రూ.10 వేలిస్తే... లక్ష మీకే!

If You Have To Pay 10,000 Get 1 Lakh To You - Sakshi

అమాయక రైతులే టార్గెట్‌   

అకౌంట్‌లోకి మోదీ రూ.లక్ష వేశాడంటూ ప్రచారం 

రూ.10 వేలు డిపాజిట్‌ చేస్తే ఆ మొత్తం తీసుకోవచ్చట !

డిపాజిట్‌ సొమ్ము అందగానే బైక్‌లో తుర్రుమన్న యువకుడు 

సాక్షి, పుట్టపర్తి అర్బన్‌: ప్రధాని రుణాల పేరుతో యువకులు మోసం చేస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. డిపాజిట్‌ చేస్తే రుణాలు మొత్తం ఇచ్చేస్తామంటూ నమ్మబలికి నగదు తీసుకున్నాక ఉడాయించేస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. పుట్టపర్తి మండలం పెడపల్లి చిన్న తండాకు చెందిన రైతు హనుమానాయక్, క్రాంతిబాయి దంపతులు. వయసు పైబడటంతో ఇంటి వద్దే ఉంటున్నారు. కొడుకు, కోడలు అనంతపురంలో నివాసం ఉంటున్నారు. వృద్ధ దంపతుల ఇంటికి శుక్రవారం ఓ యువకుడు బైక్‌లో వచ్చాడు. ‘మీకు ప్రధాని మోదీ రూ.లక్ష నగదు మీ ఖాతాలో వేశాడు. ఇదిగో లక్ష రూపాయల కట్ట. మీరు రూ.10 వేలు డిపాజిట్‌ చెల్లిస్తే నా వద్ద ఉన్న రూ.లక్ష మీకు ఇస్తా’ అని నమ్మబలికాడు.


నగదు పోయిందని వాపోతున్న వృద్ధ దంపతులు  

సదరు రైతు ఆధార్, బ్యాంకు పాస్‌ పుస్తకం పరిశీలించి, వారి వద్ద నుంచి రూ.10 వేలు తీసుకున్నాడు. బ్యాంకు ఖర్చుకు మరో రూ.2 వేలు కావాలని అడిగి తీసుకున్నాడు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు వెళ్లాక రూ.లక్ష ఇస్తామనడంతో రైతు షర్ట్‌ మార్చుకుని వద్దామని లోనికెళ్లగానే.. ఆ యువకుడు బైక్‌లో తుర్రుమన్నాడు. రుణం పేరుతో తమకు టోకరా వేశాడని గ్రహించిన వృద్ధ దంపతులు లబోదిబోమన్నారు. క్రాంతిబాయి ఏడుస్తూ పెడపల్లి బస్టాండ్‌లో ఉండగా కొంతమంది విషయం ఆరా తీసి.. యువకుడి కోసం ద్విచక్రవాహనాల్లో వెళ్లి గాలించినా ఎక్కడా కనిపించలేదు. సబ్సిడీ విత్తన వేరుశనగకాయల కోసం అప్పు తెచ్చి పెట్టుకున్న సొమ్మును దుండగుడు దోచుకెళ్లాడని వృద్ధులు విలపించారు.

సరిగ్గా పది రోజుల క్రితం ప్రాథమిక పాఠశాల సమీపంలోని చిన్న అక్కులప్ప అనే ఓ రైతు నుంచి కూడా ఇలాగే చెప్పి రూ.10 వేలు టోకరా వేసినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం గీల్యానాయక్‌వద్ద నుంచి రూ.4 వేలు తీసుకొని పరారైనట్లు సమాచారం. అయితే దుండగుడి వివరాలు ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.   

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top