కృష్ణా నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు, మంత్రులు పరివాహక ప్రాంతంలో తాజా పరిస్థితిని అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు కరకట్ట లోపల ఉన్న భవనాలను పరిశీలించారు.
కరకట్ట లోపల ఉన్న గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్‌తోపాటు, తులసి వనం మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం, నీటి మునిగిన పొలాలను మంత్రుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాన్ని ఖాళీ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వరద నీరు కరకట్టపైన ఉన్న నివాసాల్లోకి రావడంతో.. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టామని చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోవద్దని హితవు పలికారు.