ప్రకృతి సేద్యానికి కేరాఫ్‌ ఏపీ

AP is care of Naturopathy says chandrababu - Sakshi

      సీఎం చంద్రబాబు వెల్లడి

     సుభాష్‌ పాలేకర్‌ ప్రాజెక్టును ప్రమోట్‌ చేస్తా..

సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘ప్రకృతి సేద్యానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఆంధ్రప్రదేశ్‌. దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే చిరునామాగా నిలుస్తుంది’’ అని సీఎం చంద్రబాబు  చెప్పారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ ప్రాంతంలో ఆదివారం ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’పై రాష్ట్రస్థాయి శిక్షణ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 2018 సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి సేద్య నామ సంవత్సరంగా నామకరణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయంలో పాత పద్ధతులకు స్వస్తి పలకాలని, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలని రైతులకు సూచించారు. సుభాష్‌ పాలేకర్‌ వద్ద మంచి ప్రాజెక్టు ఉందని, తాను మార్కెట్‌ మేనేజర్‌గా మారి దాన్ని ప్రమోట్‌ చేస్తానని బాబు వివరించారు. 

ప్రకృతి సేద్యంతో అధిక దిగుబడులు 
రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ఏకైక మార్గం ప్రకృతి వ్యవసాయమేనని పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా సాగు చేసిన పంటలు వైపరీత్యాలను తట్టుకుని మంచి దిగుబడులు ఇస్తున్నాయని చెప్పారు. మూడేళ్లలో ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచంలో ఏపీ రోల్‌మోడల్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రగతే నా ధ్యాస
రాష్ట్ర ప్రగతి, ప్రజలందరి పురోగతే తన నిరంతర ధ్యాస అని సీఎం చంద్రబాబు  పేర్కొన్నారు. అందరి శ్రేయస్సు, సంక్షేమం, సర్వతోముఖ వికాసానికి తాను దీక్ష తీసుకున్నానని, రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నమూనాగా నిలపాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. కొత్త ఏడాదిలోకి  అడుగుపెడుతున్న సందర్భంగా బాబు ఆదివారం రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా లేఖను విడుదల చేశారు. తెలుగువారు ఎక్కడున్నా ఈ పండక్కి వచ్చి సొంతగడ్డ రుణం తీర్చుకోవాలని కోరారు. తెలుగు ప్రజలందరికీ సీఎం చంద్రబాబు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.   

Read latest Amaravati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top