కొక్కొరొకో..

police special focus on cock fights in anantapur district - Sakshi

కాలుదువ్వుతున్న కోడి పుంజులు

అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు 

ప్రత్యేకంగా 30 యాక్టు అమలు చేస్తున్న వైనం 

ఇప్పటికే 271 మందిపై బైండోవర్‌ కేసులు 

సాక్షి, అనంతపురం‌: సంక్రాంతి అంటే హరిదాసు సంకీర్తనలు. గొబ్బెమ్మలు గుర్తుకు వస్తాయి. అదే కోస్తా జిల్లాల్లో అయితే పందెంకోళుŠల్‌  కదనరంగంలో కాళ్లు దువ్వుతాయి. ఈ సంస్కృతి ‘అనంత’కు కూడా విస్తరించింది. అయితే జిల్లాలో కోడిపందేలు ఆడటం మామూలుగా జరుగుతున్నా సంక్రాంతి పండుగ సమయంలో కొంత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కోడిపందేలపై కొరడా ఝుళిపించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆదేశించడంతో జిల్లా పోలీసులు కూడా అలర్ట్‌ అయ్యారు. వారం రోజుల నుంచి కోడిపందేలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి గ్రామంలోనూ దండోరాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా 30 పోలీసు యాక్టు అమలు చేస్తున్నారు. ఐదు కన్నా ఎక్కువ మంది గుమికూడినా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.  

ఆ ఆరు డివిజన్‌లపై ప్రత్యేక దృష్టి  
జిల్లాలో ఎక్కువగా శింగనమల, తాడిపత్రి, హిందూపురం, కదిరి, అనంతపురం, గుంతకల్లు ప్రాంతాల్లో కోడిపందేలు నిర్వహిస్తారని పోలీసులు గుర్తించారు. దీంతో ఆయ ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. గతంలో కోడిపందేలు ఆడుతూ పట్టుబడిన వారిని వారం రోజులుగా పోలీస్‌స్టేషన్‌లకు పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహించడం, తహసీల్దార్‌ల వద్ద బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 271 మందికి పైగా కోడిపందేల నిర్వాహకులను బైండోవర్‌ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 18 మందిని అరెస్ట్‌ చేసి వారి నుంచి 46 కోళ్లు, 23 కత్తులు, రూ. 11530లు స్వాధీనం చేసుకున్నారు.  

నిఘా కోసం జాయింట్‌ యాక్షన్‌ బృందాలు
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడి పందేలపై నిఘా ఉంచడానికి మండల స్థాయిలో జాయింట్‌ యాక్షన్‌ బృందాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు, జంతు సంక్షేమ కమిటీ సభ్యులతో కూడిన ఈ బృందాల ద్వారా నిఘా పెట్టడంతో ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఎక్కడైనా తనిఖీలు చేసే అధికారాలు ఈ బృందాలకు అప్పగించారు.  

కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు 
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడిపందేలు నిర్వహించడం నిషేదం. ఆడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్వాహకులతో పాటు స్థలాలు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు. 
                        – జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ 

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top