోలీసులపైనా గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. తమకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అండదండలు ఉన్నాయని హూంకరించింది. వారు చెప్పినట్లుగానే స్థానిక టీడీపీ నాయకులు కొందరు గొడవ జరిగిన కాసేపటికే అక్కడకు చేరుకొని నిందితులను రక్షించేందుకు యత్నించారు. వారిపై కేసులు పెట్టవద్దంటూ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. వీడియోల రూపంలో సాక్ష్యాధారాలు ఉన్నా కేసులు కట్టేందుకు పోలీసులు వెనుకాడుతున్నారు. రాజీ పడాల్సిందిగా బాధితులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. విషయం మీడియాకు, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హత్యాయత్నం కాకుండా చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు కట్టి చేతులు దులుపుకునేందుకు యత్నిస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు. -
వివాహేతర సంబంధం.. అత్తపై కోడలు దాడి
కోనేరుసెంటర్: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అత్తను ప్రియుడితో కలిసి కోడలు హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. అత్త చనిపోయిందని భావించి ప్రియుడితో కలిసి మూడేళ్ల బాలుడితో మహిళ పరారైంది. అయితే కొన ఊపిరితో ప్రాణాలు నిలబెట్టుకున్న వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన నలపాల సురేష్ లిఖిత భార్యాభర్తలు, వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. సురేష్ తల్లి పార్వతి కొడుకు వద్దే ఉంటుంది. సురేష్ నగరంలోని ఓ పెట్రోల్‌బంకులో పనిచేస్తుంటాడు. సురేష్ ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. మూడేళ్ల బాబుతో పరారీ.. అందరూ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి సురేష్ ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న పార్వతిపై దాడి చేశాడు. దెబ్బలకు తట్టుకోలేక పార్వతి బిగ్గరగా కేకలు పెడుతూ ఇంట్లో ఉన్న లిఖితను పిలిచింది. లిఖిత ఎంతకీ బయటకు రాలేదు. ఆమెను చంపేందుకు రకరకాలు ప్రయత్నిస్తుండగా పార్వతి అతని దాడిని ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నట్లు నటించిన లిఖిత కారం తెచ్చి ఆ వ్యక్తి చేతికి ఇవ్వటంతో అత్త కళ్లల్లోకి విసిరాడు. అనంతరం ఇద్దరు ఆమెను అంతమొందించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.చివరికి పార్వతి అపస్మారకస్థితికి చేరుకోగా చనిపోయిందనుకుని భావించిన లిఖిత ఆ వ్యక్తితో కలిసి తన మూడేళ్ల బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. గాయాలపాలైన పార్వతి సమీపంలో బంధువుల ఇంటికి విషయం చెప్పగా వారు సురేష్‌కు జరిగిన విషయం చెప్పారు. దీంతో సోమవారం చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గుర్తుతెలియని వ్యక్తితో పాటు లిఖిత కోసం గాలిస్తున్నట్లు సీఐ ఎస్కే నబీ తెలిపారు. -
పెళ్లి కాదనే బెంగతో యువకుడి ఆత్మహత్య
గార్లదిన్నె/అనంతపురం సిటీ: కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన భీమన్నగారి చిదంబర కుమారుడు ప్రతాప్(31) వ్యవసాయ పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. తన ఈడు పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడగా.. తనకు ఇంకా పెళ్లి కాకపోవడంతో కుంగిపోయాడు. తనకు పెళ్లి చేయాలని ఇంట్లో అడుగుతూ వస్తున్నా... అప్పులు ఎక్కువగా ఉన్నాయని, అవి తీరాక పెళ్లి చేస్తామంటూ కుటుంబ సభ్యులు వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ప్రతాప్ ఆదివారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి గార్లదిన్నె రైల్వేగేట్ సమీపంలో గ్వాలియర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న యశ్వంత్‌పూర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ నుంచి సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ వెంకటేష్ సోమవారం అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
కుటుంబ కలహాలతో తల్లీబిడ్డ ఆత్మహత్య
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కుటుంబ కలహాలతో ఓ తల్లి కన్నకొడుకుతో మృత్యుఒడిలోకి చేరింది. ఈ ఘటన ఆదివారం చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు... తుమ్మింద గ్రామానికి చెందిన బాబు భార్య కవిత్ర (26)కు అయిదేళ్ల కిందట వివాహం అయింది. ఈ దంపతులకు ముకేష్ (04) అనే కుమారుడు జన్మించాడు. శనివారం ఈ దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కవిత్ర సాయంత్రం గ్రామ సమీపంలోని బావిలో కుమారుడుతో పాటు దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్య, కుమారుడు ఇంట్లో కనిపించకపోవడంతో భర్త, కుటుంబీకులు ఊరంతా గాలించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఊరికి సమీపంలోని బావిలో శవమై తేలారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కుమార్ తదితులున్నారు. -
న్యాయవాదికి 'సైబర్' వల.. రూ.72 లక్షలు మాయం
బద్వేలు అర్బన్: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన ఓ ప్రముఖ న్యాయవాది సైబరాసురుల వలలో చిక్కి, డబ్బులు పోగొట్టుకున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణానికి చెందిన న్యాయవాదికి 3 నెలల కిందట గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను గుజరాత్‌కు చెందిన పోలీసు అధికారినని, మీ ఆధార్ నంబర్‌కు ఓ ఫోన్ నంబర్ లింక్ అయి ఉందని, ఆ నంబర్ ద్వారా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నందుకు క్రిమినల్ కేసు నమోదైందని న్యాయవాదిని బెదిరించాడు. సుప్రీంకోర్టు నుంచి మీపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని, అందుకు మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుందన్నాడు. దీంతో న్యాయవాది సమస్యను పరిష్కరించాలని కోరగా.. తొలుత రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలని నేరగాడు నమ్మబలికాడు. అనంతరం పలుమార్లు ఫోన్ చేసి వివిధ లావాదేవీల ద్వారా మొత్తంగా రూ.72,68,039 బదిలీ చేయించుకున్నాడు. ఈ విషయం బయటకు రాకూడదని, ఎవరికైనా చెబితే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించాడు. తర్వాత ఇదంతా మోసమని గ్రహించిన న్యాయవాది పట్టణ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మోసపోయిన న్యాయవాది వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. -
రెండు ప్రమాదాల్లో నలుగురి మృతి
ఆత్మకూరు/అచ్యుతాపురం రూరల్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు, అనకాపల్లి జిల్లాలో శనివారం రాత్రి మోటారు సైకిల్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల గ్రామానికి చెందిన చవల మాధవ (38), మనోజ (35) దంపతులు. వీరి కుమార్తె ఆత్మకూరులోని ఏపీ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఆదివారం పేరెంట్ మీట్ ఉండడంతో వీరు వెళ్లారు. ఇంటివద్ద నుంచి భోజనం తీసుకెళ్లి కుమార్తెకు తినిపించారు. అక్కడి నుంచి బైక్ మీద ఇంటికి వెళుతుండగా.. నెల్లూరు–ముంబై రహదారిలో ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోకి వచ్చేసరికి బద్వేల్ నుంచి నెల్లూరు వెళుతున్న ఇన్నోవా కారు రాంగ్రూట్లో వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మంచులో దారి సరిగా కనిపించక.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం సమీపంలో శనివారం రాత్రి మోటారు సైకిల్ కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో మునగపాక మండలం గణపర్తి గ్రామానికి చెందన ధనువిజయ్ (19), చెర్లోపాలెం గ్రామానికి చెందిన దూలి దుర్గ (20) మరణించారు. ఎస్ఐలు సుధాకర్, వెంకటరావు తెలిపిన మేరకు.. తండ్రి చనిపోవడంతో దూలి దుర్గ అచ్యుతాపురం మండలం చోడపల్లిలో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి విద్యుత్ లైటింగ్ పనులు చేసుకుంటూ తల్లి నాగమణికి చేయూతగా నిలుస్తున్నాడు. గణపర్తికి చెందిన భోగాది మహేష్, లక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ధనువిజయ్ లైటింగ్ పనులకు సహాయకుడిగా వెళుతున్నాడు. వీరికి జగన్నాథపురానికి చెందిన ఇంటి జగన్ స్నేహితుడు. గణపర్తిలో శనివారం జరిగిన పండుగలో వీరు ఉత్సాహంగా గడిపారు. తరువాత దుర్గను చోడపల్లిలో డ్రాప్ చేయడానికి బైక్‌పై ముగ్గురూ బయలుదేరారు. జగన్నాథపురంలో జగన్ దిగిపోయి, తన బైక్‌ను దుర్గకు ఇచ్చాడు. రాత్రి 11.30 గంటల సమయంలో దుర్గ, ధనవిజయ చోడపల్లి వెళుతుండగా మంచు విపరీతంగా కురవడంతో దారి సరిగా కనిపించక జగన్నాథపురం సమీపంలో రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు తెలిపారు. -
అమానుషం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం
ఉప్పలగుప్తం: కన్న కూతురి చేయి పట్టుకుని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తండ్రి.. ఆమె పైనే కన్ను వేసి, అఘాయిత్యానికి పాల్పడిన అమానుష సంఘటన ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో జరిగింది. ఎస్సై సీహెచ్ రాజేష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆ వ్యక్తి తన భార్యను ఉపాధి నిమిత్తం కువైట్ పంపించి, 15 ఏళ్ల కుమార్తెతో కలసి ఉంటున్నాడు. కుమారుడిని తన అత్తవారింటి వద్ద ఉంచాడు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న ఆ దుర్మార్గుడు కొంత కాలంగా తన కుమార్తెను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అమ్మమ్మ గారింటి దగ్గర ఉంటున్న బాలిక సోదరుడికి సమాచారం ఇచ్చారు. తన తండ్రి అఘాయిత్యంపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా పోలీసు విచారణ అనంతరం బాధిత బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యాన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్, అమలాపురం రూరల్ సీఐ డి.ప్రశాంత్ కుమార్, ఎస్సై రాజేష్ పరిశీలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
గుంటూరులో మళ్లీ డ్రగ్స్ కలకలం
పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు తల్లీకుమార్తె మధ్య డ్రగ్స్ వివాదం కలకలం రేపింది. కుమార్తె డ్రగ్స్‌కు బానిసగా మారిందని తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాలిక బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు చిన్నబజారుకు చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లోని ఒక టీవీ చానల్లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. తండ్రితో కలిసి గుంటూరులోనే ఉంటున్న పెద్ద కుమార్తె (17) ఇక్కడే ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇద్దరు యువకులు తన కుమార్తెను డ్రగ్స్‌కు బానిసగా మార్చారని తల్లి ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ అలవాటు మానుకోవాలని తల్లి చెప్పగా.. శుక్రవారం తల్లీకుమార్తె మధ్య ఘర్షణ తలెత్తగా కుమార్తె తల్లికి ఎదురుతిరిగింది. దీంతో మనస్తాపానికి గురైన తల్లి ఫిట్స్ తగ్గడానికి ఉపయోగించే టాబ్లెట్లను అధికంగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ఆమెను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాధితురాల్ని కలిసిన పోలీసు అధికారులు మహిళ ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. ఈగల్ ఐజీ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా మైనర్ విద్యారి్థనిని మాదక ద్రవ్యాల ఉచ్చులోకి లాగిన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామన్నారు. పూర్తిస్థాయిలో డ్రగ్స్‌కు బానిసైన బాలికకు ఆడిక్షన్ సెంటర్ ద్వారా చికిత్స అందించి సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రేమ పేరుతో యువతిని వంచించి మాదకద్రవ్యాల మత్తుకు అలవాటు చేసిన వారిని పట్టుకు తీరుతామన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. కుమార్తె తన మాట వినడం లేదని, బాలికను వారించే క్రమంలో తల్లిపై తిరగబడిందని చెప్పారు. దీంతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఆ బాలికకు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారనే కోణంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని చెప్పారు. ప్రత్యేక బృందాల ద్వారా విచారిస్తామన్నారు. కొన్ని కళాశాలల్లోని విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. బాలికకు డ్రగ్స్ అలవాటు చేసిన ఇద్దరు యువకులను త్వరితగతిన అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎన్టీఆర్ జిల్లా: బోర్డు తిప్పేసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విస్సన్నపేటలో ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ అడ్వైజరీ సర్వీసెస్’ బోర్డు తిప్పేసింది. ఒక్కొక్కరిగా బాధితులు బయటకొస్తున్నారు. ఇంటికో మొక్క పెంచితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎర వేసిన నిర్వాహకులు.. సంస్థలో డబ్బులు పెడితే మీ భవిష్యత్ మారిపోతుందంటూ ఆశ పెట్టారు. జనం అత్యాశను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.ఏజెంట్లను నియమించుకుని టార్గెట్లు పెట్టి మరీ కోట్ల రూపాయలు వసూలు చేశారు. పది వేలు పెడితే ప్రతీ నెలా వెయ్యి రూపాయలు, రూ. ఐదు లక్షలు పెడితే నెలకు రూ.50 వేలు ఇస్తామంటూ టోకరా వేశారు. సుమారు రూ.25 కోట్లకు పైగానే వసూళ్లు చేశారు. డబ్బులు కట్టిన వారు ప్రశ్నించడంతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ దుర్గా ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గా ప్రసాద్ చనిపోయిన తర్వాత అతని భార్య నండూరి శివానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. -
టీడీపీ నేతల అరాచకం.. నెల్లూరులో కార్పొరేటర్ తండ్రి కిడ్నాప్
చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీ నేతల అరాచకం, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సొంత గూటికి వెళ్లారన్న అక్కసుతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు బెదిరింపులు మితిమీరాయి. టీడీపీలోనే కొనసాగాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ 34వ వార్డు కార్పొరేటర్ ఫమీదా గురువారం వైఎస్ జగన్ చేతుల మీదుగా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో కొందరు ఆమె తండ్రి సయ్యద్ నజీర్‌ను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీకి చెందిన సయ్యద్ నజీర్ వైఎస్సార్సీపీలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు బతుకుదెరువు కోసం పొట్టేళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కుమారుడు బెంగళూరులో ఉండగా, కుమార్తె ఫమీదాకు పెళ్లి చేసి నెల్లూరు పంపారు. అక్కడ ఆమె వైఎస్సార్సీపీ కార్పొరేటర్‌గా విజయం సాధించింది. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అక్కడి నాయకుల ఒత్తిడితో ఆమె పార్టీ మారారు. అయితే ఆ పార్టీలో ఇమడలేక రెండు రోజుల క్రితం ఆమె వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో అధికార పార్టీ నాయకులు ఆమెను ఒత్తిడికి గురిచేసే క్రమంలో గురువారం సాయంత్రం మసీద్ నుంచి ఆమె తండ్రి ఇంటికి తిరిగి వస్తుండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. కారులో నలుగురు వచ్చారని, వారిలో ఒకరు పోలీసు దుస్తుల్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందు వారు నజీర్ అనే టీ కొట్టు వ్యక్తిని పట్టుకుని కారులో ఎక్కించుకొని కొన్ని వివరాలు అడిగారు. తాను మీరనుకుంటున్న నజీర్‌ను కాదని చెప్పడంతో అతడ్ని వదిలేసి.. ఫమీదా తండ్రి నజీర్ ఎక్కడున్నాడో కనుక్కుని బలవంతంగా తీసుకెళ్లారు. చీకటి పడినప్పటికీ నజీర్ ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన శుక్రవారం వాకాడుకు చేరుకుని అన్ని రకాలుగా విచారించాక, నజీర్ కిడ్నాప్‌నకు గురయ్యారని సీఐ హుస్సేన్‌బాషాకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి వరకు ఆయన ఆచూకీ తెలియలేదు. -
మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు బోల్తా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దుర్గమ్మ.. చినవెంకన్న.. శివయ్య.. దత్తాత్రేయుడు.. సూర్యనారాయణుడు.. సింహాద్రి అప్పన్న.. అందరి దర్శనం చేసుకున్నారు. భద్రాచలం సీతారాముల్ని దర్శించుకునేందుకు బయల్దేరారు. అంతలోనే పొగమంచు పగబట్టింది. రోడ్డు మలుపు మృత్యువుగా మారి 9 మందిని పొట్టనపెట్టుకుంది. తీర్థయాత్ర చివరి ఘట్టానికి చేరుకుంటున్న సమయంలో మృత్యులోకానికి చేరుకున్నారు. నిన్నటివరకూ తమతో ప్రయాణించిన వారు.. ఇప్పుడు విగతజీవులుగా మారిపోయారని తెలిసి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరులో మొదలైన ప్రయాణం.. చింతూరు సమీపంలో శాశ్వతంగా ఆగిపోయింది. తులసిపాక ఘాట్ రోడ్డులో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 9 మంది మృతి చెందగా.. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారికి చింతూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. సాయంత్రం మృతదేహాలను, తీవ్రంగా గాయపడిన నలుగురు క్షతగాత్రులను అంబులెన్సులలో చిత్తూరు పంపించారు. మిగతా క్షతగాత్రులను మినీ బస్సుల్లో వారి స్వగ్రామాలకు పంపించారు.రాజుగారి మెట్ట వద్ద..అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో తులసిపాకలోని రాజుగారి మెట్ట వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. మొత్తం 37 మంది ప్రయాణిస్తున్న బస్సులో 32 మంది తీర్థయాత్రలకు వచ్చిన వారు కాగా.. ఒకరు ఆర్గనైజర్, ఇద్దరు వంట మనుషులు ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు కలిపి మొత్తం 37 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇందులో డ్రైవింగ్ చేస్తున్న మొదటి డ్రైవర్‌కు గాయాలు కాగా.. పక్కనే ఉన్న మరో డ్రైవర్‌కు చేయి విరిగింది. వీరిలో 9 మంది మృతి చెందారు. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ఆరుగురు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మృతులంతా చిత్తూరు జిల్లా వారే. ఘటనా స్థలంలో 3 అంబులెన్స్‌లు, 5 పోలీసు వాహనాలతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 22 మందికి చింతూరు ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడిన వారిలో ఒకరికి తలకు గాయం కావడంతో.. మొదట్లో భద్రాచలం ఆస్పత్రికి తరలిద్దామనుకున్నారు. అయితే, ఇబ్బందేమీ లేదని తేలడంతో చింతూరు ఆస్పత్రిలోనే చికిత్స అందించారు.పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చి..చిత్తూరు నగర చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 32 మంది పుణ్యక్షేత్రాల దర్శనం కోసం టూర్ వేసుకునున్నారు. వీరిలో 20 మంది మహిళలున్నారు. ఈ నెల 6న మిట్టూరులోని విఘ్నేశ్వర ట్రావెల్స్‌కు చెందిన ఏపీ 39 యూఎం 6543 నంబర్ బస్సులో బయలుదేరారు. మురకం బట్టుకు చెందిన రామ్మూర్తి అనే ప్రైవేట్ ఏజెంట్ ద్వారా బస్ బుక్ చేసుకున్నారు. తొలుత కోటప్పకొండ, అమరావతి, మంగళగిరి, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకాతిరుమల, భీమవరం, పాలకొల్లు, అంతర్వేది, ద్రాక్షారామం, పెనుగొండ, సామర్లకోట, పిఠాపురం, కోటిపల్లి, అన్నవరం, అరసవల్లి, శ్రీకూర్మం చూసుకొని గురువారం విశాఖ చేరుకున్నారు. ఇక్కడ సింహాచలం దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా అరకు లోయకు వెళ్లారు. అక్కడ నుంచి గురువారం సాయంత్రం 5 గంటలకు అరకు నుంచి భద్రాచలం వెళుతున్న క్రమంలో దుర్ఘటన జరిగింది. కాగా, హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ అమిత్‌బర్దర్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఘటనాస్థలాన్ని, స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరఫున రూ 2 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ప్రకటించారు. తీవ్రగాయాలైన వారికి రూ.2 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రంపచోడవరం నియోజకవర్గ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మృతుల వివరాలుమృతుల్లో చిత్తూరు నగరానికి చెందిన నాగేశ్వరరావు(68), శ్రీకళాదేవి (64), కావేరి కృష్ణ(70), శ్యామల(67), తవణంపల్లె మండలానికి చెందిన దొరబాబు(37), పలమనేరుకు చెందిన దంపతులు శివశంకరరెడ్డి(47), సునంద (45), పెనుమూరుకు చెందిన కృష్ణకుమారి(47), తెనాలి శైలజారాణి(64) ఉన్నారు.అతివేగం.. పొగమంచే కారణంబస్సులో ప్రసాద్, మధు అనే ఇద్దరు డ్రైవర్లుండగా.. మధు బస్సు నడుపుతున్నట్టు క్షతగాత్రులు చెప్పారు. మలుపుల వద్ద కూడా వేగంగా వెళ్తుండగా.. నెమ్మదిగా వెళ్లాలని చెప్పినట్టు బాధితులు తెలిపారు. చాలామంది గాఢ నిద్రలో ఉండగా.. దట్టంగా కురుస్తున్న పొగమంచుతో రోడ్డు కనిపించకపోయినా.. వేగంగా మలుపు తిప్పడంతో తులసిపాక వద్ద మరో మలుపు ఉన్నట్టు డ్రైవర్ గుర్తించలేకపోయాడు. దీంతో బస్సు వేగాన్ని నియంత్రించలేక అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రయాణికులు నిద్ర నుంచి తేరుకునేలోపే 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల హాహాకారాలతో ఘాట్‌రోడ్డు విషాదకరంగా మారిపోయింది. కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికులు మాత్రం చిన్న గాయాలతో బయటపడగలిగారు. నడిచేందుకు వీలుగా ఉన్న దారికి అటుఇటుగా ఉన్న సీట్లల్లో కూర్చున్న ప్రయాణికులు మాత్రం వెంటనే కిందపడిపోయారు. బస్సు ఏటవాలుగా బోల్తాపడటంతో ఒక్కసారిగా నిద్ర మత్తులోనే కిందపడి జారుకుంటూ వెనక్కి వెళ్లి గుద్దుకోవడంతో కనీసం ప్రాణాలు కాపాడుకునేందుకు కూడా ప్రయత్నించే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి భద్రాచలానికి ఇంకో 2 గంటల్లోగా చేరుకుంటారనేలోగా ఘోర ప్రమాదం జరిగింది.తీరిగ్గా.. తాపీగా..ఈ ఘాట్‌రోడ్డులో ప్రయాణం భయంగానే ఉంటుంది. చురుకైన మలుపులతో పాటు రోడ్డు మధ్య గుంతలతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. పాడైపోయిన ఈ రోడ్లను బాగు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని స్థానికులు పదేపదే కోరుతున్నా కనీసం గుంతలు కూడా పూడ్చిన పాపాన పోలేదు. గతంలోనూ ఈ ఘాట్‌రోడ్డులో పలు ప్రమాదాలు జరిగాయి. 15 అక్టోబర్ 2019లో కర్ణాటకకు చెందిన ప్రయాణికులు ఇక్కడి రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మారేడుమిల్లి ప్రాంతం పర్యాటకులను బాగా ఆకర్షిస్తోంది. ఇప్పుడు సీజను కూడా. వచ్చే మార్చి నెలాఖరు వరకూ ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయానికి ముందే రోడ్లను బాగు చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. గత సంక్రాంతి సీజన్‌కే గుంతలు లేని రోడ్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఏడాది దాటి మరో సంక్రాంతి వస్తున్నప్పటికీ రోడ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. తాజా ప్రమాదంతో తీరిగ్గా స్పందించిన ప్రభుత్వం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ భారీ వాహనాలకు ఘాట్ రోడ్డులో అనుమతి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.వైఎస్ జగన్ దిగ్భ్రాంతిఅల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు విచారంబస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తంచేశారు. బస్సు ప్రమాదం గురించి అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని, పలువురు మృతిచెందగా, గాయపడిన వారిని చింతూరు ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. అవసరమైన వారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. మృతుల్లో 8 మంది చిత్తూరు జిల్లా వాసులేచిత్తూరు అర్బన్: మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడిన దుర్ఘటన పదుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. దుర్మరణం పాలైన వారిలో 8 మంది చిత్తూరు జిల్లాకు చెందిన వారు కాగా.. తిరుపతి జిల్లాకు చెందిన మరో మహిళ ఉన్నారు. మరో 24 గంటలు దాటితే ఎవరి ఇళ్లకు వారు చేరుకునేవారు. మృతుల్లో ఒకరైన శ్రీకళాదేవి విశ్రాంత ప్రధానోపాధ్యాయిని. ఆరేళ్ల క్రితం భర్త చనిపోగా.. కొడుకు బసవంత్రెడ్డి యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను వస్తే తప్ప శ్రీకళాదేవి మృతదేహాన్ని చిత్తూరుకు తీసుకొచ్చేవాళ్లు లేరు. మరో మృతుడు నాగేశ్వరరావు చిత్తూరు న్యూట్రిన్ సంస్థలో పనిచేసి రిటైరయ్యారు. భార్య అమ్ములు, బాయ్‌తో కలిసి ఉంటున్నారు. పిల్లలు లేకపోయినా ఈ దంపతులు అన్యోన్యంగా ఉంటూ నాగేశ్వరరావుకు వచ్చే పింఛన్ డబ్బుతో కాలం గడుపుతున్నారు. చిత్తూరు నగరం గిరింపేటకు చెందిన శ్యామల విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. భర్త చనిపోవడంతో హైదరాబాద్‌లో కుమార్తె వద్ద ఉంటున్నారు. చిత్తూరు నగరం మిట్టూరుకు చెందిన కావేరి కృష్ణ సైతం ప్రమాదంలో మృతి చెందారు. ఇతడి కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. తవణంపల్లెకు చెందిన దొరబాబు దాదాపు 20 ఏళ్లుగా వంట పనిచేస్తున్నాడు. పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పూరిగుడిసెలో కాపురముంటున్న ఈ కుటుంబానికి రెక్కాడితేగానీ డొక్కాడదు. మృతుడి భార్య సుమలత సున్నిత మనసు్కరాలు కావడంతో ఆమె భర్త చనిపోయిన విషయం ఇప్పటివరకు చెప్పలేదు. పలమనేరుకు చెందిన శివశంకర్‌రెడ్డి, సునంద దంపతుల ఒక్కగానొక్క కుమారుడు వెంకటసాయి బీడీఎస్ చదువుతున్నాడు. బెంగళూరు కేఆర్ పురంలో స్థిరపడ్డ మరో మహిళ కృష్ణకుమారి స్వగ్రామం పెనుమూరు మండలం బలిజపల్లె. ఈమె భర్త హరినాథరెడ్డి హిటాచీలతో వివిధ పనులు చేయిస్తుంటారు. భార్య మరణవార్త విన్నాక కన్నీటి పర్యంతమైన హరినాథరెడ్డి హుటాహుటిన చింతూరు బయలుదేరాడు. తిరుచానూరు పంచాయతీ టెలిఫోన్ కాలనీకి చెందిన విశ్రాంత అధికారిణి తెనాలి శైలజారాణి ఐదేళ్ల క్రితం గ్రంథాలయ అధికారిణిగా రిటైరయ్యారు. అప్పటి నుంచి టెలిఫోన్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. తరచూ ఆధ్మాత్మిక యాత్రలు, తీర్థయాత్రలకు వెళ్తూ వచ్చేది. వీరంతా ఈ నెల 6న రాత్రి 9 గంటలకు చిత్తూరు నుంచి ట్రావెల్ బస్సులో బయలుదేరారు. వీరంతా 13వ తేదీన మహానంది, అహోబిలం, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం, తాళ్లపాక అన్నమయ్య ప్రాంగణం చూసుకుని చిత్తూరు చేరుకోవాల్సి ఉంది. ఇంతలో రోడ్డు ప్రమాదం జరగడంతో విహార యాత్ర విషాదంగా ముగిసింది. టూర్లో అరకు లేకపోయినా..ఈ యాత్రలో అరకు వెళ్లాలని ఎవరూ అనుకోలేదు. గురువారం ఉన్నట్టుండి అరకు వెళ్లాలని పలువురు పట్టుబట్టారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.500 అదనంగా వసూలు చేసి అరకు వెళ్లడం, అటు నుంచి భద్రాచలం వస్తుండగా ప్రమాదం జరిగిందని ప్రయాణికురాలు పద్మజ తెలిపారు.బస్సు ఒకరిది.. ఆపరేటర్ మరొకరుచిత్తూరు రూరల్ (కాణిపాకం): చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ట వద్ద లోయలో పడిన బస్సు చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన రామ్మూర్తికి చెందినది. ఇతడు 30 ఏళ్లుగా బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఇతనికి ప్రస్తుతం రెండు బస్సులున్నాయి. అందులో ఏపీ 39యూఎం 6543అనే బస్సు అదుపు తప్పింది. ఘోర ప్రమాదానికి కారణమైంది. ఈ బస్సును రెండేళ్ల క్రితం విఘ్నేశ్వర ట్రావెల్స్ సంస్థ రామ్మూర్తి నుంచి అద్దెకు తీసుకుని టూర్స్ నిర్వహిస్తోంది. పన్నీర్ సెల్వం అనే వ్యక్తి విఘ్నేశ్వర ట్రావెల్స్‌ను నడిపిస్తున్నారు. ఇతని ద్వారా దొడ్డిపల్లికి చెందిన వజ్రమణి అనే వ్యక్తి టూరిస్టు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతని ద్వారా విహార యాత్రలకు వెళ్లే వారి పూర్తి వివరాలు ట్రావెల్స్ నిర్వాహకుల వద్ద ఉండటం లేదు. దీనిపై ట్రావెల్స్ నిర్వాహకులు దృష్టి సారించడంలేదని తెలుస్తోంది.‘ఫిట్నెస్ ఎలా ఇచ్చారో’ప్రమాదానికి గురైన బస్సు 2012లో రిజిస్ట్రేషన్ అయింది. గత నెల 6న ఫిట్నెస్ సర్టిఫికెట్(ఎఫ్‌సీ) చేయించారు. ఈ గడువు 2026 నవంబర్ 7 వరకు ఉంది. చిత్తూరు నగర బంగారుపాళ్యం సమీపంలోని ఆటోమెటిక్ టెస్టింగ్ సెంటర్లో ఎఫ్‌సీ చేయించారు. అక్కడికి బండి వెళ్లకుండానే ఎఫ్‌సీ చేయించారా, లేకుంటే బండి లోపాలను చూడకుండా ఎఫ్‌సీ ఇచ్చారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బండి కండిషన్ ఆధారంగానే ఇచ్చారా అనే అనుమానాలు ఉన్నాయి.డ్రైవర్ల వివరాలు ఇలా..బస్సులో మధు, ప్రసాద్ అనే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. మధు 2014లో హెవీ లైసెన్స్ తీసుకున్నాడు. ఈ లైసెన్స్ కాలపరిమితి 2030 వరకు ఉంది. ఇతనిపై ఇంతవరకు ఎలాంటి కేసులు, ప్రమాద సమస్యలు లేవని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రసాద్ మరో డ్రైవర్ కూడా 2006లో హెవీ లైసెన్స్ పొందాడు. ఈ లైసెన్స్ గడువు 2026 జూన్ 26తో ముగియనుంది. ఇతడి హయాంలో కూడా ప్రమాదాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు.ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథకూతురు, అల్లుడిని కోల్పోయిన వృద్ధురాలు భర్తను కోల్పోయిన రిటైర్డ్ టీచర్ దుర్ఘటనలో కదిలించే ఉదంతాలునేను పోయి వాళ్లు బతికినా బాగుండేది... ‘‘కూతురు సునందన, అల్లుడు శివశంకర్‌రెడ్డి, సమీప బంధువు శ్రీకళ (భర్త మేనకోడలు)తో కలిసి తీర్థయాత్రకు బయల్దేరా. ప్రమాదంలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో జీవితం ఉన్న వారి బదులు నేను చనిపోయినా బాగుండేది. నా భర్త రామచంద్రారెడ్డి వృద్ధాప్యంతో బాధపడుతున్నాడు. – వరిగపల్లి కుమారిహెల్పర్గా తెచ్చిన వంట మనిషి ప్రాణాలు కోల్పోయాడు మాంసం దుకాణం నడిపే నన్ను వంట మనిషి దొరబాబు రోజు కూలీకి హెల్పర్‌గా రమ్మన్నాడు. ప్రమాదంలో దొరబాబు మృతి చెందగా నా కాలికి గాయాలయ్యాయి. మృతదేహాలు నా మీద పడడంతో ఊపిరి ఆడలేదు. ఎలాగోలా కిటీకి నుంచి బయటకు వచ్చా – చిత్తూరుకు చెందిన సయ్యద్ ఇర్ఫాన్బ్రేక్ పడడం లేదని డ్రైవర్ చెప్పాడు... బస్సు ప్రమాదానికి ముందు నాకు మెలకువ వచి్చంది. బ్రేక్ పడడం లేదని డ్రైవర్ మధు చెప్పాడు. ఈ లోగానే బస్సు ప్రమాదానికి గురైంది. బోల్తా పడడంతో నా చేయి విరిగింది. బస్సు కిందకు దిగి నేను రెండు మృతదేహాలను బయటకు తీశా. – రెండో డ్రైవర్ పోగల ప్రసాద్తుపానుతో ఆగాం.. ప్రమాదం బారినపడ్డాం తీర్థయాత్రలకు గత నెల 23న బయలుదేరాలని భావించాం. ఆ సమయంలో తుపాను రావడంతో ప్రయాణం వాయిదా పడింది. దీంతో ఈ నెల 6న బయల్దేరాం. దుర్ఘటనలో నా తలకు తీవ్ర గాయమైంది. – చిత్తూరుకు చెందిన పద్మజమమ్మల్ని రమ్మన్న స్నేహితులు చనిపోయారు మా వీధిలో ఉంటున్న స్నేహితులు సరదాగా ఆంధ్రా చూసి వద్దాం రమ్మంటే వారితో బయల్దేరా. ప్రమాదంలో మా తలలకు తీవ్ర గాయాలయ్యాయి. విషాదం ఏమంటే.. మమ్మల్ని రమ్మని చెప్పిన నాగేశ్వరరావు, శ్రీకళ మృత్యువాత పడ్డారు. – చిత్తూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు షేక్ అష్రఫ్, ముంతాజ్ మనశ్శాంతి కోసం వస్తే నా స్వామి చనిపోయాడు మేం ఇద్దరం రిటైర్డ్ టీచర్లం. కొంతకాలం క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్నా. పిల్లలు లేరనే బాధలో ఉన్న మేము మనశ్శాంతి కోసం తీర్థయాత్రలకు బయల్దేరాం. ఇప్పుడు ప్రమాదంలో భర్తను కోల్పోయా. ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేను. – చిత్తూరుకు చెందిన నాగేశ్వరరావు భార్య అమ్ములుబాయి – చింతూరు/మోతుగూడెం -
నలుగురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
అనంతపురం: కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ వసతి గృహంలో ఉండి చదువుతున్న నలుగురు ఇంటర్ విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నకి పాల్పడ్డారు .వివరాల్లోకి వెళ్తే.. వసతి గృహంలో క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిందని భావించిన హాస్టల్ వార్డెన్, ఈ విషయం గురించి వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని విద్యార్థినులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో ఆందోళన చెందిన ఆ నలుగురు విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.ఈ విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినుల నుండి మౌఖిక వాంగ్మూలం తీసుకోవడంతో పాటు, హాస్టల్ వార్డెన్ వ్యవహారం, కళాశాల పరిపాలనలో ఉన్న లోపాలపై కూడా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. -
అనంతలో అయ్యప్ప మాలధారుడి దారుణ హత్య
బుక్కరాయసముద్రం: ఇద్దరు అయ్యప్ప మాలధారుల మధ్య ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. బుక్కరాయసముద్రం వీర భద్రకాలనీలో నివాసం ఉంటున్న జయమ్మ, ఆంజనేయులు కుమారుడు సాయి చరణ్(20) అదే కాలనీకి చెందిన ధన్‌రాజ్, తాడిపత్రి మండలం బుగ్గకు చెందిన సంతోష్ స్నేహితులు. చరణ్ మేజర్ కాగా, ధనరాజ్, సంతోష్ మైనర్లు. వీరంతా అనంతపురంలోని కూరగాయల మార్కెట్లో రోజువారీ కూలి పనులకు వెళ్తున్నారు. ఇటీవల ముగ్గురూ అయ్యప్ప మాలధారణ చేశారు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన సంతోష్, ధనరాజ్, చరణ్ ద్విచక్రవాహనంలో రెడ్డిపల్లి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు స్నానానికి వెళ్లారు. ఆ సమయంలో సాయి చరణ్, సంతోష్ మధ్య వివాదం రేగింది. మాటామాటా పెరిగి ఇద్దరూ ఘర్షణకు దిగారు. దీంతో ధన్‌రాజ్ ఇరువురినీ విడిపించి సర్ది చెప్పాడు. అనంతరం సాయి చరణ్ మరోసారి బావిలోకి దిగగా, సంతోష్ చరణ్‌పై బండరాళ్లు వేశాడు. తీవ్రంగా గాయపడిన సాయిచరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని సంతోష్ బెదిరించడంతో ధనరాజ్ భయపడిపోయాడు. అనంతరం ఇరువురు ఇళ్లకు వెళ్లిపోయారు. మూడు రోజులైనా కుమారుడి ఆచూకీ కనిపించకపోవడంతో సాయిచరణ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కళ్లముందే స్నేహితుడు చనిపోవడంతో తీవ్రంగా మధనపడిన ధనరాజ్ రెండురోజుల తర్వాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సాయి చరణ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని వెంటబెట్టుకుని మంగళవారం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సాయి చరణ్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంతోష్‌ను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ కుమారి మృతి
కడప జిల్లా: మండలంలోని మడూరు గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో తొండూరు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.కుమారి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో కుమారి విధులు ముగించుకున్నారు. పులివెందుల వచ్చేందుకు తొండూరు సాయిబాబా ఆలయం వద్ద బస్సు కోసం వేచి ఉండగా, బూచుపల్లెకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ కనిపించాడు. ఆమె చేయి ఎత్తడంతో తన ద్విచక్రవాహనాన్ని ఆపి ఆమెను ఎక్కించుకుని పులివెందులకు బయలుదేరాడు. మడూరు గ్రామ సమీపంలోకి రాగానే నాలుగు లేన్ల రోడ్డు పనులలో భాగంగా బ్రిడ్జి పనులు జరుగుతున్న ప్రదేశంలో లారీ వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమారి లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే స్థానికులు, రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఘన మద్దిలేటి, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. మృతురాలు కుమారికి భర్త విశ్వనాథ్(చిన్నా)తోపాటు ఇద్దరు కుమారులు విశ్వనాథ్, నందు, కుమార్తె సిరిచందన ఉన్నారు. కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీడీఓ రామచంద్రుడు, రెవెన్యూ సిబ్బంది కోరారు. -
రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి
సాక్షి, తిరుపతి: నగరి తడుకు పేట వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు, మరో తమిళనాడు వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు తమిళనాడు వాసులకు తీవ్రమైన గాయాలు జరిగినట్టు సమాచారం. నగరి తడుకు పేట వద్ద అతివేగంగా కారు నడపడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరణించిన వారిలో ఇద్దరు పద్మావతి అమ్మవారి ఆలయం పోటు కార్మికులు శంకర, సంతానంగా గుర్తింపు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. -
బాత్రూమ్ కడితేనే సంసారానికి వస్తా!
కర్నూలు జిల్లా: బాత్రూమ్ సమస్య ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఎదురుపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామాని కి చెందిన శివశంకర్ (35), అతని సోదరుడు పక్కపక్కన నివాసముంటున్నారు. రెండిళ్లకు కలసి ఒకే బాత్ రూమ్ ఉంది. కొన్నాళ్ల పాటు సర్దుకుంటూ వచ్చిన శివశంకర్ భార్య శశికళ ఇటీవల వేరుగా బాత్రూమ్ నిర్మించాలని కోరింది. 10 రోజుల క్రితం ఈ విషయంలో దంపతులు ఘర్షణ పడ్డారు. బాత్రూమ్ నిర్మించేంత వరకు ఇంట్లో ఉండనంటూ శశికళ జూపాడుబంగ్లాలోని పుట్టినింటికి వెళ్లిపోయింది. అయితే భర్త శివశంకర్ ఎంత బతిమలాడినా తిరిగిరాలేదు. దీంతో మనస్తాపం చెందిన శివశంకర్ శనివారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి తల్లి తేనె భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎం.రవీంద్రబాబు సోమవారం వెల్లడించారు. -
పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం
తిరుపతి: నగరంలో మైనర్ పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్వీ పాలిటెక్నిక్ చదువుతున్న బాధిత విద్యార్థిని ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఆమె మరో హాస్టల్‌కు మారుతున్న సమయంలో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే వారి పరిచయం పెరగడంతో విద్యార్థిని ర్యాపిడో డ్రైవర్‌ను ఆర్థిక సహాయం కోరింది. దీంతో అతను ఈ అవకాశాన్ని అలుసుగా తీసుకుని, నమ్మించి తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు విద్యార్థిని తెలిపింది.దీంతో ఆమె తన స్నేహితురాలితో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందుతుల ఆచూకీకై గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితుడు సాయికుమార్ పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు కొనసాగుతున్నట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. -
కులం కాటుకు ఎంటెక్ విద్యార్థిని బలి
ఒంగోలు టౌన్: కులం కాటుకు మరో యువతి బలైంది. ప్రేమిస్తున్నప్పుడు అడ్డురాని కులం పెళ్లి చేసుకోవడానికి అడ్డయింది. దాంతో ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి సూసైడ్ నోట్ ప్రకారం వివరాలివీ.. ఒంగోలు నగరంలోని కబాడిపాలెంకు చెందిన మైరాల నళిని, మహేంద్ర నగర్‌కు చెందిన సింగోలు శ్రీనివాస్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. నీవు లేకపోతే బతకలేనని చెప్పిన శ్రీనివాస్ నళినిని అన్ని విధాలా వాడుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. నీ కులం వేరు నా కులం వేరు.. ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడంలేదంటూ ఫోన్ కట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో శ్రీనివాస్‌తో మాట్లాడదామని శనివారం అతడి ఇంటికి వెళ్లింది. ‘శ్రీనివాస్ మాలలో ఉన్నాడు.. ఇంట్లోకి రావద్ద’ని అతని తల్లిదండ్రులు నళినిని బయట నుంచే పంపించేయడంతో ఇక శ్రీనివాస్‌తో తన పెళ్లి జరగదని ఆందోళనకు గురైన నళిని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించింది. ఆత్మహత్యకు ముందు బాధితురాలు రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్ చూపరులను కలచివేస్తోంది. దళిత సామాజికవర్గానికి చెందిన నళిని ఎంటెక్ చదివింది. తండ్రి దేవదానానికి నలుగురు ఆడపిల్లలు ఉండగా వారిలో ముగ్గురికి వివాహమైంది. నళిని మూడో సంతానం. వన్ టౌన్ సీఐ నాగరాజు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. దళిత హక్కుల సంఘం నాయకులు నీలం నాగేంద్రం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. నళిని మృతికి కారణమైన శ్రీనివాస్ మీద కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
స్పా ముసుగులో వ్యభిచారం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని మూడు స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులను పోలీసులు శనివారం చేపట్టారు. పది మంది యువతులతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యువతులను హోమ్‌కు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని పలు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు, క్రాస్ మసాజ్‌లు జరుగుతున్నాయని ఎస్పీ అజిత వేజెండ్లకు సమాచారమొచ్చింది. ఆమె ఆదేశాల మేరకు నిప్పో సెంటర్లోని ఎవిరీ డే సెలూన్ స్పా సెంటర్‌పై దాడి చేశారు. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకొని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్వాహకుడు మహేష పై కేసు నమోదు చేశారు. ⇒బాలాజీనగర్ సమీపంలోని జగదీష్ నగర్లో గల యూనిక్స్ సెలూన్ స్పాపై దాడి చేసి ముగ్గురు యువతులు, ఒక విటుడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్వాహకుడు సు«దీర్పై కేసు నమోదు చేశామని బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు. ⇒ రామలింగాపురంలోని వీఐపీ స్పాపై దాడి చేసి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని నిర్వాహకురాలు కృష్ణవేణిపై కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ చెప్పారు. పోలీసుల దాడులతో పలువురు నిర్వాహకులు స్పా సెంటర్లకు తాళాలు వేసి పరారయ్యారు. నగర ఇన్చార్జి డీఎస్పీ గిరిధర్ పాల్గొన్నారు. -
పెళ్లైన నెల రోజులకే నవ వరుడు ఆత్మహత్య
అనంతపురం జిల్లా: ఏడడుగుల బంధంతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాల్సిన యువకుడికి ఏం కష్టమొచ్చిందో ఏమో పెళ్లైన 33 రోజులకే జీవితంపై విరక్తి చెంది శెనగ పంటకు వాడే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరు గ్రామానికి చెందిన జయరాం నాయుడుకు శరత్ కుమార్ నాయుడు(23), లోకేష్ కుమార్ నాయుడు అనే ఇద్దరు కుమారులు. శరత్ కుమార్ నాయుడు మరో వ్యక్తితో కలిసి కొంత కాలంగా బెంగళూరులో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు లోకేష్ కుమార్ నాయుడు నగరూరులో తమ వ్యవసాయ తోటల్లో తండ్రికి చోదోడు వాదోడుగా ఉంటున్నాడు. గత నెల 2, 3వ తేదీల్లో బళ్లారి జిల్లాలోని సుగ్గేనహళ్లి కొట్టాల గ్రామానికి చెందిన సుస్మితతో శరత్ కుమార్ నాయుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. 10 రోజుల క్రితం తన భార్య సుస్మితను నగరూరు గ్రామంలో తమ ఇంటి వద్ద ఉంచి శరత్‌కుమార్ బెంగళూరు వెళ్లాడు. ఈ నెల 3వ తేదీన సుస్మిత తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఏం కష్టం వచ్చిందో కానీ.. శుక్రవారం బెంగళూరు నుంచి వచ్చిన శరత్‌కుమార్ తాడిపత్రి మీదుగా నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న తన స్నేహితుడు హరీష్ ఇంటికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో సిమెంట్ ఫ్యాక్టరీకి హరీష్ వెళ్లిన తర్వాత ఇంటిలో ఉన్న శరత్ కుమార్ నాయుడు తన సెల్ఫోన్లో భార్యతో సుమారు గంటసేపు మాట్లాడాడు. 9 గంటల తర్వాత తాను శెనగ గింజలకు వేసే క్రిమిసంహారక మాత్రలు మింగానని శరత్‌కుమార్ హరీష్‌కు ఫోన్ చేశాడు. వెంటనే గదికి వచ్చిన హరీష్ విలవిలలాడుతున్న శరత్‌కుమార్ నాయుడును ఓ వాహనంలో తాడిపత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. శరత్‌కుమార్ నాయుడిని పరీక్షించిన డాక్టర్లు ఇక లేడని తెలిపారు. అనంతపురానికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు మృతి చెందిన శరత్‌కుమార్ నాయుడిని చూసి కన్నీటి పర్యంత మయ్యారు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న మృతుడి భార్య సుస్మిత తన తల్లిదండ్రులతో అనంతపురానికి వచ్చి ఆసుపత్రిలో విగత జీవిగా ఉన్న భర్తను చూసి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.


