అడ్డంగా దోచేసిన ఆర్టీసీ

RTC robbery from the public - Sakshi

     సంక్రాంతి పండుగ సీజన్‌లో ఆర్టీసీ వసూళ్ల జాతర 

     ‘ఫ్లెక్సీ ఫేర్‌’తో ఇష్టారాజ్యంగా టిక్కెట్ల చార్జీల పెంపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యం 75 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) సంక్రాంతి సీజన్‌లో ఫక్తు వ్యాపార ధోరణిని ప్రదర్శించింది. ప్రయాణికుల అవసరాన్ని భారీగా సొమ్ము చేసుకుంది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సంస్థలతో పోటీ పడి మరీ ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసింది. సంక్రాంతి పండుగను సొంత గ్రామాల్లో చేసుకుందామని బయలుదేరిన వారికి ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల రుసుములు చూసి కళ్లు బైర్లు కమ్మాయి.

పండుగ నేపథ్యంలో 50 శాతం అదనంగా చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అయితే, ఈ అదనపు చార్జీలకు మించి మరింత ఎక్కువగా వసూళ్లు చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు అందుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంతో పాటు పలు రాయలసీమ జిల్లాల రూట్లలో భారీగా దోపిడీ జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  విమానయాన సంస్థలు ప్రయాణికుల రద్దీని బట్టి ఫ్లెక్సీ ఫేర్‌ విధానంలో టిక్కెట్ల ధరలను నిర్ణయిస్తాయి. ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సైతం పండుగ సీజన్‌లో ఫ్లెక్సీ ఫేర్‌ విధానాన్ని అమలు చేసింది. దీనిప్రకారం నచ్చిన రేట్లను వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సంక్రాంతి ముగిశాక జనమంతా తిరుగు ప్రయాణమవుతారు. తిరుగు ప్రయాణంలోనూ డిమాండ్‌ ఉంటుంది కాబట్టి ఆర్టీసీ యాజమాన్యం టిక్కెట్ల ధరలను భారీగానే పెంచేసింది. ఈ మేరకు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది. 

రాయితీల ఊసేది? 
ఏపీఎస్‌ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ కాకుండా కార్పొరేషన్‌ కావడంతో మనుగడ కోసం సొంత ఆదాయంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. పండుగ సీజన్‌లో ప్రత్యేక బస్సులు నడపండి, ప్రయాణికుల జేబులు కొల్లగొట్టండి అని ఆర్టీసీ యాజమాన్యానికి సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. ప్రభుత్వం రాయితీలు ఇస్తే ప్రయాణికులపై అదనపు భారం పడదు. సాధారణంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే అమరావతి ఏసీ సర్వీసులోచార్జీ రూ.808. ప్రత్యేక బస్సు పేరిట 50 శాతం అదనంగా, అంటే రూ.1,200కు పైగా వసూలు చేశారు. అన్ని ప్రధాన రూట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

ప్రైవేట్‌ ట్రావెల్స్‌దీ అదే దారి 
ఆర్టీసీలో అధిక చార్జీలను సాకుగా చూపి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కూడా ప్రయాణికులను ఇష్టారీతిన దోచుకుంటున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్నానికి రూ.3 వేలకు పైగా వసూలు చేశారంటే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. టిక్కెట్‌ ధరలను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్‌ ట్రావెల్స్‌తో కుమ్మక్కైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read latest Amaravati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top